Photo Courtesy: IPL 2026
రాజస్తాన్ రాయల్స్ యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని టీమిండియాకు ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐ సెలెక్షన్ కమిటీ హెడ్ అజిత్ అగార్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మంగళవారం అఫ్గానిస్తాన్‌తో సిరీస్ కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ టీమిండియా జట్టును ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. జట్టు ఎంపికకు సంబంధించిన వివరాలను అగార్కర్ మీడియాకు వెల్లడించాడు.
ఈ నేపథ్యంలో టీమిండియా ఓపెనింగ్ స్లాట్‌కు వైభవ్ సూర్యవంశీ పేరును ఏమైనా పరిగణలోకి తీసుకున్నారా అని ఒక విలేకరి ప్రశ్న సంధించాడు. దీనిపై అగార్కర్ ఆసక్తికరంగా స్పందించాడు. వైభవ్ సూర్యవంశీ చిన్న వయసులోనే క్రికెట్లో సంచలన ప్రదర్శన చేస్తున్న విషయాన్ని తాను అంగీకరిస్తున్నట్లు తెలిపాడు.
కానీ ప్రస్తుతం టీమిండియాలో ఓపెనింగ్ స్థానానికి యశస్వి జైస్వాల్‌కు తాము అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపాడు. ‘వైభవ్ సూర్య వంశీ బాగా ఆడుతున్నాడు, కానీ అంతకముందే టీమిండియాలోకి వచ్చిన జైస్వాల్‌ను మనం మర్చిపోకూడదు. వైభవ్ అద్భుతంగా ఆడు తున్నప్పటికీ, అతడి కంటే సీనియర్ అయిన జైస్వాల్ కూడా బాగానే రాణిస్తున్నాడు.
ఇప్పటికే వైభవ్ ‘ఇండియా-ఏ' జట్టుకు ఎంపికయ్యాడు. త్వరలోనే టీమిండియా సీనియర్ జట్టుకు కూడా ఆడే అవకాశముంది. కానీ దానికి ఇంకా సమయం ఉంది. ఈలోగా ఇండియా-ఏ తరఫున వైభవ్ బాగా రాణించాలని ఆశిస్తున్నా’ అని అగార్కర్ పేర్కొన్నాడు.
ఇక ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ తరఫున ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. భారీ స్కోర్లు నమోదు చేయనప్పటికీ క్రీజులోకి అడుగుపెట్టడమే ఆలస్యం..ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు.
ఈ సీజన్లో 12 మ్యాచ్‌లాడిన వైభవ్ సూర్యవంశీ 486 పరుగులు సాధించాడు. దీంతో వైభవ్ సూర్యవంశీ త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా అగార్కర్ టీమిండియాలో వైభవ్ ఎంపికకు ఇంకా సమయం ఉందని కుండబద్దలు కొట్టాడు.


