కంట్లో కారం చల్లి, చున్నీతో గొంతు నులిమి చంపిన దుండగులు
నల్లగొండ జిల్లా అనుముల మండలంలోని ఇబ్రహీంపేటలో ఘటన
హాలియా: ఆస్తి కోసం తల్లీకూతుళ్లను దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా అనుముల మండలంలోని ఇబ్రహీంపేట గ్రామంలో ఆదివారం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం ఇబ్రహీంపేటకు చెందిన రుద్రాక్షి సాయిలు, వెంకటమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు యాదయ్యకు సూర్యాపేట జిల్లా నారాయణగూడెం గ్రామానికి చెందిన సుమలతతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. యాదయ్య, సుమలత (40) దంపతులకు కుమార్తె రుద్రాక్షి లావణ్య (19) సంతానం. కుమార్తె పుట్టిన ఆరు నెలలకే తండ్రి యాదయ్య మృతి చెందాడు.
దీంతో సుమలత తన కుమార్తె లావణ్యతో కలిసి వేరుగా నివాసం ఉంటోంది. కాగా, రుద్రాక్షి సాయిలు, యాదయ్యకి వారసత్వంగా వచ్చిన 6 ఎకరాల వ్యవసాయ భూమిని అతని కుమార్తె లావణ్య పేరుమీద రిజిస్టర్ చేసి గార్డియన్‌గా నానమ్మ వెంకటమ్మను పె ట్టారు. కొంతకా లం తరువాత వెంకటమ్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది. కోడలు సుమలత అత్త గురించి పట్టించుకోకపోవడంతో వెంకటమ్మ ముగ్గురు కుమార్తెలు ఆమెను ఆస్పత్రిలో చూపించగా వైద్య ఖర్చుల నిమిత్తం సుమారు రూ.30 లక్షల వరకు ఖర్చు అయినట్లు తెలిసింది.
ఈ క్రమంలో వెంకటమ్మను ఆమె కోడలు సుమలత, మనుమరాలు లావణ్య పట్టించుకోవడం లేదని వెంకటమ్మ ముగ్గురు కుమార్తెలు కోర్టులో పిటిషన్ వేశారు. గత ఏడాది లావణ్య మేజర్ అయినందున తాత సాయిలు లావణ్యకు చేసిన భూమి పట్టా విషయంలో తీర్పు అనుకూలంగా రావడంతో తమ తల్లి వెంకటమ్మకు ఆస్పత్రిలో వైద్యం కోసం ఖర్చు చేసిన రూ.30 లక్షలు ఇవ్వాలని ఆడబిడ్డలు వేసిన కేసుకు సంబంధించి రూ.5 లక్షలు ఇవ్వాలని కోర్టు రుద్రాక్షి సుమలతకు సూచించింది. సాయిలు, వెంకటమ్మ బాగోగుల విషయంలో పలుమార్లు ఆడబిడ్డలకు, సుమలతకు మధ్య తగాదాలు జరిగాయి.
ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆస్తి విషయంలో ఆడపడుచులు.. సుమలత మరోమారు ఘర్షణ పడ్డారు. అనంతరం ఉదయం 9 గంటల సమయంలో సుమలత, ఆమె కూతురు లావణ్య గ్రామ శివారులోని ఆయిల్‌పామ్ తోట వద్దకు పని చేయడానికి వెళ్లారు. అక్కడే గుర్తు తెలియని వ్యక్తులు తల్లీకూతుళ్లపై విరుచుకుపడి కంట్లో కారం చల్లారు. లావణ్య మెడకు చున్నీ, సుమలత మెడకు పైటకొంగు చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
తల్లీకూతుళ్ల హత్య విషయం తెలుసుకున్న మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. కుటుంబ సభ్యుల మధ్య కొంత కాలంగా జరుగుతున్న ఆస్తి తగాదాలే తల్లీకూతుళ్ల హత్యకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని డీఎస్పీ తెలిపారు. ఇదిలా ఉండగా మృతురాలి తల్లి శాంతమ్మ తన కుమార్తె, తన మనుమరాలు హత్యకు ఆమె ఆడపడుచులు, వారి భర్తలే కారణమని ఆరోపించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సాయి ప్రశాంత్ తెలిపారు.


