‘పచ్చ’నేతల సాక్షిగా హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన

tdp leaders violate the  High Court order - Sakshi

దగ్గరుండి కోడి పందేలు నిర్వహించిన టీడీపీ ప్రజాప్రతినిధులు

నిలువరించలేకపోయిన పోలీసులు

లెక్క కోసం అనామకులపై కేసులు నమోదు

బరుల వద్ద ఏరులై పారిన మద్యం

పందేలు, మద్యంపై కమీషన్లు వసూలు చేసిన అధికార పార్టీ నేతలు

రాజధాని ప్రాంతం అమరావతిలో 150 బరులు

ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే  మూడురోజుల్లో రూ.75 కోట్ల పందేలు

సాక్షి, అమరావతి : కోడి పందేలను తీవ్రంగా పరిగణిస్తామని, ఈసారి ఎక్కడైనా నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైకోర్టు చేసిన హెచ్చరికలు ఫలించలేదు! అధికార పార్టీ నేతల అభయంతో మూడు రోజుల పాటు విచ్చలవిడిగా జరిగిన కోడి పందేల జాతరలో సుమారు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా చేతులు మారినట్లు సమాచారం. ఇందులో సింహభాగం వాటా ఉభయ గోదావరి, కృఇష్ణా జిల్లాలదే. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి టీడీపీ ప్రజాప్రతినిధులే దగ్గరుండీ మరీ కోడిపందేలు నిర్వహించటం గమనార్హం. మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నర్సీపట్నం ఎన్టీఆర్‌ స్టేడియంలో భోగి రోజు బహిరంగంగానే కోడి పందాలకు శ్రీకారం చుట్టారు. తూర్పు గోదావరి జిల్లా మురమళ్లలో కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, గొల్లపల్లి సూర్యారావు, దాట్ల బుచ్చిబాబు, బొండా ఉమా, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, కొప్పాకలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ సమక్షంలో కోడి పందేలు జరిగాయి. టీడీపీ పెద్దల ఆశీస్సులతోనే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనకు పాల్పడినట్లు భావిస్తున్నారు. మరోవైపు బరుల నిర్వాహకులైన టీడీపీ నేతలు ఒక్కో పందెంపై 10 శాతం కమీషన్‌గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కమీషన్ల రూపంలోనే రూ.100 కోట్లు వసూలైనట్లు అంచనా.

అమరావతిలో 150 బరులు
న్యాయస్థానం ఆదేశాలను లెక్క చేయకుండా సంక్రాంతి మూడురోజుల పాటు సాగిన కోడిపందేలను ప్రభుత్వం ఏ దశలోనూ అడ్డుకోలేకపోయింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పందేల వరద కట్టలు తెంచుకోగా కృష్ణా జిల్లాలో 100, గుంటూరు జిల్లాలో 50 బరులు ఏర్పాటయ్యాయి. చాలాచోట్ల స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులే పందేలను ప్రోత్సహించారు. బరుల వద్దే మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగాయి. ఎమ్మార్పీపై 30 శాతం  అధిక ధరలతో మద్యం విక్రయించారు. మద్యం అమ్మకాల్లో టీడీపీ నేతలు 20 శాతం కమీషన్‌ కింద వసూలు చేశారు. బరుల నిర్వాహకులు జూదంపై 10 శాతం కమీషన్‌గా వసూలు చేశారు. వేల సంఖ్యలో వాహనాలు బరుల వద్ద బారులు తీరటంతో ఒకరోజు పార్కింగ్‌కు కారుకు రూ.100 చొప్పున వసూలు చేశారు. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం తూర్పుపాలెంలో సుమారు 35 ఎకరాల్లో భారీబరులు ఏర్పాటు చేసి కోడిపందేలు నిర్వహించారు. ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్‌లతో పాటు పలువురు టీడీపీ నేతలు దగ్గరుండి పందేలను నిర్వహించారు.  ఇక్కడ మూడు రోజుల వ్యవధిలో సుమారు రూ.3 కోట్ల మేర డబ్బులు చేతులు మారినట్టు సమాచారం.  విజయవాడ భవానీపురంలో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, పెనమలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ బహిరంగంగా కోడిపందేలకు మద్దతుగా నిలిచారు.

తూర్పు గోదావరిలో.. రూ.75 కోట్ల పందేలు
తూర్పు గోదావరి జిల్లాలో పోలీసులు చేతులెత్తేయడంతో ఈ ఏడాది కొత్త ప్రాంతాల్లో కూడా పందేలు జోరుగా సాగాయి. జిల్లాలో మూడు రోజుల్లో సుమారు రూ.75 కోట్ల మేర చేతులు మారినట్టు అంచనా. మురమళ్లలోనే రూ.పది కోట్ల మేర పందేలు కాశారు. సోమ, మంగళవారం తెలంగాణా ప్రాంతానికి చెందిన వ్యాపారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పందేలు కాయడం విశేషం. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ మంగళవారం గుండాటలో పాల్గొని రూ.నాలుగు లక్షల వరకు పందెం గెలవడం గమనార్హం.  

మలికిపురం మండలంలో అశ్లీల నృత్యాలు
ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం వేట్లపాలెంలో రూ.ఆరు కోట్ల మేర పందేలు జరిగాయని అంచనా. ఇదే మండలం అచ్చంపేట జంక్షన్‌ సమీపంలో రూ.4 కోట్ల మేర పందేలు కాసినట్లు సమాచారం. మలికిపురం, లక్కవరం, రాజోలు మండలం శివకోడు, ఆత్రేయపురం, మండపేట, రాయవరం, పిఠాపురం, పెద్దాపురం, రాజానగరం మండలం దివాన్‌చెరువు, పుణ్యక్షేత్రం, రంపచోడవరం, దేవీపట్నం, చింతూరుల్లో పందేలు జోరుగా సాగాయి. కేశనపపల్లి, తూర్పుపాలెం, గొల్లపాలెంలో బహిరంగంగా అశ్లీల నృత్యాలు జరుగుతున్నా పోలీసులు అడ్డుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఉత్తరాంధ్రలో ఊపందుకున్న పందేలు
విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సమక్షంలో ఆరిలోవలో కత్తులు కట్టి కోడి పందాలను నిర్వహించారు. విశాఖ నగరం మొత్తంమ్మీద ఆరిలోవలో రెండంటే రెండు కేసులను పోలీసులు నమోదు చేశారు. 3 కోడిపుంజులు, రూ.10 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. జిల్లావాప్తంగా 145 మందిపై కేసులు నమోదు చేశారు. 77 కోడి పుంజులు, రూ.1,48,637 నగదును స్వాధీనం చేసుకున్నారు. పాయకరావుపేట, నర్సీపట్నం, అనకాపల్లి, చోడవరం నియోజకవర్గాల్లో పందాలు సాగాయి. 77 మందిపై కేసులు నమోదు చేసి రూ.1,39,018 స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం జిల్లాలో రూ.3 కోట్లు వరకూ పందేలు కాసినట్లు సమాచారం.

అనామకులపై పెట్టీ కేసులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్ళపాలెంలో 11 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఐదు కోళ్లు, కత్తులు, రూ.10,580 నగదు స్వాధీనం చేసుకున్నారు. సంతమాగులూరు మండలం ఏల్చూరులో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని 3 కోళ్లు, రూ.1,500 స్వాధీనం చేసుకున్నారు. హనుమంతునిపాడు మండలం హాజీపురం వద్ద కొత్తూరులో ఏడుగురు పందెంరాయుళ్లను అరెస్టు చేసి రూ.3,350 నగదు స్వాధీనం చేసుకున్నారు. కోడి పందేలు, జూదాలను అడ్డుకోలేకపోయిన పోలీసులు కేసుల లెక్కలు చెప్పేందుకు మాత్రం ఏర్పాట్లు చేసుకున్నారు.  700 వరకూ పెట్టీ కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. పలు గ్రామాల్లో అనామకులపై కేసులు దాఖలైనట్లు సమాచారం.

మంత్రి ఆది సొంతూరులో జోరుగా జూదం
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్‌ జిల్లాలో మంత్రి ఆదినారాయణరెడ్డి స్వగ్రామం దేవగుడిలో కోడి పందేలు, పేకాట విచ్చలవిడిగా సాగాయి. రూ.లక్షల్లో పందేలు సాగినట్లు తెలుస్తోంది. పోలీసులు తనిఖీలు జరిపినా ముందే సమాచారం అందటంతో పందెంరాయుళ్లు జాగ్రత్త పడ్డారు.

Read latest Amaravati News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top