BBL: బీసీసీఐ చారిత్రక అడుగు | BBL 2026 27 Set For Historic 1st As Chennai To Host Season Opener | Sakshi
Sakshi News home page

BBL: బీసీసీఐ చారిత్రక అడుగు

May 19 2026 3:17 PM | Updated on May 19 2026 4:28 PM

BBL 2026 27 Set For Historic 1st As Chennai To Host Season Opener

బీబీఎల్‌-2025 విజేత పెర్త్‌ స్కార్చర్స్‌

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) చారిత్రక ముందడుగు వేసినట్లు సమాచారం. ఆస్ట్రేలియా టీ20 ఫ్రాంఛైజీ క్రికెట్‌ బిగ్‌బాష్‌ లీగ్‌ (BBL)కు తొలిసారి ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమైంది. తమిళనాడులోని ప్రఖ్యాత ఎంఏ చిదంబరం స్టేడియం ఇందుకు వేదిక కానుంది.

బిగ్‌బాష్‌ లీగ్‌ తదుపరి సీజన్‌ డిసెంబరు రెండో వారంలో మొదలుకానుంది. ఈ నేపథ్యంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా (CA) కొత్త ప్రతిపాదనతో బీసీసీఐ ముందుకు వచ్చింది. బీబీఎల్‌ పదహారో సీజన్‌ ఆరంభ మ్యాచ్‌కు భారత్‌ను వేదికగా ఎంచుకుంది.

మార్కెట్‌ను పెంచుకునే వ్యూహం
భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ దృష్ట్యా మార్కెట్‌ను పెంచుకునే వ్యూహంలో భాగంగా సీఏ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీసీసీఐని సంప్రదించి.. తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌ (TNCA)తో చర్చలు జరిపినట్లు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ ఇన్ఫో వెల్లడించింది.

సానుకూల స్పందన
సీఏకు సంబంధించిన ఐదుగురు సభ్యుల బృందం చెపాక్‌ స్టేడియాన్ని సందర్శించి.. సంతృప్తి వ్యక్తం చేసినట్లు పేర్కొంది. ఈ క్రమంలో బీబీఎల్‌-2026 ఆరంభ మ్యాచ్‌ను ఇక్కడ నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇందుకు బీసీసీఐ, టీఎన్‌సీఏ నుంచి కూడా సానుకూల స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. 

ఆ ఇద్దరు
కాగా బీసీసీఐ నిబంధనల ప్రకారం.. యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లు ఎవరూ విదేశీ లీగ్‌లలో ఆడే అవకాశం లేదు. కాబట్టి బీబీఎల్‌ ఓపెనింగ్‌ మ్యాచ్‌ చెన్నైలో జరిగినా దేశీ అభిమానులు పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు. ఇదిలా ఉంటే... కెప్టెన్‌ హోదాలో భారత్‌కు అండర్‌-19 వరల్డ్‌కప్‌ అందించిన ఉన్ముక్త్‌ చాంద్‌ ఈసారీ బీబీఎల్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది.

ఉన్ముక్త్‌తో పాటు నిఖిల్‌ చౌదరి కూడా ఈ సీజన్‌లో ఆడే అవకాశం ఉంది. కాగా భారత దేశీ క్రికెట్‌లో ఆడిన నిఖిల్‌.. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు. బీబీఎల్‌లో హోబర్ట్‌ హారికేన్‌ జట్టుకు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. మరోవైపు ఉన్ముక్త్‌ అమెరికాలో సెటిలైన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌ రిటైర్మెంట్‌ ద్వారా బీసీసీఐతో సంబంధాలు తెంచుకున్న భారత స్పిన్‌ దిగ్గజం రవిచంద్రన్‌ అశ్విన్‌ కూడా బీబీఎల్‌లో చేరాడు. 2025-26 సీజన్‌లో సిడ్నీ థండర్‌తో ఒప్పందం కుదుర్చుకున్న అశ్విన్‌.. మోకాలి గాయం కారణంగా మ్యాచ్‌లు ఆడలేకపోయాడు.  ఇదిలా ఉంటే.. బీబీఎల్‌-2025 విజేతగా పెర్త్‌ స్కార్చర్స్‌ నిలిచింది.

చదవండి : సంజూను అసభ్యంగా దూషించిన క్లాసెన్‌!.. వీడియో వైరల్‌

Advertisement
 
Advertisement
Advertisement