పరమేశ్వరుని జన్మనక్షత్రం ఆరుద్రను పురస్కరించుకుని పెద్దచెరుకూరులోని శ్రీబాలత్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో బుధవారం పుష్పయాగం కనులపండువగా సాగింది.
నెల్లూరు రూరల్, న్యూస్‌లైన్: పరమేశ్వరుని జన్మనక్షత్రం ఆరుద్రను పురస్కరించుకుని పెద్దచెరుకూరులోని శ్రీబాలత్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో బుధవారం పుష్పయాగం కనులపండువగా సాగింది. 21 రకాల వందల కిలోల పూలతో దేవదేవేరులను అభిషేకించారు. మొదట గ్రామంలోని రామమందిరం వద్ద నుంచి పూలను ఊరేగింపుగా ఆలయానికి చేర్చారు.
ప్రత్యేక పూజల అనంతరం పుష్పయాగం వైభవంగా సాగింది. సుగంధపరిమళాలు వెదజల్లుతున్న పుష్పాలతో స్వామి వారికి పూజలు నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో త రలివచ్చారు. పూజల అనంతరం ఆ పూలను పొందేందుకు ఎగబడ్డారు. అమ్మవారికి ఓ భక్తుడు రజత కవచం సమర్పించారు.
చంద్రమౌళీశ్వరునికి
అన్నాభిషేకం
ఆరుద్రోత్సవం(శివముక్కోటి) సందర్భంగా చంద్రమౌళీశ్వరునికి అన్నాభిషేకం చేశారు. వేకువజామున స్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతో పాటు 27 రకాల విశేషద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. ప్రత్యేక హోమాల అనంతరం అన్నలింగాన్ని ఆలయ ప్రాంగణంలోని పినాకినీ ఘాట్‌లో నిమజ్జనం చేశారు. పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి అన్నప్రసాదం స్వీకరించారు. అన్నాభిషేకం కార్యక్రమానికి కప్పగంతు నరసింహరావు, దేవకీదేవి ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఆలయ ప్రధానార్చకుడు నూతలపాటి సుబ్బయ్యశాస్త్రి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమాల్లో చెన్నారెడ్డి చంద్రమౌళిరెడ్డి, వెడిచర్ల రాజారెడ్డి, కోడూరు శేషారెడ్డి, నీలకంఠం తదితరులు పాల్గొన్నారు.