రాష్ట్రంలోని విమానాశ్రయాల విస్తరణపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి పి. అశోక్ గజపతిరాజుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చించారు.
సచివాలయంలో సీఎంను కలిసిన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విమానాశ్రయాల విస్తరణపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి పి. అశోక్ గజపతిరాజుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చించారు. అశోక్ గజపతిరాజు శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. విశాఖ విమానాశ్రయం విస్తరణకు నావికాదళం నుంచి భూమిని ఎలా తీసుకోవాలనే అంశంపై చర్చించారు.
తిరుపతి విమానాశ్రయం విస్తరణకు భూమి సమస్య కాదని అభిప్రాయపడ్డారు. గన్నవరం విమానాశ్రయానికి ఒకవైపు కాలువలు, మరోవైపు జాతీయ రహదారి ఉన్నందున, ఇక్కడ విస్తరణ ఏ విధంగా చేపట్టాలో పరిశీలించాలని నిర్ణయించారు. ఈ మూడు విమానాశ్రయాలను సందర్శించి, వాటి విస్తరణ, అంతర్జాతీయ హోదాకు తీసుకోవాల్సిన చర్యలపై ఒక నిర్ణయానికి రావాలని అశోక్ గజపతిరాజును సీఎం కోరినట్లు సమాచారం.
22న ఢిల్లీకి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 22న ఢిల్లీ వెళ్లనున్నారు. 24వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతుండటంతో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయన ఢిల్లీ వెళుతున్నట్లు సమాచారం. 23వ తేదీ నుంచి చంద్రబాబు జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. కాగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి సీఎం చంద్రబాబును సచివాలయంలో కలిశారు.
సింగపూర్ పర్యటన విజయవంతమైంది
తన సింగపూర్ పర్యటన విజయవంతమైందని సీఎం చంద్రబాబు ట్విట్టర్‌లో తన సందేశాన్ని పోస్ట్ చేశారు.