మందుకెందుకో లై‘సెన్స్‌’?

మందుకెందుకో లై‘సెన్స్‌’? - Sakshi


ఇవన్నీ చూస్తే మద్యం అమ్మకాలు సహజమే కదా? అనిపించవచ్చు! కానీ అవన్నీ అనుమతి లేకుండా జరుగుతున్న విక్రయాలు! వాస్తవానికి పాత మద్యం దుకాణాల లైసెన్స్‌ గడువు జూన్‌ 30వ తేదీ అంటే శుక్రవారం రాత్రితో ముగిసిపోయింది. కొత్త మద్యం పాలసీ శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. కానీ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జాతీయ, రాష్ట్రీయ రహదారులకు సమీపంలో ఉండకూడదు. అలాగే విద్యాసంస్థలు, ఆలయాల దగ్గర నిర్వహించకూడదు. ఇవన్నీ పరిశీలించి ఎక్సైజ్‌ శాఖ లైసెన్స్‌ ఇవ్వాల్సి ఉంది. కానీ ఆ ప్రక్రియ మొదలుకాలేదు. ఈ దృష్ట్యా పాత దుకాణాలకు మూత వేయాలి... కొత్తవి ఇంకా ప్రారంభించకూడదు! అంటే మద్యం అమ్మకాలు జరగకూడదు! కానీ బెల్ట్‌షాపులు, దాబాలు, కిళ్లీ దుకాణాల్లోనే కాదు సిండికేట్ల గోదాంల నుంచి కేసులకొద్దీ మద్యం మందుబాబులకు శనివారం కావాల్సినంత దొరికింది! ఇంకో వారం పది రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చు!





సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో 235 మద్యం దుకాణాలకు మూడు నెలల క్రితమే లాటరీ ద్వారా కేటాయింపులు జరిగాయి. అయితే పాత మద్యం దుకాణాల యజమానులకు జూన్‌ 30వ తేదీ వరకూ లైసెన్స్‌ గడువు ఉంది. ఈ కారణమే గాకుండా సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు ఎక్సైజ్‌ శాఖ అధికారులు కొత్త లైసెన్స్‌ల జారీ చేపట్టలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జాతీయ, రాష్ట్రీయ రహదారులకు 500 మీటర్ల దూరంలో ఉండకూడదు. అయితే జనాభా 20 వేల కంటే తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం 220 మీటర్లలోపు మద్యం దుకాణాలు ఏర్పాటు చేయవచ్చు. ఈ ప్రకారం ఎక్సైజ్‌ సిబ్బంది దూరం కొలతలు వేసే పనిలో ఉన్నారు. అలాగే విద్యాసంస్థలు, ఆలయాలకు సమీపంలో ఉండకూడదనే నిబంధనలను కూడా కచ్చితంగా అమలు చేయాలని కోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఈ ప్రకారం దుకాణాల పరిశీలన ఈ మూడు నెలల కాలంలోనే ఎక్సైజ్‌ అధికారులు పూర్తి చేసి లైసెన్స్‌లు జారీ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకూ పూర్తికాలేదు. ఇందుకు మరో వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు.



యథేచ్ఛగా అమ్మకాలు

పాత దుకాణాలు మూతపడినా, కొత్త దుకాణాలు ఇంకా తెరుచుకోకపోయినా మద్యం మాత్రం ఎప్పటిలాగే మందుబాబులకు అందుబాటులో ఉంటోంది. బెల్ట్‌షాపులతో పాటు దాబాలు, కిళ్లీబడ్డీలు, సిండికేట్‌ మద్యం గొడౌన్‌ల వద్ద కూడా శనివారం అమ్మకాలు యథావిధిగా కొనసాగాయి. జిల్లాలో కొన్నిచోట్ల మద్యం దుకాణాలకు తాళాలు వేసినా వెనుక ద్వారం నుంచి అమ్మకాలు జరిగాయి. కొంతమంది వ్యాపారులు శుక్రవారం రాత్రే సరుకును దుకాణం సమీపంలోని మరో ప్రదేశానికి తరలించి అక్కడే అమ్మకాలు సాగించారు. కాశీబుగ్గ పాత జాతీయ రహదారిలో ఉన్న రెండు మద్యం దుకాణాలు, కేటీ రోడ్డులోని మూడు దుకాణాలు, పలాసలో మూడు దుకాణాల వద్ద బహిరంగంగానే మద్యం విక్రయాలు జరిగాయి. పాత జాతీయ రహదారిలో సాయిబాబా మందిరం వద్ద, జామియా మసీదుకు సమీపంలో సైతం ఈ జోరు కనిపించింది. టెక్కలిలో కూడా దొడ్డి దారిలో మద్యం విక్రయాలు జోరుగా సాగాయి.



మందుబాబుల జేబులకు చిల్లు

సాధారణంగా వారంతమైన శనివారం, సెలవు దినమైన ఆదివారం మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. పాత, కొత్త మద్యం విధానాల సంధికాలంలో మద్యం అమ్మకాలు అధికారికంగా సాగే అవకాశం లేదు. దీంతో మందుబాబులు శనివారం నాడే బాటిళ్లపై ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేశారు. ఇక ఆదివారం డిమాండును బట్టి ఈ ధర ఇంకా పెరగవచ్చు. దొడ్డిదారిన మద్యం విక్రయాలతో మందుబాబుల జేబులకు చిల్లు పెట్టి సిండికేట్‌ సొమ్ము చేసుకుంటోంది.



సరిహద్దులు  మారుతున్నాయ్‌

జిల్లాలోని జాతీయ, రాష్ట్రీయ రహదారులకు ఆనుకొని 40 వరకూ మద్యం దుకాణాలు, బార్‌లతో పాటు మద్యం దొరుకుతున్న దాబాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం దూరంగా జరిపించడానికి ఎక్సైజ్‌ అధికారులు కొలతలు వేస్తున్నారు. అలాగే జిల్లాలో ప్రస్తుతం ఉన్న 15 బార్‌లకు అదనంగా మరో రెండింటికి కొత్తగా అనుమతి వచ్చింది. వీటన్నింటికీ లైసెన్స్‌ల కోసం దుకాణాలు, బార్‌ల యజమానులు శ్రీకాకుళం, పలాస సర్కిళ్ల పరిధిలోని ఎక్సైజ్‌ శాఖ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top