టెన్నిస్ దిగ్గజం బిల్లీ జీన్ కింగ్ అసాధారణ ఘనత
లాస్ ఏంజెలిస్: మహిళల టెన్నిస్‌లో ఆల్‌టైమ్ గ్రేట్‌గా గుర్తింపు... సుదీర్ఘ కెరీర్లో 12 సింగిల్స్ ట్రోఫీలు సహా ఏకంగా 39 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన ఘనత... ఎన్నో రికార్డులు, మరెన్నో రివార్డులు... ఆమె పేరుతోనే మహిళల టెన్నిస్‌లో టీమ్ ఈవెంట్ నిర్వహణ... ఇవన్నీ బిల్లీ జీన్ కింగ్ సొంతం. అయితే ఇంత అసాధారణ కెరీర్ తర్వాత కూడా జీన్ కింగ్ మదిలో ఒక తీరని కోరిక మిగిలిపోయింది. ఆటలో పడి తన గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేయలేకపోయానని అనిపించేది. రెండేళ్ల క్రితమే చదువుపై దృష్టి పెట్టాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఇప్పుడు దానిని సాధించి చూపించింది.
82 ఏళ్ల వయసులో గ్రాడ్యుయేషన్ పట్టాతో సగర్వంగా నిలిచింది. లాస్ ఏంజెలిస్‌లోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో జీన్ కింగ్ 1961లో అడ్మిషన్ తీసుకుంది. అదే ఏడాది వింబుల్డన్‌లో డబుల్స్ టైటిల్ సాధించడంతో జీన్ కింగ్ చదువుకు దూరమైంది. ఆమె విజయప్రస్థానంలో ఇది మొదటి ట్రోఫీ కాగా... దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆమె ఆటను శాసించింది. అడ్మిషన్ తీసుకున్న 65 ఏళ్ల తర్వాత ఆమె చేతుల్లోకి డిగ్రీ రావడం విశేషం.
‘దీని విలువ ఎంతో నేను మాటల్లో చెప్పలేను. నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉంది. మీరు ఏదైనా సాధించాలని అనుకుంటే, మీపై మీకు నమ్మకం ఉంటే వయసులో సంబంధం లేదు. దేనికైనా ఆలస్యం అనేదే ఉండదు’ అని బిల్లీ జీన్ కింగ్ వ్యాఖ్యానించింది. 2026లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న మరో 6 వేల మందితో కలిసి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో కరతాళ ధ్వనుల మధ్య ఆమె తన డిగ్రీ పట్టాను అందుకుంది.


