జిల్లాను మంత్రి బొత్స సత్యనారాయణ నాశనం చేస్తున్నారని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుజయ్ కృష్ణ రంగారావు ధ్వజమెత్తారు.
మంత్రి బొత్స వల్లే జిల్లా నాశనం
Jan 28 2014 2:59 AM | Updated on May 25 2018 9:12 PM
గరివిడి, న్యూస్‌లైన్:జిల్లాను మంత్రి బొత్స సత్యనారాయణ నాశనం చేస్తున్నారని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుజయ్ కృష్ణ రంగారావు ధ్వజమెత్తారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆదాడ మోహన్‌రావు ఆధ్వర్యంలో చీపురుపల్లి నియోజకవర్గ దళిత శంఖారావం కార్యక్రమం గరివిడిలోని ఫేకర్ కల్యాణ మండపంలో సొమవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మంత్రి బొత్స కుటుంబ సభ్యులు జిల్లాను అన్ని విధాలుగా దోచుకుని నాశనం చేశారని ఆరోపిం చారు.
మంత్రి బొత్స, ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను) పేదలకు,దళితులకు ఉద్యోగాలను కూడా విచ్చలవిడిగా అమ్ముకున్నారని విమర్శించారు. దీని వల్ల ఎంతో మంది పేదవారు ఉద్యోగాలను కోల్పోయారని ఆవేదన వెలిబుచ్చారు. మంత్రి బొత్స రాజకీయాన్ని వ్యాపార రంగంగా మాచ్చేశారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో మద్యం, డబ్బు లు పంచి మళ్లీ గెలుపొందాలని మంత్రి ప్రణాళిక రూపొందిస్తున్నారని ఆరోపించారు. మంత్రి బొత్సను ఈ సారి ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా అభివృద్ధికి మంత్రి బొత్స చేసిందేమీ లేదని పెదవి విరిచారు. మహానేత వైఎస్‌ఆర్ మరణించిన తరువాత దళితులకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. దళితుల గుండె చప్పుడు తమ పార్టీ అధినేత జగన్ అని అభివర్ణించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకే జగన్‌మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు.
ఆ పార్టీ జిల్లా కన్వీనరు పెనుమత్స సాంబశివరాజు మాట్లాడుతూ చీపురుపల్లిలో దళితులకు మంజూరైన 21 వ్యవసాయ మోటార్లను కాంగ్రెస్ నాయకులు తమ పొలాల్లో వేసుకున్నారని ఉదాహరణలతో వివరించారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్సుమెంటు తదితర పథకాలు కొనసాగించే సత్తా ఒక్క జగన్‌కే ఉందన్నారు. చీపురుపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మీసాల వరహాల నాయుడు మాట్లాడుతూ జరగబోయే ఎన్నికల్లో దళితులందరరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.
ఆదాడ మోహన్‌రావు మాట్లాడుతూ దళితులందరూ వైఎస్‌ఆర్‌సీపీకి అండ గా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు శనపతి శిమ్మినాయుడు,తుమ్మగంటి సూరినాయుడు,సి.ఎ. సత్యనారాయణరెడ్డి,నాలుగు మండలాల దళితనేతలు గుండేల ఆదినారాయణ,సామంతుల రామస్వామి, గిడిజాల శ్రీను, సిమ్మాల రామ్మూర్తి, రేగిడి రామకృష్ణలతో పాటు సుమారు వెయ్యి మంది దళితులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement