రాష్ట్రంలో భూములు, ఆస్తుల విలువల సవరణ
ఈ నెల 26 లేదా 28 నుంచి పెంచిన విలువలు అమల్లోకి!
ఎక్కడైనా 100 శాతం లోపే భూమి విలువ పెంపు
కనీసం 5 శాతం.. సగటున 50 శాతం మార్కెట్ విలువ బట్టి ఇతర ప్రాంతాల్లో పెరుగుదల
పట్టణ ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్ల చదరపు అడుగు కనీస విలువ రూ. 2,500గా నిర్ధారణ
వ్యవసాయ భూమి ఎకరం కనీస ధర రూ. 2.25 లక్షల నుంచి రూ. 4.5 లక్షలకు..
సవరణ కసరత్తు దాదాపు పూర్తి.. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ షురూ
సీసీఎల్‌ఏ, రిజి్రస్టేషన్ల శాఖ ఐజీతో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమావేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలను సవరించే కసరత్తు దాదాపు పూర్తయింది. ప్రస్తుత బేసిక్ రిజిస్టర్ విలువలు, బహిరంగ మార్కెట్‌లో ఉన్న విలువలకు అనుగుణంగా ఎక్కడా 100 శాతం మించకుండా, కనీసం 5 శాతం పెంచుతూ సవరణ చేపట్టనున్నారు. ఈ మేరకు నిర్ణయించిన ఫార్ములాకు అనుగుణంగా సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ కార్యాలయాల వారీగా విలువలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఉండే వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలను గ్రామాలు, వార్డులు, డోర్ నంబర్ల వారీగా అప్‌లోడ్ చేసే ప్రక్రియ దాదాపు పూర్తి కాగా, తహసీల్దార్ కార్యాలయాలు చేయాల్సిన వ్యవసాయ భూముల విలువలకు సంబంధించిన ఆన్‌లైన్ ప్రక్రియ ఒకటీ రెండురోజుల్లో పూర్తి కానుంది.
ఈ విలువలను గ్రామాల వారీగా అథెంటిఫై చేసే (ప్రామాణీకరించే) బాధ్యతను అదనపు కలెక్టర్లకు అప్పగించారు. అదనపు కలెక్టర్ బయో మెట్రిక్‌తో ప్రతి గ్రామానికి సంబంధించిన విలువలను అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ నెల 26 లేదా 28వ తేదీ నుంచి సవరించిన కొత్త విలువలను అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోమవారం సచివాలయంలో భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) డీఎస్ లోకేశ్‌కుమార్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హన్మంతులతో భేటీ అయి విలువల సవరణ కసరత్తు పురోగతిని సమీక్షించారు. వీలున్నంత త్వరగా సవరించిన విలువల అప్‌లోడ్ ప్రక్రియ పూర్తి చేయాలని, ఇప్పటికే కేబినెట్ ఆమోదం పొందిన నేపథ్యంలో ఆదాయ వనరుల సమీకరణ కోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీకి వివరాలు అందజేసి పెంచిన విలువలను అమల్లోకి తేవాలని ఆదేశించారు.
పలుమార్లు పరిశీలన తర్వాతే ఖరారు
భూముల విలువల సవరణను ఒకటికి నాలుగు సార్లు పరిశీలించిన తర్వాత ఖరారు చేశారు. తొలుత నాలుగు ప్రొఫార్మాల్లో సబ్ రిజి్రస్టార్, తహసీల్దార్ కార్యాలయాల నుంచి బహిరంగ మార్కెట్ విలువను తెప్పించారు. ఈ విలువలను పరిశీలించి ప్రస్తుత బేసిక్ రిజిస్టర్ విలువతో సరిపోలి్చన తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్లు ఈ విలువలు మదింపు చేశారు. ఈ మదింపు చేసిన విలువలను మళ్లీ క్షేత్రస్థాయికి పంపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈసారి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వ్యవసాయేతర భూముల రిజి్రస్టేషన్ విలువలు 20–35 శాతం వరకు పెరగనున్నాయి. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట 33 శాతం పెరుగుతోంది. కొన్నిచోట్ల కనీసం 5 శాతం, మరికొన్ని చోట్ల అత్యధికంగా 100 శాతం పెంచనున్నారు.
వ్యత్యాసం తక్కువుంటే పాత విలువలే..
మొత్తం మీద సగటున 50 శాతం మేర విలువలు పెరుగుతాయని అంచనా. కాగా బహిరంగ మార్కెట్ విలువకు, బేసిక్ రిజిస్టర్ విలువకు తక్కువ వ్యత్యాసం ఉన్న చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రం విలువలు పాతవే కొనసాగించనున్నారు. ఖమ్మం త్రీటౌన్ పరిధిలోని గాం«దీచౌక్‌లో ప్రస్తుత చదరపు గజం భూమి బహిరంగమార్కెట్ విలువ రూ.50–60 వేలుగా ఉంది. రిజిస్ట్రేషన్ల శాఖ బేసిక్ రిజిస్టర్ విలువ ఇప్పటికే రూ.49 వేలు ఉంది. రెండు విలువలకు మధ్య వ్యత్యాసం తక్కువగా ఉండడంతో ఈసారి అక్కడి విలువలను సవరించడం లేదు.
వనస్థలిపురం పరిధిలో..
ఇక వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో ఓల్డ్ చెక్‌పోస్టు నుంచి విజయవాడ హైవే వైపునకు వెళ్లే మార్గంలో ప్రస్తుత రిజిస్టర్ విలువ రూ.44,900 ఉంది. ఇక్కడ గజం ధర బహిరంగ మార్కెట్‌లో రూ.లక్ష ఉంది. ఇక్కడ చదరపు గజం విలువను రూ.60 వేలకు పెంచుతున్నారు. అదే అపార్ట్‌మెంట్‌ల విషయానికి వస్తే వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ పరిధిలో చదరపు అడుగు విలువ రూ.3 వేలు, 5 వేలుగా సవరించనున్నారు. అంతస్తులతో సంబంధం లేకుండా ప్రతి అంతస్తుకు ఒకే విధంగా విలువలు అమలు చేయనున్నారు.
గ్రామాల్లో..పట్టణాల్లో..
గ్రామాల్లో ప్రస్తుతం చదరపు గజానికి రూ.1,300 కనీస విలువ ఉండగా, దాన్ని రూ.1,600కు పెంచనున్నారు. పట్టణ ప్రాంతాల్లో కనీస విలువ రూ.2 వేలు ఉండగా దాన్ని రూ.2,500కు పెంచుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమి కనీస ధర ఎకరానికి రూ.2.25 లక్షలుండగా, దాన్ని రూ.4.5 లక్షలకు పెంచుతున్నట్టు సమాచారం.


