గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ బహిరంగసభకు జిల్లా నుంచి పెద్దఎత్తున జనసమీకరణ చేసేందుకు కమలనాథులు కసరత్తు చేశారు.
మోడీ సభకు కమల దండు
Aug 11 2013 5:05 AM | Updated on Mar 29 2019 9:18 PM
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ బహిరంగసభకు జిల్లా నుంచి పెద్దఎత్తున జనసమీకరణ చేసేందుకు కమలనాథులు కసరత్తు చేశారు. ఆదివా రం హైదరాబాద్‌లో నవభారత యువభేరి పేరుతో భారతీయ జనతా పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. నెల రోజులుగా ఈ సభ విజయవంతం కోసం జిల్లాలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాన్ని నా యకత్వం చేపట్టింది. ప్రధానంగా బైక్ ర్యాలీలు, ప్రదర్శనలు, కాగడాల ప్రదర్శన నిర్వహించారు. నిజామాబాద్ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ రానున్న ఎన్నికల్లో ఇందూరు పార్లమెంట్ స్థానంపై దృష్టి సారించడంతో మోడీ సభను అనుకూలంగా మలుచుకునేందుకు జిల్లాలో విస్తృతంగా పర్యటించి సభలు, సమావేశాలు నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, రాష్ట్ర నాయకుడు పెద్దోళ్ల గంగారెడ్డితో పాటు నియోజక వర్గ ఇన్‌చార్జిలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు. సంస్థాగతంగా బలంగా ఉన్న నిజామాబాద్ అర్బన్‌తో పాటు ఆర్మూర్, నిజామాబాద్‌రూరల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ నియోజక వర్గాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలతో పాటు జనసమీకరణకు ఏర్పాట్లు చేశారు.
ఈ మేరకు రెండు వందల బస్సులు, రెండు వందల సుమోలు, జీపులను వినియోగిస్తున్నారు. అదే విధంగా స్వచ్ఛందంగా మోడీ సభకు తరలించే వారికి తగిన సూచనలను , సలహాలను నాయకత్వం ఇచ్చింది. డాక్టర్లు, వ్యాపారులు, న్యాయవాదులు ఈ సభకు తరలిరానున్నట్లు బీజేపీ పేర్కొంది. తెలంగాణ విషయంలో కాంగ్రెస్, టీడీపీలు ద్వంద్వ వైఖరితో ప్రజలను మోసం చేస్తున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. సీమాంధ్రలో ఉన్న కాంగ్రెస్ నాయకులు సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తుండగా తెలంగాణలోని నాయకులు ప్రత్యేక ప్రకటన ఏర్పాటు పూర్తయిందని సంబరాలు జరుపుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ ఎద్దేవా చేస్తోంది. తెలంగాణ విషయంలో ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ రెండు ప్రాంతాల్లోని నాయకత్వాన్ని ఒప్పించడంలో పూర్తిగా విఫలం అయ్యిందని,
దీంతో రాజకీయ లబ్ధికోసం రెండు ప్రాంతాల వారిని రెచ్చగొడుతోందని బీజేపీ ఆరోపిస్తుంది.తెలంగాణ విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ప్రకటించిన ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని, అయితే హైకమాండ్ గుండ్లప్పగించి చూస్తుందే తప్ప సరైన నిర్ణయంతో ముందుకు సాగడం లేదని బీజేపీ నేతలు అంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తెలంగాణకు అనుకూలమేనంటూ మరోవైపు సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా ప్రధానికి లేఖ రాయడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్, టీడీపీ మోసాలను ఎండగట్టాడానికే బీజేపీ నవభారత యువభేరి బహిరంగసభను హైదరాబాద్‌లో నిర్వహిస్తుందని ఆ పార్టీ నేతలు వివరించారు. పార్లమెంట్‌లో బేషరతుగా తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తామని బీజేపీ ఏనాడో చెప్పిందని, కేంద్రంలో అధికారంలోకి రాగానే ప్రథమంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తీరుతుందని స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అందుల్లో భాగంగానే నవభారత యువభేరి సభను నిర్వహిస్తుందని యువనేత, భారత రథసారథి నరేంద్రమోడీతో సహా జాతీయ రాష్ట్ర నాయకులు పాల్గొంటున్నారని బీజేపీ పేర్కొంది.
Advertisement
Advertisement