మానవ్ సుతార్, హర్ష్ దూబే , గుర్‌నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్‌లకు తొలిసారి చోటు
అఫ్గానిస్తాన్‌తో టెస్టు, వన్డే సిరీస్‌లకు భారత జట్ల ఎంపిక
బుమ్రా, జడేజాలకు విశ్రాంతి
వైస్ కెప్టెన్సీ కోల్పోయిన పంత్
వన్డే జట్టులో రోహిత్, కోహ్లి
గువాహటి: సొంతగడ్డపై వచ్చే నెలలో అఫ్గానిస్తాన్‌తో జరగనున్న ఏకైక టెస్టుతో పాటు వన్డే సిరీస్ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ భారత జట్లను ప్రకటించింది. దేశవాళీల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న నలుగురు కుర్రాళ్లకు జాతీయ జట్టులో తొలిసారి అవకాశం దక్కగా... ఐపీఎల్‌లో ఆకట్టుకోలేకపోతున్న రిషభ్ పంత్ వన్డే జట్టులో చోటు కోల్పోయాడు. అలాగే ఇప్పటి వరకు టెస్టు జట్టులో వైస్ కెప్టెన్‌గా ఉన్న అతడు ఇప్పుడిక కేవలం ప్లేయర్‌గానే కొనసాగనున్నాడు.
పంత్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలను కేఎల్ రాహుల్‌కు బదలాయించారు. టెస్టు, వన్డే జట్లకు శుబ్‌మన్ గిల్ నాయకత్వం వహించనుండగా... సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వన్డే సిరీస్‌కు ఎంపికయ్యారు. పనిభారం కారణంగా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు. రవీంద్ర జడేజా కూడా రెస్ట్ ఇవ్వగా... అక్షర్ పటేల్‌ను ఎంపిక చేయలేదు. రోహిత్‌తో పాటు హార్దిక్ పాండ్యా వన్డే సిరీస్‌కు ముందు ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంది.
జూన్ 6 నుంచి భారత్, అఫ్గానిస్తాన్ మధ్య న్యూ చండీగఢ్‌లో ఏకైక టెస్టు జరగనుంది. ఆ తర్వాత జూన్ 14న ధర్మశాలలో తొలి వన్డే, 17న లక్నోలో రెండో వన్డే, 20న చెన్నైలో మూడో వన్డే జరగనున్నాయి. ‘అఫ్గాన్‌తో సిరీస్‌ల అనంతరం ఇంగ్లండ్ పర్యటన వరకు బుమ్రా జట్టుతో చేరుతాడు’ అని అగార్కర్ పేర్కొన్నాడు. ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి టెస్టు, వన్డే జట్లలో చోటు నిలబెట్టుకున్నాడు.
భారత టెస్టు జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, రిషభ్ పంత్, దేవదత్ పడిక్కల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, మానవ్ సుతార్, గుర్‌నూర్ బ్రార్, హర్ష్ దూబే , ధ్రువ్ జురేల్.
భారత వన్డే జట్టు: గిల్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రోహిత్, కోహ్లి, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే , కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్‌నూర్ బ్రార్.
ప్రిన్స్ యాదవ్: తాజా ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... ఆ జట్టు పేసర్ ప్రిన్స్ యాదవ్ మాత్రం తన వేగం, కచ్చితత్వంతో సెలెక్టర్ల మెప్పు పొందాడు. గతేడాదే ఐపీఎల్ అరంగేట్రం చేసిన 24 ఏళ్ల ప్రిన్స్... ఈ సీజన్‌లో నిలకడ కనబర్చాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఈ ఢిల్లీ బౌలర్‌కు పెద్దగా అనుభవం లేకపోయినా... లిస్ట్ ‘ఎ’, ఐపీఎల్ ప్రదర్శనతో అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. యార్కర్‌లు వేయడంలో దిట్ట అయిన ప్రిన్స్ వన్డే సిరీస్‌లో రాణిస్తే... ఈ ఏడాది చివర్లో జరిగే న్యూజిలాండ్‌తో సిరీస్‌కు అతడి పేరును పరిశీలించే అవకాశం లేకపోలేదు.
మానవ్ సుతార్: రాజస్తాన్‌కు చెందిన 23 ఏళ్ల మానవ్ సుతార్.. చాన్నాళ్లుగా దేశవాళీల్లో నిలకడ కనబరుస్తున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 29 మ్యాచ్‌ల్లో 129 వికెట్లు పడగొట్టిన ఈ ఎడంచేతి వాటం స్పిన్నర్... బ్యాటింగ్‌లోనూ ఓ చేయి వేయగలడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సుతార్‌ను ఏకైక టెస్టు కోసం ఎంపిక చేశారు. జడేజా, అక్షర్ జట్టులో లేకపోవడంతో సుతార్‌కు అవకాశం దక్కింది. కుల్దీప్, సుందర్‌లు తుది జట్టులో ఉండటం ఖాయం కాగా... మూడో స్పిన్నర్‌గా టీమ్‌లో చోటు కోసం హర్ష్ దూబే తో సుతార్ పోటీపడనున్నాడు.
గుర్‌నూర్ బ్రార్: చాన్నాళ్లుగా భారత జట్టులో నెట్ బౌలర్‌గా కొనసాగుతున్న 25 ఏళ్ల గుర్‌నూర్ బ్రార్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌కు బ్రార్‌పై అపార నమ్మకం ఉండగా... అతడికి పంజాబ్‌కే చెందిన భారత సారథి గిల్ మద్దతు దండిగా ఉంది. ఐపీఎల్‌లోనూ గుజరాత్ టైటాన్స్ జట్టులో ఉన్న అతడు రెండేళ్లలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అదనపు బౌన్స్ రాబట్టడంలో మంచి నైపుణ్యం ఉన్న ఆరున్నర అడుగుల గుర్‌నూర్ దక్షిణాఫ్రికా వంటి పేస్ పిచ్‌లపై ప్రభావం చూపగలడని సెలెక్షన్ కమిటీ నమ్ముతోంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 18 మ్యాచ్‌లు ఆడిన బ్రార్ 27.30 సగటుతో 52 వికెట్లు పడగొట్టాడు.
హర్ష్ దూబే : సుదీర్ఘ ఫార్మాట్‌లో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న 23 ఏళ్ల హర్ష్ దూబే కు మొదటిసారి జాతీయ జట్టులో చోటు దక్కింది. 2024–25 రంజీ సీజన్‌లో రికార్డు స్థాయిలో 69 వికెట్లు పడగొట్టడంతో పాటు 476 పరుగులు చేసిన దూబే... తాజా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 27 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 23.26 సగటుతో 133 వికెట్లు తీసిన హర్ష్... 1026 పరుగులు సైతం చేశాడు. అతడి ఖాతాలో 9 అర్ధశతకాలు ఉన్నాయి.


