వెటరన్ పేసర్ మహ్మద్ షమీకి టీమిండియా సెలక్టర్లు మరోసారి మొండిచేయి చూపారు. అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టు, వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన జట్లలో అతడికి చోటు ఇవ్వలేదు. దీంతో పునరాగమనం చేయాలని ఉవ్విళ్లూరుతున్న షమీ.. మరికొంత కాలం వేచిచూడక తప్పని పరిస్థితి.
శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీలో
కాగా స్వదేశంలో జూన్ 6 నుంచి అఫ్గనిస్తాన్‌తో టీమిండియా ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడనుంది. ఇందుకు సంబంధించిన జట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీలో సాగే ఈ సిరీస్‌లలో కొత్తగా యువ పేసర్లు గుర్నూర్‌బ్రార్, ప్రిన్స్ యాదవ్ (వన్డేలకు మాత్రమే)లకు సెలక్టర్లు చోటిచ్చారు.
పేస్ దళ నాయకుడిగా సిరాజ్
ఇక ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వగా.. హైదరాబాదీ స్టార్ మహ్మద్ సిరాజ్ పేస్ దళ నాయకుడిగా ముందుండి నడిపించనున్నాడు. అతడితోడు ప్రసిద్ కృష్ణ కూడా ఉన్నాడు. ఇక వన్డే జట్టులో వీరితో పాటు అర్ష్‌దీప్ సింగ్‌కు సెలక్టర్లు చోటిచ్చారు.
మరోవైపు.. స్పిన్ విభాగంలో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్ష్ దూబే స్థానం సంపాదించారు. ఈ నేపథ్యంలో షమీ గురించి ప్రశ్న ఎదురుకాగా.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మరోసారి పాత పాటే పాడాడు. షమీ కేవలం పొట్టి ఫార్మాట్‌కు మాత్రమే సిద్ధంగా ఉన్నాడంటూ మళ్లీ అతడిని ఉడికించాడు.

అసలు చర్చే జరుగలేదు
‘‘ప్రస్తుత పరిస్థితుల్లో అతడు టీ20 క్రికెట్ ఆడేందుకు మాత్రమే సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈసారి మహ్మద్ షమీ గురించి మా మధ్య అసలు చర్చే జరుగలేదు’’ అని అగార్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. షమీకి బదులు జమ్మూ కశ్మీర్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఆకిబ్ నబీ గురించి చర్చ జరిగిందని.. అయితే, అతడికి కూడా స్థానం దక్కలేదని పేర్కొన్నాడు.
కాగా గతేడాది ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనలకు కూడా షమీని సెలక్ట్ చేయలేదన్న సంగతి తెలిసిందే. సర్జరీ తర్వాత అతడు ఫిట్‌గా లేడన్న కారణంగానే ఎంపిక చేయలేదని అగార్కర్ నాడు పేర్కొన్నాడు.
సత్తా చాటినా...
ఇందుకు షమీ గట్టిగానే బదులిచ్చాడు. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని.. కావాలనే పక్కనపెడుతున్నారని ఆరోపించాడు. అంతేకాదు.. రంజీ తాజా ఎడిషన్‌లో బెంగాల్ తరఫున సత్తా చాటి మరోసారి తనను తాను నిరూపించుకున్నాడు.
అయినప్పటికీ సెలక్టర్లు షమీకి అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు మళ్లీ కూడా ఫిట్‌నెస్ కారణాలు చూపుతూ అతడిని పక్కనపెట్టామని అగార్కర్ చెప్పడం గమనార్హం. దీనిని బట్టి 35 ఏళ్ల షమీ ఇక టీమిండియా తరఫున పునరాగమనం చేయడం దాదాపు అసాధ్యమనే తేలిపోయింది.
67 వికెట్లు పడగొట్టినా..
కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో భారత్ ఫైనల్ చేరడంలో షమీ కీలక పాత్ర పోషించాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా చాంపియన్‌గా నిలవడంలోనూ ఈ రైటార్మ్ పేసర్ హస్తం ఉంది. అయితే ఆ తర్వాత.. అతడు పరిమిత ఓవర్ల జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
ఇక చివరగా 2023 జూన్‌లో టీమిండియా తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన షమీ.. రీఎంట్రీ కోసం పరితపిస్తున్నాడు. బెంగాల్ తరఫున 2025-26 సీజన్లో షమీ మొత్తంగా 67 వికెట్లు కూల్చాడు. అయినప్పటికీ టీమిండియా సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ.. 12 మ్యాచ్‌లలో కలిపి 10 వికెట్లు కూల్చాడు.


