సినిమా ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్‌కు ఎంట్రీ ఈజీగానే ఉంటుంది, కానీ తమని తాము నిరూపించుకోవడమే అసలైన టాస్క్. అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ కెరీర్ ప్రస్తుతం ఒక కీలకమైన మలుపులో ఉంది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో బిగ్ బ్రేక్ కోసం చూస్తున్న ఈ బ్యూటీకి, ఇక్కడి కమర్షియల్ ఫార్మాట్ ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అనే చర్చ జోరుగా సాగుతోంది.
'దేవర'లో గ్లామర్ షోకే పరిమితం
భారీ అంచనాల మధ్య వచ్చిన ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాతో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 'తంగం' అనే పల్లెటూరి పడచు పాత్రలో జాన్వీ లుక్స్, ముఖ్యంగా ‘చుట్టమల్లే’ పాటలో ఆమె పండించిన గ్లామర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే, ఒక నటిగా చూస్తే మాత్రం దేవరలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదనే చెప్పాలి. కేవలం గ్లామర్ షోకే, కమర్షియల్ ఎలిమెంట్స్‌కే ఆమెను పరిమితం చేసేశారనే విమర్శలు వచ్చాయి.
'పెద్ది’లోనూ అదే రిపీట్ అవుతుందా?
ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, నిన్న రిలీజైన ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే.. ఇందులోనూ ఆమె కేవలం అందాల ఆరబోతకే పరిమితం అయినట్లుగా అర్థమవుతుంది. కమర్షియల్ సినిమాలకు హీరోయిన్ గ్లామర్ ప్లస్ కావచ్చు. కానీ, ‘పెద్ది’ లాంటి రా అండ్ రస్టిక్, ఇంటెన్స్ కథలకు గ్లామర్ మాత్రమే నమ్ముకుంటే అది సినిమాకే మైనస్ అయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ ‘పెద్ది’ సినిమాలోనూ జాన్వీ పాత్రకు నటన పరంగా స్కోప్ లేకపోతే, ఆమె టాలీవుడ్ కెరీర్‌కు అది పెద్ద మైనస్ అవుతుంది. టాలీవుడ్‌లో లాంగ్ రన్ ఉండాలంటే కేవలం అందం మాత్రమే సరిపోదు, బలమైన పాత్రలు కూడా పడాలి.
దాచి పెట్టారా?
గ్లింప్స్, ట్రైలర్‌లో జాన్వీ గ్లామర్ షోకే పరిమితం చేశారు. ప్రతి సీన్ లో పైట గాల్లోకి ఎగరేస్తూ నడుము హైలైట్ అయ్యేలా పదే పదే ఫ్రేమ్ సెట్ చేశాడు దర్శకుడు. కానీ హీరో రామ్ చరణ్ మాత్రం జాన్వీ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నాడు. పెద్దిలో జాన్వీ నటన ఓ రేంజ్‌లో ఉంటుందని చెబుతున్నాడు. డాన్స్ కూడా అద్భుతంగా చేసిందని ప్రశంసించాడు. చరణ్ మాటల బట్టి చూస్తే.. ట్రైలర్‌లో జాన్వీని కావాలనే గ్లామర్ డాల్‌గా చూపించినట్లు తెలుస్తోంది. ఆమె నటనకు సంబంధించిన సీన్‌ని పెడితే.. రిలీజ్ ముందే కథపై ఊహగానాలు ఎక్కువైపోతాయని దర్శకుడు భావించాడట. అందుకే ట్రైలర్‌లో చరణ్‌ని మాత్రమే హైలెట్ చేస్తూ.. మిగతావాళ్ల సీన్లను దాచిపెట్టాడని టాలీవుడ్ టాక్. ఒకవేళ అదే నిజమై.. జాన్వీకి మంచి సీన్లు పడితే ఒకే. కేవలం పాటలకే పరిమితం అయితే మాత్రం.. ఆమె కెరీర్‌కి ఇబ్బంది తప్పదని సినీ పండితులు చెబుతున్నారు.


