ఆకలితో అడవిలోనే..!

225 Families Suffering in Tirupati Forest With Lockdown - Sakshi

కరోనా భయంతో ‘కోన’లో చిక్కుకున్న గిరిపుత్రులు

40రోజులుగా అలమటిస్తున్న 225 కుటుంబాలు

అసలే అడవి.. కందమూలాలే ఆహారం.. చిన్నచిన్న గుడారాలే నివాసం.. ఊర్లోకి వచ్చేందుకు కరోనా భయం.. నలభై రోజులుగా బిక్కుబిక్కుమంటూ జీవనం.. ఇదీ ఏర్పేడు మండలానికి చెందిన 225 గిరిజన కుటుంబాల దయనీయస్థితి. గురువారం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి పర్యటనతో గిరిపుత్రుల దీనస్థితి వెలుగుచూసింది.

సాక్షి, తిరుపతి : ఏర్పేడు మండలంలోని పాయల్‌ సెంటర్, కుక్కలగుంట, సదాశివపురం, కందాడుకు చెందిన గిరిజన కుటుంబాలకు అటవీ ఉత్పత్తులే జీవనాధారం. సమీపంలోని సదాశివకోన అటవీప్రాంతంలో లభించే ఈత ఆకులను సేకరించి కట్టలు కట్టి విక్రయించి ఆ సొమ్ముతో పొట్ట పోసుకుంటుంటారు. ఏటా జనవరిలో అడవిలోకి వెళ్లి సుమా రు 3 నెలలపాటు అక్కడే ఉండి ఈత ఆకులను సేకరిస్తుంటారు. ఈ ఏడాది కూడా సంక్రాంతి పండుగ అనంతరం 225 గిరిజన కుటుంబాలు అడవిబాట పట్టాయి. మార్చిలో తిరిగి వచ్చే సమయానికి కరోనా కలకలం రేపడంతో గ్రామాలకు చేరుకునేందుకు భయపడ్డారు. ఊర్లోవాళ్లు కూడా ఇప్పడు రావద్దని చెప్పడంతో అడవిలోనే ఉండిపోయారు.  రేషన్‌ తీసుకునేందుకు కూడా వీలులేక అలమటిస్తున్నారు. ఆకలికి తాళలేక అడవిలో దొరికిన దుంపలనే ఆహారంగా తీసుకుంటున్నారు. జలపాతాల్లోని నీటినే తాగుతున్నారు. చిన్నచిన్న పందిళ్లు వేసుకుని తలదాచుకుంటున్నారు. పిల్లాపాపలతో అర్ధాకలితో కాలం గడుపుతున్నారు. ఎమ్మెల్యే మధుసూదన్‌ రెడ్డి వారికి సాయం చేసేందుకు వెళ్లినపుడు తమ దీనస్థితిని ఆయనకు మొరపెట్టుకున్నారు. నేనున్నానంటూ ఎమ్మెల్యే వారికి భరోసా ఇచ్చారు.(ప్రాణాలా.. పైసలా!)

దుంపలు తిని బతుకుతున్నాం
కరోనా భయంతో ఇక్కడే ఉండిపోయాం. అన్నం చేసుకోవడానికి బియ్యం కొరత వచ్చింది. ఊరిలోకి వెళ్లి తెచ్చుకోలేకపోయాం. అడవిలో దొరికే దుంపలు తింటూ బతుకుతున్నాం. అంతా ఒకచోట ఉండడం వల్ల కొంత ధైర్యంగా ఉంటున్నాం. రాత్రిళ్లు కిరోసిన్‌ దీపాలతో నెట్టుకొస్తున్నాం. విష పురుగులు దరిచేరకుండా గుడారం ముందు చిన్నాపాటి మంట వేసుకుంటున్నాం.– రమణమ్మ, గిరిజన మహిళ 

అయ్యా.. ఇదే మా గూడు

ఈ నీరే తాగాలి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top