ప్రతి జిల్లాలో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు: అవంతి శ్రీనివాస్‌

Avanthi Srinivas: Sports Complex Will Establishment In Every District - Sakshi

సాక్షి, తాడేపల్లి : యువజన సర్వీసులు, పర్యాటకశాఖపై శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. 15 పర్యాటక ప్రదేశాల్లో వరల్డ్‌ క్లాస్‌ హోటళ్లు వచ్చేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని తెలిపారు. నదిలో బోటు రవాణాపై త్వరలోనే కమిటీ వేసి నివేదిక అందిస్తామని తెలిపారు. అలాగే నదిలో కమాండ్‌ కంట్రోల్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బోట్ల ఫిట్‌నెస్‌ చూశాకే అనుమతి ఇక్కడి నుంచే ఇస్తామని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో స్టేడియల ప్రతిపాదనకు మంత్రి ఆమోదం తెలిపారు. జిల్లాకు ఒక స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌, మండల, నియోజకవర్గ స్థాయి స్టేడియం అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందిస్తామని మం‍త్రి అవంతి శ్రీనివాస్‌  అన్నారు. 

కొండపల్లి పోర్ట్, గాంధీ మ్యూజియం త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని వెల్లడించారు. త్వరలోనే ఆర్కియాలజీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయనున్నామని, భాషా, సంస్కృతి అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి తెలిపారు. సంస్కృతి వికాస కేంద్రాల ఏర్పాటు చేయాలని సూచించారు. కళాకారులను గుర్తించి ప్రోత్సాహం అందించనున్నట్లు వెల్లడించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌తో ఇంటిగ్రేడ్‌ చేయాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. కోటి రూపాయలతో శిల్పారామాలకు మరమ్మత్తులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా ఇడుపులపాయలోనూ శిల్పారామం ఏర్పాటు చేయనున్నట్లు అవంతి తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top