రాష్ట్ర తొలి ‘కేన్సర్ అట్లాస్’లో ఆందోళనకర అంశాలు వెలుగులోకి
ఐదేళ్లలో లక్ష మందికి చికిత్స చేస్తే వారిలో 60 శాతం మహిళలే
మధ్యవయసు మహిళల్లో అత్యధిక కేసులు
హనుమకొండలో అత్యధిక శాతం కేసుల నమోదు
కాలుష్యం, బయోమాస్ పొగ, పట్టణ జీవనశైలే ప్రధాన కారణాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కేన్సర్ వ్యాధి అనూహ్యరీతిలో పెరుగుతోంది. ముఖ్యంగా మహిళలు ఈ వ్యాధి బారిన పడుతుండటం, అందులోనూ పొగతాగే అలవాటు లేని మహిళల్లో సైతం ఊపిరితిత్తుల కేన్సర్ కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. వాయు కాలుష్యం, గృహాల్లో బయో మాస్ పొగ, మారిన జీవన శైలి, ఆలస్యంగా వ్యాధిని గుర్తించడం వంటి అంశాలే ఇందుకు ప్రధాన కారణాలని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ డేటా ఆధారంగా, ప్రముఖ ఆంకాలజిస్టు, ప్రభుత్వ కేన్సర్ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు నేతృత్వంలో రూపొందించిన రాష్ట్ర తొలి ‘కేన్సర్ ఇన్సిడెన్స్ అండ్ ప్రివలెన్స్ మ్యాపింగ్ అక్రాస్ తెలంగాణ’నివేదికను ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సమర్పించారు. ఈ ‘కేన్సర్ అట్లాస్’నివేదిక రాష్ట్రంలో కేన్సర్ విస్తృతిపై విస్తుగొలిపే వాస్తవాలను వెల్లడించింది.
పురుషుల కంటే మహిళలకే ఎక్కువ ముప్పు
ఆరోగ్యశ్రీ పథకం కింద గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 1,00,294 కేన్సర్ రోగులు చికిత్స పొందారు. వీరిలో 59,994 మంది మహిళలు కాగా, 40,300 మంది పురుషులు. అంటే మొత్తం రోగుల్లో 60 శాతం మహిళలే. అన్ని వయసుల వారితో పోలిస్తే 39 నుంచి 48 ఏళ్ల వయసు గల మధ్య వయసు్కలైన మహిళల్లో కేన్సర్ తీవ్రత అధికంగా ఉంది. ఈ వయసు విభాగంలో 15,198 మంది మహిళలు చికిత్స పొందగా, పురుషులు 8,318 మంది మాత్రమే ఉన్నారు. అయితే, చిన్నారులు, 19–32 ఏళ్ల యువతలో మాత్రం స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది.
మహిళలను వేధిస్తున్న ప్రధాన కేన్సర్లు ఏంటి?
మహిళల్లో ప్రధానంగా రొమ్ము కేన్సర్, గర్భాశయ ముఖద్వార కేన్సర్లు ఎక్కువగా నమోదవుతున్నాయి. పురుషుల్లో తల, మెడ కేన్సర్లు ఎక్కువగా ఉన్నాయి. దక్షిణ భారత మహిళల్లో పొగతాగే అలవాటు పది శాతం కంటే తక్కువ ఉన్నప్పటికీ, వారిలో ఊపిరితిత్తుల కేన్సర్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పట్టణాల్లోని వాహనాల ఉద్గారాలు, నిర్మాణ రంగ ధూళి, పరిశ్రమల పొగ ఒకవైపు అయితే, గ్రామీణ ప్రాంతాల్లో గృహాల్లో వాడే కట్టెల పొయ్యిల బయోమాస్ పొగ మహిళల ఊపిరితిత్తులను దెబ్బతీస్తోంది. ఈ సూక్ష్మ ధూళి కణాలు ఊపిరితిత్తుల లోతుల్లోకి చేరి కణాల జన్యు నిర్మాణాన్ని మారుస్తున్నాయి.
హైదరాబాద్‌లోని ప్రముఖ పరిశోధన సంస్థల అధ్యయనాల ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కొన్ని ప్రత్యేక జన్యు మార్పులున్నాయి. ఇవి పర్యావరణ కాలుష్య ప్రభావాన్ని మరింత తీవ్రతరం చేసి, శరీరం నుంచి విషపదార్థాలను బయటకు పంపే సహజ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తున్నాయి. దీనికితోడు ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, వ్యాయామం లేకపోవడం, ఊబకాయం, మితిమీరిన మానసిక ఒత్తిడి కూడా కేన్సర్ కణాల వృద్ధికి దోహదం చేస్తున్నాయి.
జిల్లాల వారీగా ఎలా ఉందంటే?
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 25 జిల్లాల్లో ప్రతి లక్ష మందికి 45 కంటే ఎక్కువ కేన్సర్ కేసులు నమోదవుతున్నాయి. కేవలం 4 జిల్లాల్లో మాత్రమే ఈ సంఖ్య 40 కంటే తక్కువగా ఉంది. జిల్లాల వారీగా చూస్తే హనుమకొండలో ప్రతి లక్ష జనాభాకు 79 కేసులతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాత హైదరాబాద్, కరీంనగర్ జిల్లాలు ఉన్నాయి. రాష్ట్రంలో కేన్సర్ చికిత్స కోసం 81 గుర్తింపు పొందిన ఆస్పత్రులు ఉన్నప్పటికీ, అందులో 54 ప్రభుత్వ, 27 ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయి.
అయితే మొత్తం కేసుల్లో 53.4 శాతం కేసులను ప్రైవేట్ ఆస్పత్రులే నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌లోనే 26 చికిత్స కేంద్రాలు ఉండగా, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద కేన్సర్ చికిత్స పరిమితిని కుటుంబానికి రూ. 10 లక్షల వరకు పెంచింది. 2020లో రూ. 89.03 కోట్లుగా ఉన్న ఆరోగ్యశ్రీ కేన్సర్ చికిత్స వ్యయం, 2025 నాటికి రూ. 260.98 కోట్లకు చేరిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆంకాలజిస్టులు ఏం చెబుతున్నారంటే....
⇒ ముందస్తు జాగ్రత్తలతోనే కేన్సర్ ముప్పు నుంచి బయటపడొచ్చు. 35 ఏళ్లు దాటిన ప్రతి మహిళ ఏటా రొమ్ము, గర్భాశయ ముఖద్వార కేన్సర్ పరీక్షలు చేయించుకోవాలి.
⇒ కాలుష్యం ఎక్కువగా ఉండే నగరాల్లో లంగ్ కేన్సర్‌పై ప్రభుత్వం ప్రత్యేక పర్యవేక్షణ, స్క్రీనింగ్ క్యాంపులు ఏర్పాటు చేయాలి.
⇒ గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యిల వాడకాన్ని పూర్తిగా తగ్గించి, 100 శాతం గ్యాస్ సిలిండర్ల వాడకాన్ని ప్రోత్సహించాలి.
⇒ పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. నిత్యం వ్యాయామం చేయాలి.
⇒ కాలుష్యానికి దూరంగా ఉండటం ద్వారా ఈ మహమ్మారి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.


