యూఏఈలో ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులకు అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి శ్రమకు తగ్గ ఫలితం సమయానికి దక్కేలా 'మినిస్టీరియల్ రిజల్యూషన్ నంబర్ 0340 ఆఫ్ 2026' పేరుతో కొత్త చట్టాన్ని యూఏఈ మానవ వనరులు, స్వదేశీకరణ మంత్రిత్వ శాఖ తీసుకొచ్చింది.
ఈ కొత్త చట్టం ప్రకారం.. ప్రైవేట్ రంగ సంస్థలు తమ ఉద్యోగులకు ప్రతి నెలా మొదటి తేదీ నాడే జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఒకటో తేదీ లోపు జీతం అకౌంట్‌లో పడకపోతే, దానిని 'ఆలస్యమైన వేతనం' గా పరిగణిస్తారు. కంపెనీ సేఫ్ జోన్‌లో ఉండాలంటే 1వ తేదీ నాటికి ఉద్యోగి మొత్తం జీతంలో కనీసం 85% డబ్బులు అకౌంట్‌లో వేయాలి.
ఒకవేళ జీతం చెల్లించకపోతే రెండో రోజు నుంచి సదరు కంపెనీపై ప్రభుత్వం నిఘా పెట్టి, నోటీసులు జారీచేస్తోంది. ప్రభుత్వం ఐదు రోజుల వరకు చూస్తోంది. అప్పటికి ఉద్యోగుల ఖాతాలో జీతాలు జమ కాకపోతే సదరు కంపెనీలకు కొత్త వర్క్ పర్మిట్లను జారీ చేయడం అధికారులు నిలిపివేస్తారు.
16 రోజులు దాటితే కార్మికుల తరపున మంత్రిత్వ శాఖే స్వయంగా రంగంలోకి దిగి కేసు నమోదు చేస్తోంది. ఈ నిబంధనలు జూన్ 1, 2026 నుండి అమలుల్లోకి రానున్నాయి. ఈ కొత్త చట్టంతో యూఏఈలో పనిచేస్తున్నప్రవాస భారతీయులకు మేలు జరగనుంది.
అయితే 11 ప్రత్యేక కేసులకు మాత్రం ఈ గడువు చట్టం నుండి మినహాయింపు ఇచ్చారు:
కోర్టులో వేతన వివాదాల క్లెయిమ్ నడుస్తున్న కార్మికులు.
కంపెనీ నుండి పారిపోయినట్లు రిపోర్ట్ నమోదైన వారు.
జైలు లేదా కస్టడీలో ఉండి విధులకు హాజరుకాలేని వారు.
అధికారికంగా జీతం లేని సెలవులో ఉన్న కాలంలో.
ఓడలపై పనిచేసే నావికులు (సీఫేరర్స్).
విదేశీ కంపెనీల బ్రాంచ్‌లలో పనిచేస్తూ, యూఏఈ వెలుపల జీతాలు పొందే విదేశీయులు.
3 నెలల లోపు కాలపరిమితి గల 'మిషన్ వర్క్ పర్మిట్'లపై ఉన్నవారు.
స్థానిక యూఏఈ పౌరుల యాజమాన్యంలోని చేపల వేట పడవలు.
స్థానిక పౌరుల స్వంత యాజమాన్యంలోని పబ్లిక్ టాక్సీలు.
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు.
మతపరమైన ప్రార్థనా స్థలాలు.


