రామ్ చరణ్ 'పెద్ది' సినిమా మరికొన్నిరోజుల్లో థియేటర్లలోకి రానుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. రెగ్యులర్ కమర్షియల్ అంశాలతో పాటే సమ్‌థింగ్ డిఫరెంట్‌గానూ అనిపించింది. 'గేమ్ ఛేంజర్' డిజాస్టర్ దెబ్బకు డీలా పడిపోయిన మెగా ఫ్యాన్స్.. ఇది ఎలాగైనా సరే హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. వీళ్లే కాదు టాలీవుడ్ కూడా అదే అనుకుంటోంది. మొత్తం భారమంతా ఈ మూవీపైనే ఉంది. ఎందుకంటే పరిస్థితి అలా ఉంది మరి!
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)
ఈ ఏడాది సంక్రాంతిని టాలీవుడ్ గ్రాండ్‌గా మొదలుపెట్టింది. చిరంజీవి సినిమాకు రూ.300 కోట్లు వచ్చాయని అందరూ సంబరపడ్డారు. కానీ ఈ ఆనందం ఎన్నిరోజులు నిలబడలేదు. తర్వాత నుంచి ఇప్పటివరకు నాలుగు నెలలు గడిచాయి. ఒక్కటంటే ఒక్క మూవీ కూడా సరైన స్థాయిలో ఆడలేదు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలలో వచ్చిన చిత్రాలు భారీగా నిరాశపరిచాయి. దీంతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు పెట్టుబడులన్నీ నష్టపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఈ ఏడాది వేసవి సీజన్.. టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత దారుణమైనదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

సరిగ్గా ఇలాంటి టైంలో అంటే జూన్ 4న 'పెద్ది' థియేటర్లలోకి వస్తోంది. దీంతో టాలీవుడ్ ఆశలన్నీ దీనిపైనే పెట్టుకుంది. ఇది హిట్ అవ్వడం చిత్రబృందానికే కాదు తెలుగు సినీ పరిశ్రమకు కూడా చాలా కీలకం. ఎందుకంటే థియేటర్లు గతకొన్నాళ్లుగా బోసిపోయాయి. ప్రేక్షకులు కూడా సరైన మూవీ ఎప్పుడొస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్లే ఈ మూవీ..బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్ట్రాంగ్ ఓపెనింగ్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అనుకుంటున్నాయి. పాజిటివ్ టాక్ వస్తే చాలు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశమైతే కనిపిస్తోంది. మరి 'పెద్ది' ఏం చేస్తాడనేది చూడాలి?
ట్రైలర్ బట్టి చూస్తే బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసే పెద్ది అనే ఓ పల్లెటూరి కుర్రాడు.. క్రికెట్, కుస్తీ, రన్నింగ్‌లో ఆటకూలీగా ఎలాంటి ప్రతిభ చూపించాడు. ఈ ప్రయాణంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడనేదే కాన్సెప్ట్‌లా అనిపిస్తుంది. మూవీ ఎలా ఉండబోతుందో చూపించారు గానీ స్టోరీ గురించి మాత్రం పెద్దగా హింట్ ఇవ్వలేదు. 'పెద్ది గాడు గుడిలో దేవుడు కాదు గ్రౌండ్‌లో దేవుడు సారు' లాంటి డైలాగ్స్ బాగానే అనిపించాయి. స్పోర్ట్స్ డ్రామాగా తీసిన ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకుడు. జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా శివరాజ్ కుమార్ కీలక పాత్ర చేశారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు.
ఇదీ చదవండి: 'బూతు'ని కంట్రోల్ చేసుకోలేకపోయిన రష్మిక


