మద్యంపై సమరభేరి | Sakshi
Sakshi News home page

మద్యంపై సమరభేరి

Published Fri, Jan 17 2014 2:17 AM

Alcohol  movement handle designed demonstrate functionality.

 ఉన్నవ (యడ్లపాడు), న్యూస్‌లైన్ :స్వాతంత్య్ర సమరంలోనూ ఉన్నవ గ్రామం స్ఫూర్తిదాయక పాత్ర పోషించింది. ఉన్నవ వెంకటప్పయ్య, వంకాయలపాటి శేషావతారం వంటివారు స్వరాజ్యం కోసం ఉద్యమించి జైలుశిక్షను అనుభవించారు. పల్నాటి పుల్లరి సత్యాగ్రహ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ఉన్నవ లక్ష్మీనారాయణ వంటి మహానుభావులను కన్న నేల ఇది. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ గ్రామ ప్రస్తుత జనాభా సుమారు ఏడు వేల మంది. ఐదేళ్లుగా గ్రామాన్ని మద్యం రక్కసి పీక్కుతింటోంది. దీంతో యువత మద్యరహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు నడుం బిగించింది. అందుకు చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ అండగా నిలిచారు.   
 
 ఆ వీధిలోకి వెళ్లాలంటేనే హడల్...
 ఉన్నవ బస్టాండ్ సెంటర్‌లోని ప్రధాన రోడ్డు పక్కన మూడు బెల్టుషాపులు ఉన్నాయి. రద్దీగా ఉండే ఈ వీధిలో సాయంత్రమైతే మందుబాబులు చేరతారు. పొలం పనులు, మిల్లుల నుంచి వచ్చే మహిళా కూలీలు, పాల కేంద్రానికి వెళ్లేవారు, విద్యార్థినులు మందుబాబుల వికృత చేష్టలతో ఆ వీధిలో వెళ్లాలంటేనే హడలిపోయే పరిస్థితి. గ్రామంలో మరో రెండు బెల్టుషాపులు ఉన్నాయి. మద్యానికి బానిసలైన కొందరి వల్ల అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. మానసికంగా, ఆర్థికంగా చితికిపోతున్నాయి. గతంలో రచ్చబండ, ప్రజాపథం, రెవెన్యూ గ్రామ సదస్సుల్లో బెల్టుషాపులను తొలగించాలని మహిళలు కోరినా ఫలితం కనిపించలేదు. 
 
 యువత నిరాహారదీక్ష..
 మూడు నెలల కిందట గ్రామానికి చెందిన యువకులు బెల్టుషాపుల నిలిపివేతకు ఉద్యమం చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించారు. సంక్రాంతి పండగను ఎంచుకుని ఈ నెల 12 నుంచి 14 వరకు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. ముందుగానే ఫేస్‌బుక్ వంటి సామాజిక వెబ్‌సైట్‌లో పెట్టి సలహాలు, సూచనలు స్వీకరించారు. అన్ని ప్రాంతాల్లో ఉన్న ఉన్నవ వాసులు మద్దతు పలకడంతో దీక్షకు శ్రీకారం చుట్టారు. గ్రామ యువకులు కుర్రా ప్రతాప్‌కుమార్, కాకుమాను విజయ్‌కాంత్, కుంచనపల్లి కుమార్‌బాబులు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టగా.. స్థానిక మహిళలకు మనోధైర్యాన్ని ఇచ్చారు. 
 
 యువత ఉద్యమంతోనే తీర్మానాలు..
 యువకుల పట్టుదలకు మెచ్చి మద్యం అమ్మకాలను గ్రామపరిధిలో చేయరాదంటూ పంచాయతీ పాలకమండలి, మర్రిపాలెం ప్రాథమిక సహకార సంఘం డెరైక్టర్, సభ్యులు అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి మద్యరహిత గ్రామంగా చేయాలని ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే సంతకాలను తీసుకుని శాశ్వతంగా తొలగించేలా చూడాలంటూ తీర్మానం చేశారు. దీంతో బెల్టుషాపులు మూతపడ్డాయి. పార్టీలకు, వర్గాలకతీతంగా తీసుకున్న తీర్మానంపై మహిళలు హర్షం వ్యక్తం చేశారు. 
 బాధిత కుటుంబాలను దగ్గరగా చూశాను..
 మద్యానికి బానిసైనవారి కుటుంబాలను చాలా దగ్గరగా చూశాను. యువకులు మద్యనిషేధం కోసం దీక్షచేస్తుంటే పంచాయతీ మెంబర్లను అడిగాను. పార్టీలకతీతంగా మద్దతు పలికి తీర్మానం చేసేందుకు సహ కరించారు. తోటి మహిళల బాధలను అర్థం చేసుకోవడం గ్రామ ప్రథమ పౌరురాలిగా నాబాధ్యత అనిపించింది.
 - పత్తిపాటి బసవమ్మ, సర్పంచి
 

Advertisement
 
Advertisement
 
Advertisement