చెన్నై: తమిళనాడులో సీఎం జోసెఫ్ విజయ్ మంత్రివర్గంలో మిత్రపక్షం కాంగ్రెస్ కూడా చేరబోతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎస్.రాజేశ్ కుమార్, పి.విశ్వనాథన్‌కు మంత్రి పదవులు దక్కనున్నాయి. ఇందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంగీకారం తెలిపారు. వారిద్దరూ ఈ నెల 21న మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ బుధవారం వెల్లడించారు.
ఈ క్రమంలో తమ పార్టీకి ఇది చరిత్రాత్మక సందర్భమని అన్నారు. 59 ఏళ్ల తర్వాత తమిళనాడు కేబినెట్‌లోకి తమ పార్టీ అడుగుపెడుతోందని స్పష్టంచేశారు. మరోవైపు విడుదలై చిరుతైగళ్ కట్చి(వీసీకే), ఐయూఎంఎల్ ఎమ్మెల్యేలకు సైతం మంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం. అన్నా డీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సైతం మంత్రియోగం ఉందా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. గురువారం ఎంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారన్న దానిపై లోక్‌భవన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ 1967లో అధికారం కోల్పోయింది. ఆనాటి నుంచి ఇప్పటిదాకా ఆ పార్టీ పలు కూటముల్లో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చేరే అవకాశం రాలేదు.
మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రావడంపై వేణుగోపాల్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, "కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో రాజేశ్ కుమార్, పి. విశ్వనాథన్ గురువారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమిళనాడు ప్రజల ఆశయాలకు అనుగుణంగా వారు పనిచేస్తారని విశ్వసిస్తున్నాం. రాహుల్ గాంధీ ప్రతిపాదించిన ప్రజాహిత పరిపాలన లక్ష్యాలను వారు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నా" అని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్‌కు నిరాశే..
ఇక, తమిళనాడు రాజకీయాల్లో ఈ పరిణామానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే, 1967లో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కాలేదు. 1952 నుంచి 1967 వరకు అప్పటి మద్రాస్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగింది. సి. రాజగోపాలాచారి, కె. కామరాజ్, ఎం. భక్తవత్సలం ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అయితే, 1967లో డీఎంకే ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ద్రావిడ పార్టీల ఆధిపత్యం కొనసాగింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ డీఎంకే, ఏఐఏడీఎంకేతో పొత్తులు పెట్టుకున్నప్పటికీ ప్రభుత్వంలో మాత్రం భాగస్వామ్యం కాలేదు. ప్రత్యేకంగా 2006-11 మధ్య డీఎంకే ప్రభుత్వంలో కాంగ్రెస్ అధికార భాగస్వామ్యం కోరినా ఫలితం లేకపోయింది.


