ఐపీఎల్-2026 ముగిసిన వారం వ్యవధిలోపే టీమిండియా అంతర్జాతీయ క్రికెట్ బరిలో దిగనుంది. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఎంపిక ఎలా ఉండబోతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది.
బుమ్రాకు విశ్రాంతి
ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇక సొంతగడ్డపై స్పిన్నర్ల ప్రభావమే ఎక్కువ కాబట్టి.. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌లకు బౌలింగ్ విభాగంలో చోటు ఖాయం.
ఇక బుమ్రా లేకపోయినా మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ పేస్ దళంలో ఉండనే ఉన్నారు. అయితే, అఫ్గన్ బలహీన జట్టు కాబట్టి ఈసారి ప్రయోగాలు చేయాలని టీమిండియా యాజమాన్యం భావిస్తున్నట్లు వినికిడి.
ఆకిబ్ నబీ ఎంపికపై చర్చ
ఈ నేపథ్యంలో గత ఏడాది రంజీల్లో అత్యధిక వికెట్లతో సత్తా చాటిన జమ్మూ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఆకిబ్ నబీ ఎంపికపై చర్చ నడుస్తోంది. అతడిని తప్పక ఈ సిరీస్‌కు ఎంపిక చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, తాజాగా ఓ జర్నలిస్టు సోషల్ మీడియా వేదికగా నబీ అరంగేట్రం ఇప్పట్లో కష్టమనే సంకేతాలు ఇచ్చారు.
పేస్ లేదు
‘‘అఫ్గనిస్తాన్‌తో టెస్టుకు రిషబ్ పంత్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఆకిబ్ నబీ 60 వికెట్లు తీసినా.. అతడి బౌలింగ్‌లో పెద్దగా పేస్ లేదనే చర్చ జరిగింది. అతడు అందరినీ ఆకట్టుకోలేకపోయాడు.
ఒకవేళ అతడికి పదిహేను మంది సభ్యుల టెస్టు జట్టులో చోటు దక్కినా.. ఇప్పట్లో అరంగేట్రం చేయడం కష్టమే. అంతేకాదు ఈసారి కూడా అతడిని ఎంపిక చేసే అవకాశాలు చాలా తక్కువ’’ అని కుశన్ సర్కార్ అనే జర్నలిస్టు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ప్రిన్స్ యాదవ్‌కు అవకాశం!
ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్ వన్డే సిరీస్‌కు మాత్రం బీసీసీఐ కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశం లేకపోలేదు. దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో 17 వికెట్లు పడగొట్టడంతో పాటు ప్రస్తుత ఐపీఎల్‌లో కూడా చెలరేగుతున్న ప్రిన్స్ యాదవ్ పేరు తెరమీదకు వచ్చింది.
హర్షిత్ రాణా ఇంకా ఫిట్‌నెస్ సాధించకపోవడంతో ప్రిన్స్‌ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా మే 31న ఫైనల్‌తో ఐపీఎల్ తాజా సీజన్ ముగియనున్న సంగతి తెలిసిందే.
భారత్ వర్సెస్ అఫ్గనిస్తాన్ సిరీస్‌ల షెడ్యూల్
👉ఏకైక టెస్టు: జూన్ 6 నుంచి ఆరంభం, న్యూ చండీగఢ్
👉తొలి వన్డే: జూన్ 14, ధర్మశాల
👉రెండో వన్డే: జూన్ 17, లక్నో
👉మూడో వన్డే: జూన్ 20, చెన్నై.


