పట్టిసీమపై కట్టుకథలు

CAG slams Andhra government over Pattiseema irrigation scheme - Sakshi

కమీషన్ల కోసమే ఎత్తిపోతల పథకం

రూ.372.07 కోట్లు దోచేశారని ‘కాగ్‌’ స్పష్టీకరణ 

సాక్షి, అమరావతి: కృష్ణా నదీ జలాల విషయంలో రైతుల ప్రయోజనాలను పరిరక్షించడంలో తన వరుస వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారు. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు కనికట్టు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తే గోదావరి డెల్టాకే కాదు, కృష్ణా డెల్టాలోనూ రెండో పంట సాగుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ, పోలవరం నిర్మాణం విషయంలో తాత్సారం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పూర్తయిన పోలవరం కుడికాలువ మీదుగా కృష్ణా డెల్టాకు నీళ్లందించే ముసుగులో కమీషన్ల కోసం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. పట్టిసీమ పేరుతో రూ.372.07 కోట్లు దోచేశారని సాక్షాత్తూ కాగ్‌(కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) తన నివేదికలో బహిర్గతం చేసింది. దీంతో జనం కళ్లు గప్పేందుకు చంద్ర బాబు నిత్యం అబద్ధాల దండోరా వేస్తున్నారు. ముఖ్య మంత్రి మాటలు విని కృష్ణా డెల్టా రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

ఆ నిధులు అప్పుడే ఇచ్చి ఉంటే..
కృష్ణా డెల్టాలో ఖరీఫ్‌ పంటలు ఆలస్యంగా సాగు చేయడం వల్ల కోతల సమయంలో తుఫాన్ల దెబ్బకు రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. జూన్‌లోనే ఖరీఫ్‌ సాగుకు నీళ్లం దించడంతోపాటు రబీ పంటలకూ నీళ్లు ఇవ్వాలన్న లక్ష్యం తో.. తెలంగాణ ప్రాంతం నేతలు అడ్డుపడినా ఖాతరు చేయకుండా పులిచింతల ప్రాజెక్టును దివంగత ముఖ్య మంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ఆగమేఘాలపై ఆ ప్రాజెక్టును పూర్తి చేశారు. ముంపునకు గురైన గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించేందుకు కేవలం రూ.193.14 కోట్లు పరిహారం చెల్లిస్తే.. పులిచింతల ప్రాజెక్టులో 45.77 టీఎంసీలు నిల్వ చేసుకోవచ్చు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం 2015 సెప్టెంబరు 24న రూ.78.12 కోట్లు తెలంగాణ సర్కార్‌కు ఇచ్చింది.

గతేడాది ఆగస్టులో భారీ వర్షాలు కురవడంతో పులిచింతల ప్రాజెక్టులోకి వరద జలాలు వచ్చాయి. పరిహారం చెల్లించిన తర్వాతే ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయాలని తెలంగాణ ప్రభుత్వం అల్టిమేటం జారీ చేయడంతో 2016 ఆగస్టు 31న ఏపీ ప్రభుత్వం రూ.66.02 కోట్లు విడుదల చేసింది. ఇంకా రూ.49 కోట్లు విడుదల చేయకపోవడంతో పులిచింతల ప్రాజెక్టులో 30 టీఎంసీలకు మించి నిల్వ చేయడానికి తెలంగాణ సర్కార్‌ అంగీకరించలేదు. దీంతో గతేడాది 55.21 టీఎంసీల కృష్ణా జలాలను ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి విడుదల చేయాల్సి వచ్చింది. తెలంగాణ సర్కార్‌ హెచ్చరికలు జారీ చేయడంతో ఈ ఏడాది మార్చి 17న మిగతా రూ.49 కోట్ల పరిహారాన్ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులను గత ఏడాదే విడుదల చేసి ఉంటే పులిచింతలలో 45.77 టీఎంసీలను పూర్తిస్థాయిలో నిల్వ చేసుకునే అవకాశం ఉండేది. కృష్ణా డెల్టాలో ఖరీఫ్‌ పంటల సాగుకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. 

నిధుల ఎత్తిపోతల పథకాలు 
ఏటా కృష్ణా, గోదావరి నదులకు ఇంచుమించుగా జూలై నుంచి అక్టోబర్‌ వరకూ దాదాపు 90 రోజులపాటు ఒకేసారి వరద వస్తుంది. గోదావరి నీటిని నిల్వ చేసే జలాశయం లేకపోవడం, పులిచింతలకు దిగువన కృష్ణా నదిపై నీటిని నిల్వ చేసే జలాశయం కూడా లేకపోవడం వల్ల ఏటా వందలాది టీఎంసీలు వృథాగా సముద్రంలో కలిసి పోతున్నాయి. వరదను ఒడిసి పట్టి గోదావరి డెల్టాలో రెండో పంటకు పుష్కలంగా నీటిని అందించడం.. కొత్తగా 7.21 లక్షల ఎకరాలకు సాగునీరు, 500 గ్రామాలకు తాగునీరు, విశాఖపట్నం ప్రజల తాగునీటి, పారిశ్రామిక అవసరాలను తీర్చడం, కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను మళ్లించడం, తద్వారా శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీటిని సరఫరా చేయడమే ధ్యేయంగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టును చేపట్టారు. పోలవరం రిజర్వాయర్‌లో 194.1 టీఎంసీలను నిల్వ చేయవచ్చు. వైఎస్‌ హయాంలో పోలవరం కుడి కాలువ దాదాపుగా పూర్తయ్యింది. ఎడమ కాలువ 161 కిలోమీటర్ల మేర పూర్తయ్యింది. జలాశయం పనులను పూర్తి చేస్తే గ్రావిటీ ద్వారా కృష్ణా డెల్టాతోపాటు విశాఖకూ గోదావరి జలాలను తరలింవచ్చు. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు భారీగా కమీషన్లు కొల్లగొట్టేందుకు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తెచ్చారు. వైఎస్‌ హయాంలో పూర్తయిన పోలవరం కుడి కాలువ మీదుగా గోదావరి నీళ్లను కృష్ణా డెల్టాకు తరలించి.. నదుల అనుసంధానం చేశానంటూ గొప్పలు పోయారు. ఇందుకోసం రూ.1,647 కోట్లు వ్యయం చేశారు. ఇదే ఊపులో పోలవరం ఎడమ కాలువ మీదుగా ‘ఏలేరు’కు గోదావరి జలాలను తరలించడానికి రూ.1,660 కోట్లతో పురుషోత్తపట్నం ఎత్తిపోతలను చేపట్టారు.  పోలవరం ప్రాజెక్టు పూర్తయితే పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలతో అవసరమే ఉండదు. 2018 నాటికి పాక్షికంగా, 2019 నాటికి పూర్తిగా పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తామని పదేపదే చెబుతున్న చంద్రబాబు ఈ రెండు ఎత్తిపోతల పథకాలను చేపట్టడంలో ఆంతర్యం ఏమిటన్నది బహిరంగ రహస్యమే. 

రైతులపై పెనుభారం  
కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. డెల్టా తూర్పు, పశ్చిమ కాలువల ఆయకట్టుకు నీళ్లందించాలంటే 16,000 క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేయాలి. కానీ, పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా 8,500 క్యూసెక్కులను ఎత్తిపోసినా.. ప్రకాశం బ్యారేజీకి 7,000 క్యూసెక్కులు చేరుతాయి. దీనివల్ల కాలువలకు పూర్తి సామర్థ్యం మేరకు నీటిని విడుదల చేయని దుస్థితి నెలకొంది. దాంతో పులిచింతలలో నిల్వ చేసిన నీటిని దిగువకు విడుదల చేసి.. కాలువలకు 8,000 నుంచి 8,500 క్యూసెక్కులు విడుదల చేశారు. పొట్ట దశలో ఉన్నప్పుడు పంటలకు అధికంగా నీళ్లు అవసరం. కాలువల్లో నీళ్లందకపోవడంతో రైతులు వేలాది రూపాయలు వెచ్చించి డీజిల్‌ మోటార్ల ద్వారా పొలాలకు నీటిని తోడుకోవాల్సి వచ్చింది. ఇక పట్టిసీమ ఫలాలను రాయలసీమకూ అందించామని చంద్రబాబు చెబుతున్న మాటల్లో వీసమెత్తు వాస్తవం లేదు. తెలుగుగంగ, శ్రీశైలం కుడిగట్టు కాలువ(ఎస్సార్‌బీసీ), కేసీ కెనాల్‌ ఆయకట్టు కింద ఆరు తడి పంటలకే నీళ్లందించలేని దుస్థితి నెలకొంది. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్కులకు పెంచే పనులు రూ.45 కోట్లు ఖర్చు చేస్తే పూర్తవుతాయి. కానీ, ఆ పనులను పూర్తి చేయకపోవడం వల్ల గాలేరు–నగరి, తెలుగుగంగ, ఎస్సార్‌బీసీలకు పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించలేకపోతున్నారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం తొలి దశ కింద 1.98 లక్షల ఎకరాలకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీ పనులు చేయకుండా రూ.1,100 కోట్లతో ప్రధాన కాలువ విస్తరణ పనులు చేపట్టి సీఎం రమేశ్‌ వంటి కోటరీలోని కాంట్రాక్టర్లకు వాటిని అప్పగించి చంద్రబాబు కమీషన్లు జేబులో వేసుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top