మెయిన్‌ 'డ్రా'కు సాత‍్విక్‌ - రాధిక జోడీ | Satwik and Radhika pair up for the main draw | Sakshi
Sakshi News home page

మెయిన్‌ 'డ్రా'కు సాత‍్విక్‌ - రాధిక జోడీ

May 20 2026 3:45 AM | Updated on May 20 2026 3:45 AM

Satwik and Radhika pair up for the main draw

కౌలాలంపూర్‌: మలేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో కణపురం సాత్విక్‌ రెడ్డి–రాధిక శర్మ (భారత్‌) ద్వయం మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లో జాతీయ చాంపియన్స్‌ సాత్విక్‌ రెడ్డి (తెలంగాణ)–రాధిక శర్మ (పంజాబ్‌) జోడీ 21–15, 21–17తో దాతు అనీఫ్‌ ఇసాక్‌–క్లారిస్సా సాన్‌ (మలేసియా) జంటపై విజయం సాధించింది. నేడు జరిగే మెయిన్‌ ‘డ్రా’ తొలి రౌండ్‌లో అలెగ్జాండర్‌ డున్‌–జూలీ మెక్‌పర్సన్‌ (స్కాట్లాండ్‌) జంటతో సాత్విక్‌–రాధిక ద్వయం తలపడుతుంది. 

మరోవైపు మహిళల క్వాలిఫయింగ్‌ సింగిల్స్‌లో భారత రైజింగ్‌ స్టార్స్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. అష్మిత చాలిహా మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించగా... ఆకర్షి కశ్యప్‌ క్వాలిఫయింగ్‌లో నిష్క్రమించింది. అష్మిత 21–23, 21–16, 21–16తో పాయ్‌ యు పో (చైనీస్‌ తైపీ)పై గెలిచింది. ఆకర్షి 21–15, 20–22, 7–21తో పార్క్‌ గా యున్‌ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. 

పురుషుల డబుల్స్‌ మెయిన్‌ ‘డ్రా’ తొలి రౌండ్‌లో హరిహరన్‌–ఎంఆర్‌ అర్జున్‌ 21–19, 21–15తో ఏడో సీడ్‌ క్రిస్టో పొపోవ్‌–టోమా జూనియర్‌ పొపోవ్‌ (ఫ్రాన్స్‌)లపై గెలిచారు. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో శిఖా గౌతమ్‌–అశ్విని భట్‌ (భారత్‌) జంట 15–21, 21–17, 17–21తో జాకీ డెంట్‌–క్రిస్టల్‌ లాయ్‌ (కెనడా) జోడీ చేతిలో ఓటమి పాలైంది.  

Advertisement
 
Advertisement
Advertisement