ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీ వీసీ అరెస్ట్‌

Acharya Ng Ranga Agricultural University Vc Arrest In Guntur - Sakshi

ఒక వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించి, కులం పేరుతో దూషించడమే కారణం

సాక్షి, గుంటూరు: గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ (వీసీ) వల్లభనేని దామోదర్‌ నాయుడిని ఆదివారం తుళ్లూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎస్టీ కులానికి చెందిన తనను ఉద్యోగం నుంచి తొలగించి, కులం పేరుతో దూషించి, బెదిరింపులకు గురిచేశారని ఉయ్యాల మురళీకృష్ణ గత నెల 24న తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 3(1,2)తోపాటు ఐపీసీ 506 కింద వీసీని అరెస్ట్‌ చేసి మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు.

వివరాల్లోకెళ్తే.. చిలకలూరిపేట మండలం పురుషోత్తమపట్నంకు చెందిన ఉయ్యాల మురళీకృష్ణ 2016లో ఎన్జీ రంగా వర్సిటీలో ఔట్‌సోర్సింగ్‌ విధానంలో అటెండర్‌గా చేరాడు. అతడిని ఈ ఏడాది ఏప్రిల్‌ 12న ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పటి నుంచి తనను ఉద్యోగంలో పెట్టుకోవాలని కోరుతూ వచ్చిన మురళీకృష్ణ గత నెల 23న సచివాలయంలో వీసీ, రిజిస్ట్రార్‌ ఉన్నారని తెలిసి అక్కడకు వెళ్లి తనను ఉద్యోగంలో చేర్చుకోవాల్సిందిగా మరోసారి ప్రాధేయపడ్డాడు.

దీంతో ఆగ్రహించిన వీసీ మరోసారి తన దగ్గరకు వస్తే అంతు చూస్తానని బెదిరించడంతోపాటు కులం పేరుతో దూషించాడని మురళీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేవలం వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులనే కారణంతోనే మురళీకృష్ణతోపాటు అతడి భార్య విజయదుర్గను, తదితరులను కూడా ఉద్యోగం నుంచి తొలగించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. గత ఐదేళ్లూ టీడీపీపై ప్రేమతో ఓ సామాజికవర్గానికి చెందినవారినే వీసీ దామోదర్‌ నాయుడు ప్రోత్సహించారనే విమర్శలున్నాయి. ఇతర సామాజికవర్గాలవారు తన చాంబర్‌ దరిదాపుల్లోకి కూడా రావడానికి వీల్లేదని బాహాటంగానే ప్రకటించారని ఉద్యోగులు చెబుతున్నారు.

వీసీ చర్యలతో అకారణంగా నష్టపోయిన ఉద్యోగులు గవర్నర్, సీఎంకు ఫిర్యాదులు చేశారు. ప్రజాప్రతినిధులు, వర్సిటీ అధికారులకు కూడా 400 ఫిర్యాదులు అందాయి. వీసీపై అందిన ఫిర్యాదులను విచారించడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గతంలో మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ ప్రద్యుమ్నను నియమించింది. కాగా, రెండేళ్ల కిందట ఎస్టీ ఉద్యోగిని కులం పేరుతో దూషించిన ఘటనలోనూ వీసీపై కేసు నమోదవ్వగా టీడీపీ ప్రభుత్వం దీన్ని నీరుగార్చింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top