నగరంలో ఉండే ఆ విద్యార్థులు జలాశయాన్ని చూసి పరవశించిపోయారు. సరదాగా అలా నీటిలోకి వెళ్లారు.
మొయినాబాద్, న్యూస్‌లైన్: నగరంలో ఉండే ఆ విద్యార్థులు జలాశయాన్ని చూసి పరవశించిపోయారు. సరదాగా అలా నీటిలోకి వెళ్లారు. మృత్యుబిలంలా చెరువులో ఉన్న గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు కానరాని లోకాలకు తరలిపోయారు. మరో ఇద్దరు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అందరి హృదయాలను కలచివేసే ఈ సంఘటన శుక్రవారం మండల పరిధిలోని చిలుకూరు బాలాజీ దేవాలయం సమీపంలోని గండిపేట చెరువులో చోటుచేసుకుంది. సీఐ రవిచంద్ర, స్థానికుల కథనం ప్రకారం.. హైదరాబాద్ యూసుఫ్‌గూడ రహమత్‌నగర్‌కు చెందిన పి. శ్రీనివాస్, ఉమ దంపతుల కుమారుడు రాజేష్(22), లాలాపేట్‌కు చెందిన నాగ సంపత్(21), సికింద్రాబాద్ వాసి మనోహర్, డీబీఆర్ మిల్‌కు చెందిన హమీద్‌లు స్నేహితులు. వీరు సికింద్రాబాద్‌లోని మహబూబ్ కళాశాలలో బీకాం ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. శుక్రవారం విద్యార్థులు మండలంలోని చిలుకూరు బాలాజీ దేవాలయానికి బస్సులో వచ్చారు.
దైవ దర్శనం అనంతరం పక్కనే ఉన్న గండిపేట చెరువుకు వెళ్లారు. సరదాగా నీళ్లలోకి దిగారు. రాజేష్, నాగసంపత్‌లు నీళ్లలో ముందుకు నడుచుకుంటూ వెళ్తుండగా వారిని మనోహర్, హమీద్‌లు అనుసరిస్తున్నారు. కొద్దిదూరం వెళ్లగానే పెద్ద గుంత ఉండడంతో రాజేష్, నాగసంపత్ పడిపోయారు. వీరిలో ఒక్కరికి కూడా ఈత రాకపోవడంతో సాయం కోసం ఆర్తనాదాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. మనోహర్, హమీద్‌లు 100 నంబర్‌కు ఫోన్ చేయడంతో మొయినాబాద్ సీఐ రవిచంద్ర, ఏఎస్సై అంతిరెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే రాజేష్, నాగసంపత్‌లు మృతిచెందారు. స్థానికుల సాయంతో మృతదేహాలను వెలికితీయించి వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని ఉస్మానియాకు తరలించారు. కాలేజీ నుంచి వచ్చిన నలుగురు స్నేహితులు దైవ దర్శనం చేసుకున్నారు. సరదాగా.. అలా నీళ్లలోకి దిగడంతో ఇద్దరు విద్యార్థులు మృత్యువాతపడ్డారు. తమతో వచ్చిన స్నేహితులు మృత్యువాత పడడంతో మిగతా ఇద్దరు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అనంతరం మృతుల కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు.
ఏం పాపం చేశాం.. దేవుడా..
నా బిడ్డకు ఉన్న ఒక్కగానొక్క కొడుకును తీసుకుపోయావ్... ఏం పాపం చేశాం.. దేవుడా.. అంటూ రాజేష్ అమ్మమ్మ పద్మావతి మనవడి మృతదేహంపై బోరున విలపించింది. నగరంలోని మెహిదీపట్నంలో ఉంటున్న రాజేష్ అమ్మమ్మ పద్మావతి, తాతయ్య చంద్రమౌళిలు విషయం తెలుసుకొని సంఘటనా స్థలానికి వచ్చి గుండెలుబాదుకున్నారు.
అయ్యో.. పాపం..
రహమత్‌నగర్‌లో ఉండే రాజేష్ తండ్రి శ్రీనివాస్ కొన్నేళ్ల క్రితం భార్యాపిల్లలను వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో తల్లి ఉమ ఇళ్లలో పనిచేసి రాజేష్‌ను చదివిస్తోంది. రెక్కలు ముక్కలు చేసుకొని కూతురి వివాహం చేసింది. రాజేష్ పైనే ఆశలు పెట్టుకున్న ఆమె కొడుకు మృతి వార్త విని షాక్‌కు గురైంది.