మోదీ, అమిత్‌ షా, ఆర్‌ఎస్‌ఎస్‌ ముమ్మాటికీ ద్రోహులే | Narendra Modi, Amit Shah traitors, sold country to industrialists | Sakshi
Sakshi News home page

మోదీ, అమిత్‌ షా, ఆర్‌ఎస్‌ఎస్‌ ముమ్మాటికీ ద్రోహులే

May 21 2026 5:10 AM | Updated on May 21 2026 5:10 AM

Narendra Modi, Amit Shah traitors, sold country to industrialists

రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు, దేశాన్ని అమ్మేస్తున్నారు: రాహుల్‌ గాంధీ

రాయ్‌బరేలీ: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) ముమ్మాటికీ ద్రోహులు అంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. వారంతా కలిసి భారత రాజ్యాంగంపై నిత్యం దాడి చేస్తున్నారని, దేశ ప్రయోజనాలను కొంతమంది పారిశ్రామికవేత్తలకు అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాహుల్‌ తన సొంత నియోజకర్గం రాయ్‌బరేలీలో రెండో రోజు బుధవారం కూడా పర్యటించారు. స్థానిక విప్లవవీరుడు ‘వీరా పాసీ’ సంస్మరణార్థం న్విహించిన బహుజన్‌ స్వాభిమాన్‌ సభలో ప్రసంగించారు. 

ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు మీ ఇళ్లకు వచ్చి మోదీ, అమిత్‌ షాల గురించి మాట్లాడితే నిలబడి గట్టిగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మోదీ, అమిత్‌ షా, ఆర్‌ఎస్‌ఎస్‌లు ద్రోహులేనని తేల్చిచెప్పాలని సూచించారు. రాజ్యాంగం, అంబేడ్కర్, గాం«దీజీలపై దాడి చేస్తూ దేశాన్ని అమ్మేస్తున్నవారు ద్రోహులు కాక ఇంకేమవుతారని ప్రశ్నించారు. ప్రధాని మోదీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ, కుల గణన చేపట్టకుండా జాప్యం చేస్తూ, బడా పారిశ్రామికవేత్తలకు మేలు చేస్తూ రాజ్యాంగంపై నిత్యం 20 గంటలూ దాడి చేస్తున్నారని నిప్పులు చెరిగారు.

  త్వరలో ఆర్థిక సంక్షోభం రాబోతోందని, ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతుందని, పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఆహారం సహా అన్నింటి ధరలు ఎగబాకుతాయని రాహుల్‌ గాంధీ పునరుద్ఘాటించారు. ఎరువుల ధరలు సైతం పెరగడం తథ్యమని అన్నారు. ఆర్థిక సంక్షోభం కారణంగా సామాన్య ప్రజలే నష్టపోతారని, అంబానీ, అదానీలపై ఎలాంటి ప్రభావం ఉండదని వ్యాఖ్యానించారు. 

అంబానీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి, దాన్ని విదేశాలకు విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడని, ఆ సొమ్మును నరేంద్ర మోదీకి చేరవేస్తున్నాడని రాహుల్‌ ధ్వజమెత్తారు. రాబోయే సంక్షోభం నుంచి ప్రజలను ప్రభుత్వం కాపాడలేదని, దాని ప్రభావం రెండు మూడు నెలల్లో కనిపిస్తుందని అన్నారు. చమురు ధరల విషయంలో ప్రభుత్వం తప్పేమీ లేదని మోదీ అంటున్నారని ఆక్షేపించారు. కానీ, తప్పంతా మోదీ, అమిత్‌ షా, ఆర్‌ఎస్‌ఎస్‌లదని తేల్చిచెప్పారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తుండడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని రాహుల్‌ విమర్శించారు.

‘అది నాయకత్వ లక్షణం కాదు.. గిమ్మిక్‌’ 
ప్రధాని మోదీ ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలొనీకి మెలొడీ చాక్లెట్లు బహుమతిగా ఇవ్వడంపై రాహుల్‌ గాంధీ ‘ఎక్స్‌’లో స్పందించారు. ‘అది నాయకత్వ లక్షణం కాదు.. ఉత్తి గిమ్మిక్‌’ అని తేల్చిచెప్పారు. ఒకవైపు పెరిగిపోతున్న ఆర్థిక సంక్షోభాన్ని పట్టించుకోకుండా ఇటలీలో చాక్లెట్లు ఇస్తున్నారని మోదీపై మండిపడ్డారు. మన రైతులు, కార్మికులు, వ్యాపారులు కష్టాల్లో ఉంటే మోదీ మాత్రం నవ్వుతూ రీల్స్‌ చేస్తున్నారని, అది చూసి బీజేపీ నేతలు, కార్యకర్తలు చప్పట్లు కొడుతున్నారని రాహుల్‌ విమర్శించారు.    

రాజకీయాల్లో ఆయన రాహువు 
బీజేపీ చీఫ్‌ నబీన్‌ మండిపాటు
న్యూఢిల్లీ:  ప్రధాని మోదీ ద్రోహి అంటూ కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్‌ మాటలు ఆయన అరాచక మనస్తత్వాన్ని, స్వభావాన్ని ప్రతిబింబిస్తున్నాయని ధ్వజమెత్తారు. 140 కోట్ల మంది ప్రజలను దారుణంగా కించపర్చారని, రాహుల్‌ తక్షణమే క్షమాపణ చెప్పాలని బుధవారం డిమాండ్‌ చేశారు. భారత రాజకీయాల్లో రాహుల్‌ ఒక ‘రాహువు’అని ఆరోపించారు. ఆయన తన ఆలోచనా విధానంతో దేశ రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని విమర్శించారు. వరుసగా ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోతుండడంతో అది తట్టుకోలేక నిరాశ, అసంతృప్తికి గురై ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్నారని, మానసిక సమతుల్యత కోల్పోతున్నారని రాహుల్‌పై మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు దురదృష్టకరమని అన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement