‘భరత్‌ అనే నేను’ రాజకీయ నేతలకు కనువిప్పు

Bharat Ane Nenu 100 Days Centre  - Sakshi

కృష్ణ, మహేష్‌బాబు ఫ్యాన్స్‌ గౌరవాధ్యక్షుడు, వైఎస్సార్‌  సీపీ నేత ఆదిశేషగిరిరావు

 నగరంలో ఘనంగా చిత్రం శత దినోత్సవం

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): ‘భరత్‌ అనే నేను’కమర్షియల్, సందేశాత్మక చిత్రమని, రాజకీయ నేతలకు ఈ చిత్రం కనువిప్పు కలిగించిందని సూపర్‌స్టార్‌ కృష్ణ, మహేష్‌బాబు ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత, వైఎస్సార్‌ సీపీ నేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు (బంగారయ్య) అన్నారు. అశోక థియేటర్‌ ఆవరణలో శనివారం రాత్రి రాజమహేంద్రవరం నగర సూపర్‌స్టార్‌ కృష్ణ, మహేష్‌బాబు ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ చిత్రం శత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గీతం ఫిలిమ్స్‌ శాస్త్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ భరత్‌ అనే నేను చిత్రానికి మహేష్‌బాబు, దర్శకుడు కొరటాల శివ పిల్లర్లుగా, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, అభిమానులను మూలస్తంభాలు అభివర్ణించారు.

 అభిమానులందరికీ అన్నయ్య కృష్ణ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పమన్నారని తెలిపారు. చిలకలూరిపేట తదితర ప్రాంతాల్లో శత దినోత్సవాలు ఉన్నప్పటికీ  ఇక్కడికే వచ్చానని తెలిపారు. మరిన్ని సందేశాత్మక, సామాజికపరమైన సినిమాల్లో మహేష్‌బాబు నటిస్తారని తెలిపారు. ఏపీఐసీసీ మాజీ చైర్మన్‌ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ చిత్రం రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే సంచలనం అయిందన్నారు. సినిమా డిస్ట్రిబ్యూటర్‌ ఇష్ణా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత భరత్‌ చౌదరి మాట్లాడుతూ ఈ చిత్రాన్ని పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. 

ఈ సినిమాలో నటించిన ‘అంతరికరణ శుద్ధి’ సుబ్బారావు మాట్లాడుతూ కోనసీమలో పుట్టి, నగరంలో చదువుకుని, వృత్తి రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్న రాజశేఖర్‌ అనే నేను.. శుభోదయం సుబ్బారావు అంటూ అభిమానులను అలరించారు. అనంతరం శేషగిరిరావు కేక్‌ను కట్‌ చేసి, డిస్ట్రిబ్యూటర్స్‌కు, ఎగ్జిబిటర్స్‌కు మెమెంటోలను అందజేశారు.  వికలాంగులకు వీల్‌చైర్లు అందజేశారు. జిల్లా డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి అనుశ్రీ సత్యనారాయణ, వానపల్లి గౌరీశంకర్, సురేష్‌ మూవీస్‌ రమేష్, మణికంఠ ఫిలిమ్స్‌ సత్తిబాబు, బుచ్చిరాజు, అశోక థియేటర్‌ అధినేత రాజబాబు, మేనేజర్‌ గెడ్డం శ్రీను, రౌతు రవీంద్ర, ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు, మహేష్‌బాబు అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top