తిరువనంతపురం: కేరళను భారీ వర్షాలు మరోసారి అతలాకుతలం చేసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కేరళలో గతంలో కురిసిన వర్షాలు ఎంతగా విధ్వంసం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. వర్షాకాలాల్లో కేరళలో కురిసిన వర్షాలను గుర్తు చేసుకుంటే.. 2018లో సంభవించిన విపత్తును అత్యంత భయంకరమైన విపత్తుగా గుర్తించారు. 2019, 2020లో వరుస మాన్సూన్లలో మళ్లీ భారీ వర్షాలు కురిశాయి. 2024 వయనాడ్ విపత్తును ఎవరూ మర్చిపోలేరు. ఇప్పుడు మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఇక నైరుతి రుతుపవనాలు ఈనెల 26న (4 రోజులు అటుఇటుగా) కేరళలోకి ప్రవేశించనున్నాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది.
ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్
కేరళలో వర్ష హెచ్చరికలను భారత వాతావరణ శాఖ తాజాగా సవరించింది. రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. పత్తనం తిట్ట, కొట్టాయం, ఇడుక్కి, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాల్లో మంగళవారం ఎల్లో అలర్ట్ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు.
అదే విధంగా బుధవారం కూడా నాలుగు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగనుంది. అలప్పుళ, ఎర్నాకుళం, త్రిస్సూర్, మలప్పురం జిల్లాల్లో బుధవారానికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో 115 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశమూ ఉందని తెలిపింది.
ఇక కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ తీరప్రాంతాల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. కన్నూర్, కాసర్గోడ్ జిల్లాల్లో భారీ అలలు ఏర్పడే అవకాశం ఉందని కూడా అధికారులు హెచ్చరించారు.
భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారత వాతావరణ శాఖ జారీ చేసే భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


