ధరలు పెరుగుతాయ్‌.. ఎరువులు కూడా దొరకవ్‌ | Rahul Gandhi Slams Modi Govt At Raebareli Bahujan Swabhimaan Sabha | Sakshi
Sakshi News home page

ధరలు పెరుగుతాయ్‌.. ఎరువులు కూడా దొరకవ్‌

May 20 2026 1:59 PM | Updated on May 20 2026 2:11 PM

Rahul Gandhi Slams Modi Govt At Raebareli Bahujan Swabhimaan Sabha

సాక్షి, రాయ్‌బరేలీ: దేశంలో ఆర్థిక తుపాను ముంచుకొస్తుందన్న ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మరోసారి అదే తరహా ఆందోళన వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతోందని వ్యాఖ్యానించారాయన. తన సొంత నియోజకవర్గం రాయ్‌బరేలీలో బుధవారం నిర్వహించిన బహుజన్‌ స్వాభిమాన్‌ సభలో పాల్గొన్న ఆయన మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు.

ద్రవ్యోల్బణం మనిషి(మోదీని ఉద్దేశించి..) తన వసూళ్లను ఇప్పటితోనే ఆపరు. ఆయన జనాల్ని మభ్యపెట్టడానికి ప్రతీసారి టీవీల ముందుకు వచ్చి భావోద్వేగంతో ఏడుస్తారు. త్వరలో మరోసారి అలా జరగొచ్చు. కొన్ని నెలల్లో ద్రవ్యోల్బణం ఎక్కడికి వెళ్తుందో చూడండి. నిత్యావసర ధరలు భారీగా పెరిగి ఆకాశాన్నంటుతాయి. రాబోయే రోజుల్లో రైతులకు ఎరువులు కూడా దొరకవు. విదేశాలకు వెళ్లొద్దని మోదీ చెప్తారు. కానీ ఆయన వేల కోట్ల విలువైన విమానాల్లో విదేశాలకు వెళ్తారు అని రాహుల్‌ మండిపడ్డారు.

ప్రధాని మోదీ తాను పిలుపునిచ్చిన పొదుపు చర్యలను తానే పాటించడం లేదని మంగళవారం బఛ్‌రావా సభలో రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో.. ప్రస్తుత ప్రభుత్వం మారేంతవరకూ ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంటుందని వ్యాఖ్యానించారాయన.

‘‘ప్రపంచం మొత్తం త్వరలో తీవ్ర చమురు, ఎరువుల కొరతను ఎదుర్కోబోతోంది. ఈ సంక్షోభాన్ని మన జీవితాల్లో మనం ఎప్పుడూ చూసి ఉండం. దీనినెవరూ ఆపలేరు. దీని ప్రభావం ఎవరిపై పడుతుంది.. అదానీ, అంబానీలు వారి ప్యాలెస్‌లలో భద్రత మధ్య బాగానే ఉంటారు. కానీ మన రైతులు, యువత, చిన్న వ్యాపారులు, చిన్న పరిశ్రమల వారు తీవ్రంగా నష్టపోతారు అంటూ రాహుల్‌ ప్రసంగించారు. 

ఇదిలా ఉంటే.. పెట్రోల్‌ ధరల పెంపుపై ఇవాళ కాంగ్రెస్‌‌ పార్టీ వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతోంది. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలతో సహా అన్నిచోట్లా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో ప్రదర్శలు నిర్వహిస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement