తెలుగు వారందరూ కలిసే ఉండాలి | All of them should be in Telugu meet | Sakshi
Sakshi News home page

తెలుగు వారందరూ కలిసే ఉండాలి

Oct 9 2013 2:38 AM | Updated on Sep 1 2017 11:27 PM

తెలుగు వారందరూ కలిసే ఉండాలని, రాష్ట్ర విభజన ప్రక్రియను విరమించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని గుంతకల్లు రైల్వే ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమైక్య ఉద్యమానికి సంఘీభావంగా మంగళవారం సాయంత్రం వేలాది మంది రైల్వే కార్మికులు, ఉద్యోగులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

గుంతకల్లు, న్యూస్‌లైన్: తెలుగు వారందరూ కలిసే ఉండాలని, రాష్ట్ర విభజన ప్రక్రియను విరమించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని గుంతకల్లు రైల్వే ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమైక్య ఉద్యమానికి సంఘీభావంగా మంగళవారం సాయంత్రం వేలాది మంది రైల్వే కార్మికులు, ఉద్యోగులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక రైల్వే క్రీడా మైదానంలో తహసీల్దార్ వసంతబాబు, జేఏసీ పట్టణ చైర్మన్ మునివేలు, రైల్వే జేఏసీ సభ్యులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పట్టణానికి చెందిన ఓబాలిక భరతమాత వేషధారణలో ర్యాలీ ముందు నడుస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా రైల్వే జేఏసీ నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలోని రైల్వే ఉద్యోగులందరూ ఉద్యమానికి మద్దతు ఇచ్చి  కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
 
 రెండు నెలలుగా అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు సమైక్యాంధ్ర కోసం భారీ స్థాయిలో ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది రైల్వే ఉద్యోగులు సోదరభావంతో కలిసిమెలసి జీవిస్తుండగా, తెలుగు ప్రజలు ఐక్యంగా జీవించలేరా? అని ప్రశ్నించారు. రైల్వే ఉద్యోగులను స్ఫూర్తిగా తీసుకుని తెలుగు ప్రజలను ఐక్యంగా ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే, రైల్వే ఉద్యోగులందరూ ఆందోళనకు దిగుతారని హెచ్చరించారు.
 
 రైల్వేను స్తంభింపజేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే జేఏసీ కన్వీనర్ ధనరాజ్, నాయకులు ప్రకాష్‌రెడ్డి, కరీముల్లా, ఆన్వర్, కోటేశ్వరరావు, దొరైరాజ్‌భూషణం, బాలాజీసింగ్, కేఎండీ గౌస్, జీఎన్ ప్రకాష్‌బాబు, అశోక్, రమేష్, సత్తార్, రాబర్ట్, డీఆర్‌ఆర్ పాల్, డి.వెంకటేశ్వర్లు, శివయ్య, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ గాంధీ చౌక్‌కు చేరుకున్న అనంతరం రైల్వే ఉద్యోగుల కుటుంబ సభ్యులు కొవ్వొత్తులతో ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ సర్కిల్, వాసవీదేవి ఆలయం, పాతబస్టాండ్, వైఎస్సార్ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్, మున్సిపల్ కార్యాలయం మీదుగా పొట్టిశ్రీరాములు సర్కిల్‌కు చేరుకుని, ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement