కంటెయినర్‌ను ఢీకొని బస్సు దగ్ధం | Sakshi
Sakshi News home page

కంటెయినర్‌ను ఢీకొని బస్సు దగ్ధం

Published Thu, Jul 28 2016 3:26 AM

కంటెయినర్‌ను ఢీకొని బస్సు దగ్ధం - Sakshi

- ప్రయాణికులకు తప్పిన ముప్పు
- ప్రకాశం జిల్లాలో ఘటన
 
 గుడ్లూరు : వేగంగా వెళ్తున్న ప్రైవేట్ బస్సు ముందు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టడంతో ఇంజన్‌లో నుంచి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రయాణికులు బస్సులో నుంచి బయటకు దూకి ప్రాణాలను కాపాడుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలోని మోచర్ల-వీరేపల్లి మధ్య జాతీయ రహదారిపై బుధవారం వేకువజామున జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు మంగళవారం రాత్రి 11 గంటలకు 20 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి చెన్నైకు బయలుదేరింది. ఒంగోలులో ఇద్దరు దిగగా బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నారు. తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో బస్సు వీరేపల్లి దాటగానే నెల్లూరు వైపు వెళ్తున్న కంటైనర్ లారీని వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఇంజిన్‌లో మంటలు చెలరేగారుు.

ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి ప్రాణ భయంతో అద్దాలు పగులగొట్టుకొని బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. వారు బయటకు రాగానే క్షణాల్లో మంటలు వేగంగా వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో నుంచి దూకే సమయంలో ప్రయాణికులు రాము, వీరేశం, బస్సు డ్రైవర్ మోయిష్‌తోపాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. బస్సు ఢీకొట్టడంతో లారీ రోడ్డు పక్కనే ఉన్న గుంతలో బోల్తా కొట్టి తిరగబడింది. అందులో ఉన్న డ్రైవర్, క్లీనర్‌లు ప్రాణాలతో బయటపడ్డారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. బస్సు అతివేగంగా వెళ్లడమే ప్రమాదానికి కారణమని కందుకూరు డీఎస్పీ ప్రకాశ్‌రావు చెప్పారు.

Advertisement
Advertisement