
కుందుర్పి‘మీకోసం’లో అర్జీలు ఇచ్చేందుకు బారులుతీరిన ప్రజలు
అనంతపురం అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లోనూ, కుందుర్పి మండలం కేంద్రాల్లో నిర్వహించిన ‘మీ కోసం’ కార్యక్రమాల్లో ప్రజల నుం చి ఫిర్యాదులు వెల్లువలా వచ్చాయి. ఈ రెండు చోట్ల మొత్తం వివిధ సమస్యలపై 786 అర్జీలు వచ్చాయి. అనంతపురంలో డీఆర్‌ఓ ఎస్.రఘునాథ్‌తో పాటు డిప్యూటీ కలెక్టర్ ఆనంద్, పాలనాధికారి విజయలక్ష్మి, సెక్షన్ తహసీల్దారులు హరికుమార్, నాగరాజు, ఏడీఏ విద్యావతి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇక్కడ వివిధ సమస్యలపై 260 అర్జీలు వచ్చాయి. కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో కలెక్టర్ జి.వీరపాండియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి ‘మీ కోసం’లో ప్రజల నుంచి 526 అర్జీలు అందాయి.
కొన్ని సమస్యలు ఇలా..
♦ ఆలయం భూమిలో (సర్వేనంబర్‌లో 547లో 8.20 ఎకరాల భూమి) శ్మశానవాటిక ఏర్పాటుకు సిద్ధపడ్డారని, ఈ చర్యను నిలుపుదల చేయిం చాలని విడపనకల్లు మండలం విడపనకల్లు గ్రామానికి చెందిన ఎం.శివరుద్రస్వామి విన్నవించారు.
♦ తన భూమి (సర్వే నంబర్లు 145, 146, 139లో)ని ఆన్‌లైన్‌లో నమోదు చేయడం లేదని నల్లమాడకు చెందిన పి.ఖాదర్‌బాషా ఫిర్యాదు చేశాడు. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకపోయిందని వాపోయాడు.
♦ అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఆపాస్ (ఏపీ ఉపాధ్యాయ సంఘం) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వరప్రసాద్, టి.నారాయణస్వామి విన్నవించారు.
♦ సర్వే నెంబరు 442–3ఎలో తమకు 3.22 ఎకరాల భూమి ఉందని, మోటారు, పైప్‌లైన్ కోసం ఎస్టీ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకున్నా మంజూరు చేయలేదని నూతిమడగు పంచాయతీ తిప్పేపల్లికి చెందిన ఇ.కదిరయ్య ఫిర్యాదు చేశాడు.
♦ ఆర్మీలో ఉద్యోగ విరమణ చేసిన తనకు మాజీ సైనికుల కోటాలో వ్యవసాయ భూమిని మంజూరు చేయాలని కోరినా పట్టించుకోవడం లేదని పెనుకొండ మండలం వెంకట రెడ్డిపల్లికి చెందిన మాజీ సైని కోద్యోగి కె.భాస్కర్ ఫిర్యాదు చే శాడు.
♦ ఏడాదిన్నర క్రితం విశాఖపట్నంలో సెలక్షన్స్‌లో త్రిపుర స్టేట్ రైఫిల్స్‌కు ఎంపికయ్యామని, అయినా నియామక ఉత్తర్వులు అందలేదని నీలకంఠ, సురేశ్, ప్రశాంత్, కిరణ్‌కుమార్, శ్రీనివాసులు విన్నవించారు.
♦ ఇతని పేరు మేకల గంగన్న. బత్తలపల్లిలో నివాసముంటున్నాడు. ముదిగుబ్బ మండలం గుంజేపల్లిలో ఇతనికి 827 సర్వే నంబరులో 4.35 ఎకరాలు, 429–4లో 3.03 ఎకరాల భూమి పిత్రార్జితంగా వచ్చింది. తాను చనిపోయినట్లుగా తన సోదరులు డెత్ సర్టిఫికెట్ ఉంచి తనకు రావాల్సిన భూమికి పట్టాపుస్తకాలు చేసుకున్నారని వాపోయాడు. ఆర్డీఓకు ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కరించాలంటూ ఏప్రిల్ 23న ఉత్తర్వులు జారీ చేశారన్నారు. అప్పటి నుంచి తహసీల్దారు చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదన్నాడు.