బాబు భయపెడుతుంటే.. జగన్‌ భరోసా కల్పిస్తున్నారు

Anilkumar Yadav and Gadikota Comments On Chandrababu - Sakshi

మంత్రి అనిల్‌ కుమార్, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట

విపత్తులోనూ విపక్ష నేత నీచ రాజకీయాలు 

కరోనా కట్టడిలో అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా ఏపీ  

సాక్షి,అమరావతి: విపత్కర సమయంలోనూ ప్రతిపక్షనేత చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. కరోనా సోకితే ప్రాణాలు పోయినట్లేనని చంద్రబాబు భయపెడుతుంటే బాధితుల్లో సీఎం జగన్‌ ధైర్యాన్ని నింపి భరోసా కల్పిస్తున్నారని చెప్పారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో వారు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఇవీ..

► కరోనా కట్టడి చర్యల్లో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రపదేశ్‌ మెరుగ్గా ఉంది. దేశంలో కరోనా పరీక్షలు చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ప్రథమ స్థానంలో ఉంది. జాతీయ సగటు కంటే అతి తక్కువగా రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. 
► ఓ ఎంపీ కుటుంబానికి కరోనా వచ్చిందని టీడీపీ నేతలు అవహేళనగా మాట్లాడారు. ఆ కుటుంబంలో నలుగురు డాక్టర్లున్నారు. వారంతా కరోనాపై పోరాటంలో ముందు వరుసలో నిలిచి చికిత్స చేస్తుంటే డాక్టర్లను కించపరిచేలా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారు. 
► టీడీపీ నేతలు కనీసం పదిశాతం మందైనా బయటకొచ్చి పేదలను ఆదుకున్నారా? సాయం చేయడం మాని తిన్నది అరక్క దీక్షలు చేస్తున్నారు.
► కరోనా నియంత్రణకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. అధికార యంత్రాంగం నుంచి పోలీసులు, వలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులు, రెవెన్యూ సిబ్బంది, డాక్టర్లు 24 గంటలు పనిచేస్తున్నారు.
► చంద్రబాబు ప్రజలకు మంచి చేయకపోయినా ఫర్వాలేదు కానీ వారిని భయపెట్టొద్దు. ఆయన రాజకీయాలు చేయడానికి ఏపీ కావాలి, ఉండడానికి మాత్రం హైదరాబాద్‌ కావాలి.
► కరోనా నివారణలో ఏపీ మార్గదర్శకంగా నిలిచిందని ప్రధాని, కేంద్ర మంత్రులు, జాతీయ మీడియా చెబుతుంటే బాబుకు వినిపించదా?
► ప్రకాశం బ్యారేజి వద్ద 10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినపుడు ముఖ్యమంత్రి జగన్‌ అధికారులతో ఎలా పని చేయించారో అందరికీ తెలుసు. సంక్షోభ సమయంలో అయోమయం సృష్టించడం చంద్రబాబు అలవాటు.
► ఎస్‌ఈసీ కనగరాజ్‌ వల్ల రాజ్‌భవన్‌లో కరోనా వచ్చిందని ఒక దళిత రిటైర్డు జడ్జిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం దారుణం. రాష్ట్రపతి భవన్‌లో కూడా కరోనా ప్రధానమంత్రి వల్ల వచ్చిందని చంద్రబాబు చెప్పగలరా? 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top