సుదీర్ఘ కెరీర్‌పై విరాట్ కోహ్లి మనోగతం
బెంగళూరు: ఐపీఎల్‌తో తక్షణమే పేరు ప్రఖ్యాతలు వచ్చినా... సుదీర్ఘ కాలం ఆటలో కొనసాగాలంటే పట్టుదల ముఖ్యం అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ విరాట్ కోహ్లి అన్నాడు. ప్రస్తుతం కాలంలో ఐపీఎల్ వల్ల యువ ఆటగాళ్లకు భారీగా డబ్బు, పేరు వస్తోందని... అయితే అక్కడితో ఆగిపోకుండా మరింత కష్టపడితేనే ఆటలో గొప్ప స్థాయికి చేరగలరని కోహ్లి వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టు, టి20 ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికిన విరాట్... ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.
ఆర్‌సీబీ స్పోర్ట్స్ సమ్మిట్ సందర్భంగా విరాట్ మాట్లాడుతూ... ‘అంతర్జాతీయ స్థాయిలో మూడు ఫార్మాట్‌ల ఆటగాడిగా కొనసాగాలంటే పట్టుదల ముఖ్యం. పట్టుదలను డబ్బుతో ముడిపెట్టలేం. ఎందుకంటే ఈ రోజుల్లో ఐపీఎల్ రూపంలో 20 బంతుల్లో 40–50 పరుగులు చేస్తే చాలు ఎనలేని పేరు, డబ్బు వస్తున్నాయి. అది సుఖవంతమైన జీవితాన్ని ఇస్తుంది. కానీ 10–15 ఏళ్లు ఏకబిగిన అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగాలంటే దానికి ఎంతో పట్టుదల ఉండాలి. అది టి20 క్రికెట్ ఆడినంత సులువు కాదు. మనల్ని మనం తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది. అప్పుడే అభిమానుల ఆదరణ, ఆట నుంచి గౌరవం పొందగలం. అలా అని టి20 క్రికెట్‌ను తక్కువ చేసి మాట్లాడటం లేదు.
ఇటీవలి కాలంలో చూస్తే... గొప్ప గొప్ప పవర్ హిట్టర్లు పుట్టుకొస్తున్నారు. వారు బంతిని బాదుతున్న విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అవలీలగా సిక్స్‌లు కొడుతున్నారు. ఐపీఎల్ ఆరంభంలో మాదిరిగా ప్రతిసారి భారీ స్కోర్ల పిచ్‌లు ఎదురుకావు. కొన్నిసార్లు కఠినమైన పిచ్‌పై రెండు, మూడు వికెట్లు కోల్పోయినప్పుడు 175–180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి జట్టును గెలిపించాల్సి వస్తుంది. అలాంటి స్థితిని తట్టుకున్న బ్యాటర్ దీర్ఘకాలం నిలబడగలుగుతాడు.
పరిస్థితులు పరీక్షిస్తున్న సమయంలో అత్యుత్తమ ఆట తీరు కనబర్చడం ముఖ్యం. నా వరకైతే ఆటను ఎప్పటికప్పుడు విశ్లేషించుకొని... పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు సాగుతా. నైపుణ్యాలను మరింత మెరుగు పర్చుకోవాలి అంటే బలమైన పునాది అవసరం. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఒక బంతిని ఎదుర్కొనే ముందు మీ దగ్గర ఎక్కువ మార్గాలు ఉండాలి. అప్పుడే కష్టమైన పిచ్‌పై కూడా పరుగులు రాబట్టగలం. అది కేవలం సాధన వల్లే సాధ్యమవుతుంది’ అని వివరించాడు.


