కారు ప్రమాదాలకు ఫుల్ స్టాప్ పెట్టలేమా? | Sakshi
Sakshi News home page

కారు ప్రమాదాలకు ఫుల్ స్టాప్ పెట్టలేమా?

Published Thu, Apr 24 2014 4:34 PM

కారు ప్రమాదాలకు ఫుల్ స్టాప్ పెట్టలేమా? - Sakshi

ఏటా కారు ప్రమాదాలు దాదాపు పది లక్షల ప్రాణాలను హరించేస్తున్నాయి. బుధవారం రాత్రి వైఎస్ ఆర్ కాంగ్రెస్ కీలక నేత శోభా నాగిరెడ్డి కూడా కారు ప్రమాదంలో మరణించారు. కారు ప్రమాదాలకు ఫుల్ స్టాప్ పెట్టలేమా? విలువైన ప్రాణాలను కాపాడలేమా?

కారు ప్రమాదాలను నివారించే దిశగా ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. ఆ పరిశోధనల నుంచే 1948 లో రోడ్ గ్రిప్, త్వరగా బ్రేక్ పడే అవకాశాలున్న రేడియల్ టైర్లు వచ్చాయి. 1958 లో వోల్వో కంపెనీ సీట్ బెల్టుల్ని కనుగొంది. 1950 లో ఎయిర్ బ్యాగ్స్ వాడకం మొదలైంది. కారు ప్రమాదం జరగగానే ఒక బెలూన్ విచ్చుకుని దెబ్బ తగలకుండా షాక్ అబ్సార్బ్ చేస్తుంది. అయితే శోభా నాగి రెడ్డి విషయంలో ఎయిర్ బాగ్స్ విచ్చుకోలేదు. ఇటీవలే పలు ఆటో మొబైల్ కంపెనీలు ఎయిర్ బ్యాగ్స్ సరిగా పనిచేయకపోవడంతో లక్షలాది కార్లను వెనక్కి రప్పించాయి.

కారు ప్రమాదాలను పూర్తిగా నివారించే దిశగా మూడు రంగాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి.

ఆటో బ్రేకింగ్ - ముందున్న వాహనాలకు కారు మరీ దగ్గరగా వస్తే తనంతట తానుగా బ్రేక్ పడిపోయే టెక్నాలజీని ప్రస్తుతం రూపొందిస్తున్నారు. కారు లో ఉండే సెన్సర్లు కారును తక్షణం ఆపేస్తాయి. స్వీడెన్ లో ఈ దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి.

ఇంటెలిజెంట్ విండ్ స్క్రీన్ - డ్రైవర్ కారు నడిపేటప్పుడు ఎటు వైపు చూస్తున్నారన్న విషయాన్ని విండ్ స్క్రీన్ కనిపెట్టి డ్రైవర్ కి సలహా ఇచ్చేలా శాస్త్రవేత్తలు వ్యవస్థలను రూపొందిస్తున్నారు. రోడ్డు అంచు ఎక్కడ ఉంది, డ్రైవర్ దృష్టి ఎక్కడుంది వంటి విషయాల్లో డ్రైవర్ కి విండ్ స్క్రీన్ సూచనలను ఇస్తుంది.

క్రాష్ టెస్ట్ డమ్మీ -  కారు నడిపించే వారి ఎత్తు, బరువు, వయస్సు వంటి అంశాల ఆధారంగా, ఎంత వేగంతో ఢీకొన్నారు లేదా పల్టీ కొట్టారన్న అంశాల ఆధారంగా శాస్త్రవేత్తలు వందకు పైగా నమూనాలను తయారు చేశారు. ఎంత బరువున్న వ్యక్తి ఎంత వేగంతో ఢీకొంటే ఏయే అవయవానికి ఎంత ప్రమాదకారి వంటి అంశాలను పరిశీలించి దాని ఆధారంగా భద్రతా ఏర్పాట్లు చేయడానికి వీలుంటుంది. ఈ పరిశోధనలు ప్రమాదాలను వీలైనంత వరకూ తగ్గించగలవు.

ఎన్ని భద్రతా ఏర్పాట్లున్నా మానవ తప్పిదమే అన్నిటికన్నా ప్రమాదకరమైన సమస్య. మితిమీరిన వేగం, రోడ్డు పై దృష్టి లేకపోవడం, నిద్ర లేమితో డ్రైవ్ చేయడం, మద్యం వంటి పదార్థాలు సేవించడం వంటివి తగ్గించుకుంటే ప్రమాదాలను చాలా వరకు తగ్గించవచ్చు.

Advertisement
Advertisement