ఆయకట్టు...కనికట్టు | ysrcp dharna at collectorate on handri neeva project | Sakshi
Sakshi News home page

ఆయకట్టు...కనికట్టు

Jan 22 2018 7:38 AM | Updated on Oct 1 2018 2:16 PM

ysrcp dharna at collectorate on handri neeva project - Sakshi

ఒకసారి తప్పు చేస్తే పొరపాటు అవుతుంది. పలుసార్లు పొరపాటు చేస్తే తప్పవుతుంది. ఇదంతా తెలిసి ఒకే తప్పును పదేపదే చేస్తే... కుట్ర...దగా అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ‘అనంత’ రైతాంగంపై ఇదే విధంగా
వ్యవహరిస్తోంది.  

సాక్షి ప్రతినిధి, అనంతపురం: హంద్రీ–నీవా ఆయకట్టుకు ఏడాదిలోనే నీరిస్తామని 2014లోనే టీడీపీ హామీ ఇచ్చింది. అయితే అదే చంద్రబాబు సర్కార్‌ 2015లో ఆయకట్టుకు నీరిచ్చే డిస్ట్రిబ్యూటరీలు చేయొద్దని జీఓ జారీ చేసింది. మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో 2016 నుంచి ఏటా ఖరీఫ్‌కు నీరిస్తామని ఎస్‌ఈ, సీఈలతో రైతులను మభ్యపెట్టే ప్రకటనలు చేయిస్తోంది.  కానీ ఇప్పటి వరకూ ఆయకట్టు పూర్తి చేయలేదు. ఒక్క ఎకరాకూ నీరివ్వలేదు. ఆయకట్టు నిర్మాణం చేపట్టేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా, తక్కువ ఖర్చుతో పూర్తి చేసే అవకాశం ఉన్నా ఆ దిశగా చర్యలకు ఉపక్రమించడం లేదు. ‘అనంత’కు సాగునీరిస్తామని ఊరించడం మినహా జిల్లా రైతాంగంపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఈ క్రమంలో డిస్ట్రిబ్యూటరీలు ఏర్పాటు చేయడం, అవకాశం ఉన్న చోట ఆయకట్టుకు నీళ్లివ్వాలనే డిమాండ్‌తో అఖిలపక్షం నేతలు నేడు కలెక్టరేట్‌ ఎదుట ధర్నాకు సిద్ధమయ్యారు. 

డిస్ట్రిబ్యూటరీలు పూర్తయితే 1.18 లక్షల ఎకరాలకు నీరు
హంద్రీ–నీవా ద్వారా రాయలసీమలో 6.02లక్షల ఎకరాలకు నీరందించాలని సంకల్పిస్తే అందులో 3.45లక్షల ఎకరాలు ఆయకట్టు ‘అనంత’లోనే ఉంది. దీన్నిబట్టి చూస్తే ‘అనంత’ కష్టాలు తీర్చేందుకు చేపట్టిన బృహత్తరపథకమనేది స్పష్టమవుతోంది. హంద్రీ–నీవా ఫేజ్‌–1 పనులు 2012లోనే పూర్తయ్యాయి. జీడిపల్లి రిజర్వాయర్‌కు కృష్ణాజలాలు చేరాయి. డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేస్తే 1.18లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వొచ్చు. ఇందులో 80వేల ఎకరాలు ఆయకట్టు ఉరకొండ నియోజకవర్గంలో ఉంది. 2016 డిసెంబర్‌లో గొల్లపల్లికి నీళ్లు వచ్చాయి. ఫేజ్‌–2 ద్వారా జీడిపల్లి–గొల్లపల్లి మధ్యలో డిస్ట్రిబ్యూటరీలు చేస్తే రాప్తాడు నియోజకవర్గానికి నీరివ్వొచ్చు. కానీ 2014లో టీడీపీ అధికారంలోకి రాగా... ఏడాదిలో హంద్రీ–నీవా ఆయకట్టుకు నీళ్లిస్తామని సీఎం చంద్రబాబు, మంత్రులు ప్రకటనలు చేశారు. కానీ సీఎం  సొంత నియోజకవర్గం కుప్పానికి నీళ్లు తీసుకెళ్లేదాకా డిస్ట్రిబ్యూటరీల నిర్మాణాలు పూర్తి చేయొద్దని 2015 ఫిబ్రవరిలో జీఓ 22 జారీ చేశారు. దీనిపై విపక్షపార్టీలు తీవ్రస్థాయిలో ఉద్యమించాయి. ఈ క్రమంలో 33, 34 ప్యాకేజీల్లో డిస్ట్రిబ్యూటరీ పనులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 

పేరూరు ఆయకట్టు సంగతేంటి?
పేరూరు కింద 10,800 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో తగరకుంట చెరువు నుంచి నీరిస్తే తగరకుంట, భోగినేపల్లి, పాలచెర్ల, గాండ్లపర్తి, కొత్తపల్లితో పాటు పలుగ్రామాల్లో ఐదు వేల ఎకరాలకు నీరందుతుంది. కానీ నీళ్లివ్వలేదు. చెరువు నుంచి నీళ్లు తీసుకెళితే రైతులపై కేసులు నమోదు చేస్తామని పోలీసులను కాపలా పెట్టారంటే రైతుల సంక్షేమంపై సర్కారుకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవచ్చు. మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌ నుంచి తురకలాపట్నం వంక ద్వారా పెన్నాలోకి నీరు వదిలితే 10 గ్రామాల్లో భూగర్భజలాలు పెరుగుతాయి.           డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేస్తే పేరూరు, మద్దెలచెరువు, భానుకోట, వేపకుంటతో పాటు ఏడు గ్రామాల్లో ఐదు వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చు. తక్కువ ఖర్చుతో వీటికి వెంటనే నీళ్లిచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. హంద్రీ–నీవా నుంచి ఆత్మకూరు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పూర్తి చేస్తే ఆత్మకూరు, గొరిదిండ్ల, పంపనూరురుతో పాటు పలు గ్రామాలకు 12వేల ఎకరాలకు నీరందుతుంది. దీన్నీ రద్దు చేశారు. ఇక రాప్తాడు నియోజకవర్గంలో రూ.300 కోట్లు ఖర్చు చేస్తే లక్ష ఎకరాలకు తక్కువ వ్యవధిలో సాగునీరు ఇచ్చే అవకాశం ఉంది. 

నీళ్ల కంటే నిధులపైనే మక్కువ
ఏటా 20–30 టీఎంసీల నీళ్లు జిల్లాకు వస్తున్నాయి. వీటిని ఆయకట్టుకు ఇచ్చేందుకు పిల్ల కా>లువలు పూర్తి చేయడంపై మంత్రులు, ఎమ్మెల్యేలు దృష్టి సారించాలి. అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో వీటిని పట్టించుకోలేదు. ఇప్పడు పేరూరు, బీటీపీకి నీళ్లిచ్చేందుకు కొత్త ప్రాజెక్టులకు సిద్ధమయ్యారు. మొదట ఆయకట్టుకు నీళ్లిచ్చి, ఆ తర్వాత కొత్త ప్రాజెక్టులపై దృష్టి సారించాలని, ఆయకట్టుకు నీళ్లివ్వనపుడు కొత్త ప్రాజెక్టుల పేరుతో నిధులు దండుకోవడం మినహా తమకు ఏం ఒనగూరుతుందని రైతులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీతో పాటు కాంగ్రెస్, సీపీఎం నేతలు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు.  

మొదలెట్టారు...ఆపేశారు
33, 34 ప్యాకేజీ పరిధిలో డిస్ట్రిబ్యూటరీలు పూర్తయితే 28వేల ఎకరాలకు నీరందుతుంది. 33వ  ప్యాకేజీని ఇంజనీరింగ్‌ ప్రాజెక్టు ఇండియా లిమిటెడ్‌ , 34ను రెడ్డివీరన్న కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెyŠ చేస్తున్నాయి. 33వ ప్యాకేజీలో 8.9 కిలోమీటర్లు ప్రధాన కాలువతో పాటు ఉప, పిల్లకాలువలు తవ్వాలి. ఈ పనులు పూర్తయితే 10,500 ఎకరాలకు నీరందుతుంది. కానీ 5–6 కిలోమీటర్‌ మధ్య రాయి ఉంది, దాన్ని బ్లాస్టింగ్‌ చేయాలంటున్న  అధికారులు పనులు నిలిపివేశారు. ఇక‡ మేజర్‌ కెనాల్‌లోని కల్వర్టులే పూర్తి చేయలేదు. 34వ ప్యాకేజీలో కూడా     డిస్ట్రిబ్యూటరీ–1, డిస్ట్రిబ్యూటరీ–2 అని రెండు ప్రధాన కాలువలు తవ్వాలి.  డీ–1, 8.25, డీ–2లో 22 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ తవ్వాలి. డీ–1 కింద 5వేలు, డీ–2 కింద 12, 500 ఎకరాలకు ఆయకట్టుకు నీరందుతుంది. ఈ పనులూ పూర్తి కాలేదు. ఇక 36 ప్యాకేజీ మరొకటి ఉంది. రూ.336 కోట్లు కేటాయిస్తూ 2016లో ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఈ పని దక్కించుకున్న టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్‌ కన్‌స్ట్రక్షన్స్‌ పట్టనట్టు వ్యవహరిస్తోంది. మూడు ప్యాకేజీల్లో డిస్ట్రిబ్యూటరీలు పూర్తయితే 1.18 లక్షల ఎకరాలకు నీరందుతుంది.  

డిమాండ్లు ఇవే..
హంద్రీ–నీవా ద్వారా 3.45 లక్షల ఎకరాల ఆయకట్టుకు వెంటనే నీరివ్వాలి
పెండింగ్‌లో ఉన్న డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేయాలి. ఇంకా ప్రారంభించని వాటిని వెంటనే చేపట్టాలి
పీఏబీఆర్‌ కుడికాలువ ద్వారా దిగువ గ్రామాల పరిధిలోని ఆయకట్టుకు నీరందించాలి.
ఆత్మకూరు ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ప్రారంభించాలి
హంద్రీ–నీవా 36వ ప్యాకేజీ ద్వారా పేరూరు డ్యాంకు నీరివ్వాలి.  
హంద్రీ–నీవాకు 100 టీఎంసీల నికరజలాలు కేటాయించాలి. 

అనంతపురం న్యూసిటీ:  కేటాయింపుల ప్రకారం జిల్లాలో 3.55 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వడంతో  పాటు మరికొన్ని ప్రతిపాదిత ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌తో  వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ఆందోళనకు సిద్ధమైంది. అందులో భాగంగా రైతులు, రైతు సంఘాలు, విపక్షాలతో కలిసి సోమవారం స్థానిక కలెక్టరేట్‌ ఎదుట ‘రైతుమహాధర్నా’ తలపెట్టారు. రైతుమహాధర్నా విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆదివారం సాయంత్రం స్థానికి జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అనంతపురం, హిందూపురం పార్లమెంటు అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, ఎం.శంకరనారాయణ, ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, రాప్తాడు నియోజక వర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తదితరులు సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... జిల్లా సమగ్రాభివృద్ధి కోసం రైతులు, రైతు సంఘాలు, విపక్షాలు మహాధర్నాకు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, సాగు, తాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలో అడ్డగోలు దోపిడీకి వ్యతిరేకంగా అందరు కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హంద్రీనీవా ప్రాజెక్టు కింద 3.55 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు ఏర్పాటు చేస్తూ 80 శాతం పనులు పూర్తి చేశారన్నారు. 2012 నుంచి జీడిపల్లి జలాశయానికి ఏటా 20 టీఎంసీల నీరు వస్తున్నప్పటికీ కనీసం ఎక్క ఎకరా నీళ్లివ్వలేదన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు కింద 3.55 లక్షల ఎకరాలకు డిస్ట్రిబ్యూటరీ నిర్మించి నీళ్లివ్వాలని, పీఏబీఆర్‌ కుడి కాలువ కింద నిర్మించాల్సిన 50వేల ఎకరాలకు పిల్లకాల్వ పనులు, ఆత్మకూరు ఎత్తిపోతల పథకం వెంటనే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, పేరూరు డ్యాంకు నీళ్లివ్వాలన్నారు. హంద్రీ–నీవా కాలువ దిగువనున్న తగరకుంట, బోగినేపల్లి, పాలచెర్ల, గాండ్లపర్తి కొత్తపల్లి, పేరూరు డిస్ట్రిబ్యూటరీలకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎంపీఆర్‌ దక్షిణ కాలువ కింద 50 వేల ఎకరాల ఆయకట్టుకు మూడేళ్లుగా నీరివ్వకుండా జిల్లాకు 30 టీఎంసీలు నీళ్లు తెచ్చామని చెబుతున్న అధికార పార్టీ నేతలు... ఆ నీటిని ఏమి చేశారో జిల్లా ప్రజలు, రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పేరూరు డ్యాంకు తక్షణ ప్రయోజనం కల్పించడానికి వీలుగా మడకశిర బ్రాంచి కెనాల్‌ అయిన తురకలాపట్నం వద్ద నుంచి పెన్నానది ద్వారా నీరు నింపాలన్నారు. శాశ్వత పరిష్కారంగా ఇప్పటికే నిర్మాణంలో ఉన్న 36వ ప్యాకేజీ కింద పేరూరుకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బీటీపీ నిర్మాణం, అలాగే 74 టీఎంసీలు నికర, వరద జలాల కేటాయింపులు ఉన్న అనంతపురం జిల్లాకు పట్టిసీమ వాటా కూడా కలిపి 100 టీఎంసీల కేటాయింపులు జీఓ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టుల డిమాండ్లతో సోమవారం తలపెట్టిన మహాధర్నాకు విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement