ఆటలో అసలైన మార్పులు రావాలి
మాజీ ప్లేయర్ రోహన్ బోపన్న
ముంబై: భారత మాజీ టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఇప్పుడు పరిపాలనా వ్యవహారాల వైపు పూర్తి స్థాయిలో రావాలని ఆశిస్తున్నాడు. అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) ఎన్నికల్లో పాల్గొని జాతీయ స్థాయిలో అన్ని రకాలుగా భాగం కావాలని అతను భావిస్తున్నాడు. ఏఐటీఏలో చేరితే టెన్నిస్‌లో పలు కీలక మార్పులు తీసుకొచ్చేందుకు తాను సిద్ధమని బోపన్న ప్రకటించాడు. 2024లో జరిగిన ఎన్నికల ఫలితాలపై చెలరేగిన వివాదం కోర్టు జోక్యంతో ఇటీవలే సమసిపోగా... త్వరలోనే మళ్లీ పూర్తి స్థాయిలో ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో బోపన్న వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బోపన్న ఇప్పటికే కర్ణాటక టెన్నిస్ సంఘంలో ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. ‘ఏఐటీఏలో ఎన్నికల సమయం వచ్చింది. నాకూ ఏదైనా అవకాశం దొరికితే ఈ పరిపాలనలో భాగం కావాలని కోరుకుంటున్నా. భారత టెన్నిస్‌ను అభివృద్ధి చేసే దిశగా కీలక మార్పులు చేయగలననే విశ్వాసం నాకుంది. అలాంటి అవసరం ఇప్పుడు చాలా ఉంది. ఏదో ఒక పదవి తీసుకోవడం నా ఉద్దేశం కాదు. నా వంతుగా ఏదైనా చేయగలనని నమ్మితే కచ్చితంగా వస్తా’ అని బోపన్న చెప్పాడు.
మరోవైపు భారత టెన్నిస్‌లో డబుల్స్ ఆటగాళ్లను తీర్చిదిద్దే క్రమంలో తన సొంత అకాడమీలో సాగుతున్న ‘డబుల్స్ డ్రీమ్స్ ఆఫ్ ఇండియా’ కార్యక్రమంపై కూడా బోపన్న మాట్లాడాడు. ఇటీవలి కాలంలో డబుల్స్‌కు కూడా ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో తాను దానిపై దృష్టి పెట్టానని, పైగా స్పాన్సర్ల సహకారం కూడా లభించిందని అతను వెల్లడించాడు. ‘మా అకాడమీలో డబుల్స్ ఆటగాళ్లపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాం. దీనికి స్పాన్సర్లు కూడా లభించడం సానుకూలాంశం. సింగిల్స్‌తో పోలిస్తే ఇటీవల డబుల్స్‌కు మంచి ప్రాధాన్యత పెరిగింది. అందుకే దీనికి డబుల్స్ డ్రీమ్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టాం.
మా అకాడమీలో మొత్తం 175 మంది ఆటగాళ్లు శిక్షణ పొందుతున్నారు. వీరిలో ఇప్పటికే దక్షిణేశ్వర్ సురేశ్, వైష్ణవి అడ్కర్, దేవ్ జావియా, ప్రార్థన తోంబరే తమకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అసోం, జమ్మూకు చెందిన కొందరు ప్రతిభ గల పేద కుర్రాళ్లకు గుర్తించి ఉచితంగా శిక్షణ ఇస్తున్నాం. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. భవిష్యత్తులో అత్యుత్తమ ఆటగాళ్లు రావాలనేదే నా లక్ష్యం’ అని గతంలో డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచిన రోహన్ బోపన్న వివరించాడు.


