‘తెలుగువారి చరిత్ర - సంస్కరణోద్యమాలు’పై వకుళాభరణం ప్రసంగం
ఆలోచన రేపిన కె.కె.ఆర్. సంస్మరణ ప్రసంగాల పుస్తకావిష్కణ
అద్భుతంగా పాఠం చెప్పే అధ్యాపకులు చాలామంది ఉంటారు. అజ్ఞానం దూరం చేసి, అపరిమిత జ్ఞానాన్ని అందించే ఆచార్యులూ అనేకులుంటారు. కానీ, చదువుతో పాటు సామాజిక చలనశీల సూత్రాల ఆధారంగా చరిత్రను ఎలా అర్థం చేసుకోవాలో దోవ చూపి, ఆమరణాంతం వీడని ఆలోచనా మార్గం పట్టించే ఆచార్య వరేణ్యులు కొందరే ఉంటారు. శిష్యులను సైతం సహచరులుగా, మిత్రులుగా సంభావించి, వారిని తీర్చిదిద్దే అలాంటి ఆచార్యుల ఆలోచన, ఆచరణ, సాహిత్య - సామాజిక మూర్తిమత్వం ఆ శిష్యులపై చెరగని ముద్ర వేస్తుంది. హైదరాబాద్‌లో హైస్కూల్ టీచర్‌గా మొదలై, ఆగని అధ్యయనం, అధ్యాపనంతో ‘ఆంధ్ర సారస్వత పరిషత్’ ప్రధానాచార్యులుగా, ‘హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ’ తెలుగు శాఖాధ్యక్షులుగా, హ్యుమానిటీస్ విభాగానికి డీన్‌గా ఎదిగి, ఎందరో విద్యార్థులను ప్రభావితం చేసిన అరుదైన వ్యక్తి – సారస్వతమూర్తి... ఆచార్య కె.కె. రంగనాథాచార్యులు (1941 – 2021).
సాహితీ లోకంలో కె.కె.ఆర్.గా సుప్రసిద్ధులైన ఆయన భౌతికంగా కనుమరుగై అయిదేళ్ళు నిండినా, ఇప్పటికీ సహచరులు, శిష్య మిత్రులెవరూ మరిచిపోలేని విశిష్ట వ్యక్తిత్వం ఆయనది. మండు వేసవిలో సైతం ప్రతి మే నెలలో వారు ఆయనను ప్రత్యేకంగా స్మరించుకొనే తీరు అందుకు ఓ నిదర్శనం. చారిత్రక సాహితీ విమర్శకుడిగా కె.కె.ఆర్. విశిష్ట స్థానాన్ని మరోసారి గుర్తు చేస్తూ, ఈ ఏడాది కూడా ఆయన వర్ధంతిని ఆలోచనా స్ఫోరక సాహితీ సమావేశంతో సన్నిహితులు, కుటుంబ సభ్యులు జరిపారు.
ఇరవై ఒక్కేళ్ళ పాటు కె.కె.ఆర్. ప్రధానాచార్యత్వానికీ, సాహిత్య సంగోష్ఠికీ నెలవైన హైదరాబాద్‌లోని ‘తెలంగాణ (అప్పటి ఆంధ్ర) సారస్వత పరిషత్’ కళాశాల ప్రాంగణమే ఈసారి కూడా అందుకు వేదికగా నిలిచింది. కె.కె.ఆర్. వార్షిక సంస్మరణ ప్రసంగ కార్యక్రమం మే 15 సాయంత్రం ఆహూతుల మధ్య ఆత్మీయంగా సాగింది. సుప్రసిద్ధ చరిత్ర ఆచార్యులు డాక్టర్ వకుళాభరణం రామకృష్ణ ‘తెలుగువారి చరిత్ర – సంస్కరణోద్యమాలు’ అన్న అంశంపై ఈ ఏటి సంస్మరణ ప్రసంగం చేశారు. గత మూడేళ్ళుగా ఏటా జరుగుతున్న కె.కె.ఆర్. సంస్మరణ ప్రసంగాల పరంపరలో ఇది మూడో ప్రసంగం.
“అరుదైన విమర్శకుడు కె.కె.ఆర్”: ఆచార్య చంద్రశేఖరరెడ్డి
ప్రధాన ప్రసంగానికి ముందు ‘ఎమెస్కో బుక్స్’ ప్రధాన సంపాదకులు – సాక్షాత్తూ కె.కె.ఆర్. వద్దే చదువుకొని, సారస్వత పరిషత్‌లో సహోద్యోగిగా ఎదిగి, సన్నిహితంగా మెలిగిన ఆచార్య డాక్టర్ దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ, కె.కె.ఆర్. ప్రత్యేకతను వివరించారు. “తెలుగు సాహిత్య విమర్శలో చారిత్రక దృక్కోణానికి పెద్ద పీట వేసి ఒరవడి దిద్దిన అరుదైన విమర్శకుడు కె.కె.ఆర్. ఆయనకు చరిత్రపై అమితమైన ఆసక్తి. భారతదేశ చరిత్రను నిశితంగా అధ్యయనం చేశారు. చరిత్ర పరిణామాలను గమనించి ఊరుకోకుండా, చరిత్రలోని పరిణామాలకూ సాహిత్యంలోని పరిణామాలకూ మధ్య సంబంధాన్ని విశ్లేషించేవారు. ఎలాంటి చారిత్రక పరిస్థితుల్లో, ఎలాంటి సాహిత్యం వచ్చిందో లోతైన అధ్యయనం చేసి చెప్పేవారు. చరిత్ర నిర్దేశించే సాహిత్య స్వరూపాన్ని విశదీకరించేవారు. అందుకే, ఆయనను అరుదైన ‘చారిత్రక విమర్శకుడి’గా గణిస్తున్నాం. అగ్రశేణి తెలుగు సాహితీ విమర్శకులను పదిమందిని తీసుకున్నా... మొదటి అయిదుగురు ప్రాచీన సాహితీ విమర్శకులనుకుంటే, మిగిలిన అయిదుగురు ఆధునిక విమర్శకులలో ‘కనిష్ఠికాధిష్ఠితుడైన కాళిదాసు’ లాగా మున్ముందు చెప్పుకోవాల్సిన పేరు కె.కె.ఆర్.దే” అని డి. చంద్రశేఖరరెడ్డి అభిప్రాయపడ్డారు.
అలాగే, కె.కె.ఆర్. వ్యక్తిత్వంలోని గొప్పదనాన్ని ఇంకా వివరిస్తూ, “సమాజంలోని సమకాలీన సంఘటనలపై ఆయన స్పందించేవారు. సర్వసాధారణంగా ఆయన ఎంత సంయమనం పాటిస్తారో, ప్రపంచంలో దుర్మార్గాన్ని చూస్తున్నప్పుడు అంత అసహనం వ్యక్తం చేసేవారు. వాటి గురించి రాయకున్నా, ఉపన్యసించకున్నా... మిత్రులతో తన బాధ, ఆవేదన, ఆవేశం పంచుకొనేవారు. చుట్టూ ఉన్న ప్రపంచంలోని మంచిని ఎంతగా అభిమానిస్తామో... చెడును అంత తీవ్రంగా ఖండించడమన్నది శిష్యులందరూ ఆయనను చూసి నేర్చుకున్నదే. అందుకే, ఒక్కమాటలో కె.కె.ఆర్. సంఘ సంస్కరణవాది కూడా” అని చంద్రశేఖరరెడ్డి విశ్లేషించారు. అందుకు తగ్గట్టే ‘తెలుగు వారి చరిత్ర – సంఘ సంస్కరణోద్యమాలు’ అంశంపై ప్రధాన ప్రసంగకర్త వకుళాభరణం రామకృష్ణ సైతం భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ కుమారుడైన ప్రముఖ హిస్టరీ ప్రొఫెసర్ సర్వేపల్లి గోపాల్ వద్ద పరిశోధన సాగించిన ఉద్దండులంటూ ఆయన కృషిని స్థూలంగా పరిచయం చేశారు.
“ఆ సమగ్ర స్వరూపమే తెలుగువారి చరిత్ర”: వకుళాభరణం
వకుళాభరణం రామకృష్ణ ప్రధాన ప్రసంగం చేస్తూ, ఢిల్లీలోని జె.ఎన్.యు.లో సాగిన తన చరిత్ర పరిశోధన తొలి రోజులను గుర్తు చేసుకున్నారు. ప్రసిద్ధ చరిత్రకారులు, పరిశోధకులైన రొమిల్లా థాపర్, సర్వేపల్లి గోపాల్ తదితరులతో జరిగిన సంగతులు పంచుకున్నారు. “తెలుగునాట ఆధునిక సంఘ సంస్కరణలకు దీపధారి లాంటి కందుకూరి వీరేశలింగం మీద రిసెర్చ్ చేయాలని భావిస్తున్నట్టు చెప్పినప్పుడు మా గైడ్ సర్వేపల్లి గోపాల్ అన్న ఓ మాట నాకు ఇప్పటికీ గుర్తు. ‘పరిశోధనంటే - వీరేశలింగం వితంతు వివాహాలు జరిపాడు, బాలికా విద్యను ప్రోత్సహించాడు లాంటివి కాదు రాయాల్సింది. ‘హౌ బి శానిటైజ్డ్ ది సొసైటీ’ (తెలుగు సమాజాన్ని ఆయన ఎలా శుభ్రపరిచాడు) అన్నది చెప్పాలి, రాయాలి’ అన్నారాయన. అది నా మనసులో నాటుకొని, పరిశోధనకు మార్గదర్శకమైంది. కష్టపడి ఆయన దగ్గరే ఎం.ఫిల్, ఆ తర్వాత పీహెచ్డీ చేశాను” అని తెలిపారు.
“ఒకసారి ‘యునెస్కో’ ఆహ్వానంపై సర్వేపల్లి గోపాల్ గారు ప్యారిస్‌కు వెళ్ళినప్పుడు, ఆయన స్థానంలో నన్ను పెడితే, నేను పాఠాలు చెప్పడం ఓ అపూర్వ గౌరవం. ‘ఆఖరి టాపిక్ మిగిలిస్తే, విదేశాల నుంచి తిరిగొచ్చిన తర్వాత నేనే ఆ పాఠం చెబుతాన’ని వెళ్ళే ముందు గోపాల్ అన్నారు. తీరా, పర్యటన నుంచి తిరిగొచ్చాక విద్యార్థులకు ఆ పాఠం కూడా నన్నే చెప్పమనేశారు. నేను ఆ పాఠం చెబుతుంటే, ఆయన కూడా ఆ క్లాసులో కూర్చొని విన్న క్షణాలు మర్చిపోలేను” అని వకుళాభరణం పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళారు.

ఈ మే 15 నాడే 88 వసంతాలు పూర్తి చేసుకొని, 89వ ఏట అడుగిడిన వకుళాభరణం దాదాపు నలభై నిమిషాల తన ప్రసంగంలో, ఆధునిక తెలుగు రాజకీయ చరిత్రలో జరిగిన ప్రధానమైన మార్పులను ఓపికగా ప్రస్తావించారు. బ్రిటీషు వారి కాలంలో మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి వేరుగా తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ మొదలైన ఉద్యమం, 1913 నాటి బాపట్ల ‘ప్రథమాంధ్ర మహాసభ’ నుంచి ఆంధ్ర రాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఏర్పాటు, చివరకు 2013 నాటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన వరకు జరిగిన పరిణామాల క్రమాన్ని ఆయన స్థూలంగా వివరించారు.
కందుకూరి వీరేశలింగం పంతులు గారి ప్రవేశం తర్వాత నడచిన సంస్కరణోద్యమాల తీరుతెన్నుల గురించి ‘సోషల్ రిఫార్మ్స్ మూవ్‌మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ అనే తన సిద్ధాంత గ్రంథంలో విపులంగా చర్చించిన వకుళాభరణం రామకృష్ణ, “గురజాడ, గిడుగు, కందుకూరి... ఈ ముగ్గురూ తెలుగు నేలకు వేగుచుక్కల త్రయం. వారిలో మొదటి ఇద్దరు సాహితీస్రష్టలూ విజయనగరం వారే కావడం విశేషం. అలాగే, తెలంగాణ ప్రాంతం నుంచి సాహిత్య, సామాజిక, రాజకీయ చైతన్యం తెచ్చినవారిలో కొమర్రాజు లక్ష్మణరావు, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు... ఈ ముగ్గురి పేర్లూ చెప్పుకొని తీరాలి” అని అభిప్రాయపడ్డారు. నక్సలైట్ల ఉద్యమం, సారా వ్యతిరేక ఉద్యమం లాంటి వాటిని ఆయన తన ప్రసంగంలో చూచాయగా ప్రస్తావించారు. రాజకీయంగా, సామాజికంగా, కళాత్మకంగా, సాంస్కృతికంగా తెలుగు నేలపై వచ్చిన మార్పుల్ని లోతుగా చూసినప్పుడే ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర – దాని పరిణామాలు – పర్యవసాలను సమగ్రంగా అర్థం చేసుకోగలుగుతామని అన్నారు. హైదరాబాద్ వచ్చిన తొలిరోజుల్లో సారస్వత పరిషత్ గ్రంథాలయాన్ని తరచూ సందర్శించిన రోజులను గుర్తుచేసుకున్న వకుళాభరణం, చారిత్రక విమర్శ దృక్పథంతో కె.కె.ఆర్. చేసిన సాహిత్య కృషిని ప్రశంసించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తుండగా, కె.కె.ఆర్.తో సాగిన స్నేహాన్ని స్మరించుకున్నారు.
అయిదేళ్ళుగా... ప్రతి ఏటా... అదే వేదికపై!
నిజామాబాద్ జిల్లాలోని ‘తెలంగాణ విశ్వవిద్యాలయం’లో తెలుగు శాఖలో ఆచార్యత్వం వహిస్తున్న డాక్టర్ సిహెచ్. లక్ష్మణ చక్రవర్తి ఈ మొత్తం సభా కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించారు. “ఉత్తమ ఆచార్యుడిగా, లోతైన సాహితీ విమర్శకుడిగా పేరున్న కె.కె.ఆర్. మరణానంతరం ఆయన శిష్య మిత్ర బృందం ఆచార్య చంద్రశేఖరరెడ్డి సారథ్యంలో ఏటా ఒక ప్రత్యేక సాహితీ కార్యక్రమం చేస్తోంది. తొలి ఏడాది ‘కె.కె.ఆర్. సంస్మరణ’ పేరిట ఆయన సంస్మరణ సంచిక తీసుకువచ్చారు. రెండో ఏడాది ఆయన బహుముఖీన వ్యక్తిత్వంపై ‘కె.కె.ఆర్. సాహిత్య వ్యక్తిత్వం’ పేరిట పలువురు సన్నిహితులు రాసిన వ్యాసాల సంకలనం వెలువరించారు. ఆ తర్వాత నుంచి మూడేళ్ళుగా ఏటా ఒక సుప్రసిద్ధుడితో సంస్మరణ ప్రసంగాలు చేయిస్తున్నారు. తత్త్వశాస్త్ర ఆచార్యులు డాక్టర్ అడ్లూరి రఘురామరాజు, సాహితీ విమర్శకుడు డాక్టర్ బి. తిరుపతిరావుల అనంతరం ఈసారి మూడో సంస్మరణ ప్రసంగం – చరిత్ర పరిశోధకులు ఆచార్య వకుళాభరణం రామకృష్ణ గారిది” అంటూ లక్ష్మణ చక్రవర్తి అయిదేళ్ళ ప్రస్థానాన్ని అద్దంలో చూపారు. అలాగే, తాజా సభలో విడుదలైన కె.కె.ఆర్. సంస్మరణ ప్రసంగ పుస్తకాలు రెంటికీ లక్ష్మణ చక్రవర్తే సంపాదకత్వ బాధ్యతలు వహించడం విశేషం.
పిల్లలకు ప్రేమ పంచి... ఆచరణలో గౌరవం చూపి...
ప్రధాన ప్రసంగానికి ముందు సభలో కె.కె.ఆర్. శిష్యమిత్రులు పలువురు మాట్లాడుతూ, మాస్టారితో తమ అనుబంధాన్నీ, వారి జ్ఞాపకాలనూ పంచుకున్నారు. కె.కె.ఆర్. వద్ద చదువుకున్న 73 ఏళ్ళ అధ్యాపకుడు డాక్టర్ డి. నరసయ్య అప్పటి సంగతులు గుర్తు చేసుకుంటూ, “విద్యార్థులను సైతం గౌరవించడాన్ని ఆచరణలో చూపిన అరుదైన టీచర్ ఆయన. ఆ విశిష్ట గుణం ఆయన దగ్గరే చూశాను. విద్యార్థులతో ‘అంత్యాక్షరి పద్యపఠనం’తో పాటు ‘స్లో సైక్లింగ్’ లాంటి ఆటల పోటీలు నిర్వహిస్తూ, పిల్లలతో అంతగా మమేకమైన టీచర్‌గా కె.కె.ఆర్. సార్‌ను మర్చిపోలేము” అన్నారు.
జర్నలిస్ట్ రవీంద్రబాబు మాట్లాడుతూ, “ఎం.ఏ, ఎంఫిల్ కె.కె.ఆర్ గారి దగ్గరే చేశా. ఆధునిక కవిత్వం, స్ట్రక్చర్ ఆఫ్ మోడరన్ తెలుగు, సంస్కృతంలోని కాళిదాసు ‘మేఘసందేశం’... ఇలా ఏ సబ్జెక్ట్‌నైనా ఆయన బోధించేవారు. తాను చెప్పిన అంశం మీద కాకుండా, అప్పట్లో కొత్తగా వచ్చిన త్రిపురనేని శ్రీనివాస్ ‘హో’ కవితా సంపుటి మీద నేను పరిశోధన చేస్తానంటే ఆయన అభ్యంతర పెట్టలేదు. ముందుగా తానే ఆ పుస్తకం తెప్పించుకొని, చదివి, పరిశోధక విద్యార్థినైన నాకు సరైన మార్గనిర్దేశనం చేసిన అరుదైన గైడ్ ఆయన” అని వివరించారు.
అరుదైన అధ్యయనశీలి ఆఖరి కోరిక!
‘తెలుగు అకాడెమీ’కి డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన రచయిత, భాషావేత్త డాక్టర్ అప్పం పాండయ్య మాట్లాడుతూ, “విద్యార్థులు, పరిశోధకులపై కె.కె.ఆర్. ఆప్యాయత అపారం. ఏదైనా తనకు తప్పు అనిపిస్తే మాత్రం... మిత్రధర్మం, శిష్యధర్మం ఎంత ఉన్నా సరే వెరవకుండా, వాటిని పక్కనబెట్టి మరీ నిక్కచ్చిగా ఆయన తన అభిప్రాయం చెప్పేవారు. కె.కె.ఆర్. తన విద్యాభ్యాసం, ఉద్యోగ జీవిత కాలంలోని సామాజిక వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ, సమాజంలోని చైతన్యశీలత, మార్పులను చెబుతూ జీవిత కథనం రాయాలని భావించారు. తీరని ఆయన కోరికను ఇప్పటికైనా మిత్రులెవరైనా పూనుకొని తీరిస్తే బాగుంటుంది” అని సూచన చేశారు. సారస్వత పరిషత్‌లో చదువుకొని సినీ, టీవీ నటుడిగా దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఉన్న మానిక్ అప్పటి తన అనుభవాలు పంచుకున్నారు.
కుటుంబంతో కాదు... సాహితీ కుటుంబంతో!
ఈ కార్యక్రమానికి కె.కె.ఆర్. సతీమణి ఊర్మిళ, కుమారుడు సుమన్, మనుమడు స్వభావ్‌తో సహా కె.కె.ఆర్. కుటుంబ సభ్యులు, బంధువులు హాజరయ్యారు. “కేవలం కుటుంబ సభ్యులమే కాకుండా, సాహితీ బంధువులందరితో కలసి ఏటా కె.కె.ఆర్.ను స్మరించుకోవడం కోసం అయిదేళ్ళుగా ఇలా సాహితీ ప్రసంగాల సభ జరుపుతున్నాం. గతంలో కె.కె.ఆర్. ఇలాంటి ప్రసంగాల ‘సారస్వత వేదిక’ను దాదాపు పదేళ్ళ పాటు నిర్వహించారు. దాని ఫలితంగానే, సాహిత్య చరిత్ర వ్యాసాలుగా చిరస్థాయిగా నిలిచిపోయిన ‘తెలుగు సాహిత్యం - మరోచూపు’, ‘ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు’ లాంటి లాంటి పుస్తకాల రూపంలో ఆ ప్రసంగాలు మిగిలాయి. ఆ ఫక్కీలోనే ఇప్పుడీ వార్షిక ప్రసంగాలు చేయిస్తున్నాం. రానున్న రోజుల్లో యువతరంతోనూ, ఆధునిక వక్తలతోనూ ఇలాంటి ఆలోచనాత్మక సంస్మరణ ప్రసంగాలు ఇప్పించాలని భావిస్తున్నాం” అని ఊర్మిళ సభాముఖంగా ప్రకటించారు. అతిథులకు తమ కుటుంబ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సంస్మరణ ప్రసంగ సభలో కె.కె.ఆర్.తో అనుబంధం ఉన్న ప్రముఖ కవి నిఖిలేశ్వర్, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు – సాహితీవేత్త మోత్కూరి నరహరి, సాహితీ విమర్శకుడు కె.పి. అశోక్ కుమార్, వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత హోదాల్లో పనిచేసిన ఆచార్య అయినవోలు ఉషాదేవి, ఆచార్య గారపాటి ఉమా మహేశ్వరరావు, ‘తెలుగు అకాడెమీ’ మాజీ సంచాలకులు ఆచార్య కె. యాదగిరి, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు ప్రొఫెసర్ పిల్లలమర్రి రాములు, చరిత్ర ప్రొఫెసర్ వకుళాభరణం రాజగోపాల్, ‘ఆకాశవాణి’ వార్తావిభాగం మాజీ ఉద్యోగి సమ్మెట నాగమల్లేశ్వరరావు మొదలైన ప్రముఖులు పలువురు పాల్గొనడం విశేషం.
దాదాపు రెండు గంటల సేపు జరిగిన ఈ కార్యక్రమానికి ముందు, తరువాత కూడా వచ్చినవారందరూ ఆత్మీయంగా పరస్పరం పలకరించుకుంటూ, పాత జ్ఞాపకాలను నెమరువెసుకోవడం, సారస్వత పరిషత్ ప్రాంగణంతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకోవడం అరుదైపోతున్న సాహితీ కుటుంబ వాతావరణాన్ని ప్రతిఫలించాయి. వచ్చే ఏడాది కలయికకు మరో ఆత్మీయ భూమికను సిద్ధం చేశాయి. సారస్వత్ పరిషత్ ప్రాంగణంలో దాదాపు పదేళ్ళ పాటు ‘సారస్వత వేదిక’ పేరిట విశిష్ట అతిథుల సాహితీ ప్రసంగాలు నిర్వహించినప్పుడు ఆచార్య కె.కె.ఆర్. ఆచరించింది, అభిలషించిందీ కూడా ఇదేనేమో!
- రెంటాల జయదేవ


