తీరికూర్చుని త్రిభాషా సూత్రం | Sakshi Editorial On Three Language Formula | Sakshi
Sakshi News home page

తీరికూర్చుని త్రిభాషా సూత్రం

May 20 2026 1:02 AM | Updated on May 20 2026 1:02 AM

Sakshi Editorial On Three Language Formula

దేశంలో హిందీ భాషకు ఆధిపత్య స్థానం కల్పించాలనుకుంటున్న ప్రతిసారీ దక్షిణాదిలో... ముఖ్యంగా తమిళనాడులో వివాదం తలెత్తుతుండగా కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్‌ఈ) కొత్త ఎత్తుగడతో ఆ భాషను ప్రతిష్ఠించదల్చుకున్నట్టు కనబడుతోంది. అందువల్లే శుక్రవారంనాటి ఆ సంస్థ మార్గదర్శకాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. జాతీయ విద్యావిధానం–2020కి అనుగుణంగా జారీ చేసినట్టు చెబుతున్న ఈ మార్గదర్శకాల ప్రకారం ఇకపై విద్యార్థులు మూడు భాషలు నేర్చుకోవడం తప్పనిసరి. అందులో ఒకటి విదేశీ భాష. మిగిలిన రెండూ ‘స్థానిక భాషలు’. త్రిభాషా సూత్రంగా పిలిచే ఈ విధానం వాస్తవానికి కొఠారీ కమిషన్‌ సిఫార్సులకు అనుగుణంగా రూపొందిన జాతీయ విద్యావిధానం–1968 నాటిదే. కేంద్రంలో ఏ పార్టీ లేదా కూటమి అధికారంలో ఉన్నా ఏదోవంకన హిందీని తీసుకొచ్చే ప్రయత్నం చేయటం రివాజైంది. ఉభయ తెలుగు రాష్ట్రాలతోసహా చాలా రాష్ట్రాలు త్రిభాషా సూత్రాన్ని అనుసరిస్తున్నా, తమిళనాడు మాత్రం తమిళంతోపాటు ఇంగ్లిష్‌ బోధన ఉండే ద్విభాషా సూత్రానికే కట్టుబడి ఉంది. విద్యార్థి దశలో వివిధ భాషలపట్ల ఆసక్తి, అనురక్తి పెంచి ప్రోత్సహించటంలో తప్పేం లేదు. కానీ ఆ వంకన ఒక భాష ఆధిపత్యాన్ని నెలకొల్పుదామనుకోవటమే సమస్య. ఇప్పటికైతే తల్లిదండ్రులు విద్యాసంవత్సరం మొదలై రెండునెలలు గడిచాక హఠాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. పునరాలోచన చేయకుంటే ఇది భాషా వివాదంగా మారినా మారొచ్చు. 

వచ్చే జూలైనుంచి అమల్లోకి రాబోతున్న ఈ విధానం సమస్యాత్మకమైనది. అన్నిటా ఇప్పటికే భాగంగా మారిన ఇంగ్లిష్‌ను ఇది ‘విదేశీ భాష’ గా గుర్తిస్తోంది. మన ప్రభుత్వాల ఉత్తరప్రత్యుత్తరాలు, జీవోలు, చట్టాలు... అన్నీ ఇంగ్లిష్‌లో ఉంటాయి. న్యాయస్థానాల్లో వాదప్రతివాదాలు మొదలుకొని తీర్పులవరకూ దాని వాడకం విస్తృతం. ఇక ఐఐటీ, ఐఐఎంలాంటి ఉన్నతశ్రేణి సంస్థల్లో చెప్పనవసరం లేదు. ఉన్నత చదువులకైనా, ఉద్యోగావకాశాలకైనా అదొక తప్పనిసరి అవసరం. ఈ దశలో ఇంగ్లిష్‌ను ‘విదేశీభాష’గా గుర్తించటం వల్ల మన విద్యార్థులు జర్మన్, ఫ్రెంచ్, జాపనీస్, కొరియన్‌ వంటి భాషలు నేర్చు కొనే అవకాశాన్ని కోల్పోతారు. ప్రపంచవ్యాప్తంగావున్న తీవ్ర పోటీ పర్యవసానంగా ఉద్యో గార్థులు వారి వారి రంగాల్లో నైపుణ్యం సాధిస్తే సరిపోదు. ఇంటర్వ్యూల్లో దాన్ని సమర్థ వంతంగా వ్యక్తం చేయగలగాలి. ఏ ఉత్పత్తికైనా ప్రపంచవ్యాప్త మార్కెట్‌ ఏర్పడిన వర్తమానంలో ఇంగ్లిష్‌తోపాటు మరో విదేశీ భాష వస్తేనే ప్రాముఖ్యత. కానీ సీబీఎస్‌ఈ తీరుతో ఇంగ్లిష్‌ విడనాడితేనే మరో విదేశీ భాష సాధ్యం.

ఉత్తరాదిన త్రిభాషా సూత్రం ఎంచక్కా అమలవుతోంది. వారు హిందీతోపాటు సంస్కృతాన్ని ‘స్థానిక భాష’గా నేర్చుకుంటారు. ‘విదేశీ భాష’గా ఇంగ్లిష్‌ ఉండనే ఉంది! దక్షిణాదిన మాత్రం స్థానిక భాషతోపాటు ఎంచుకోవటానికి హిందీ లేదా సంస్కృతం ఉంటాయి. సినిమాల ప్రభావంవల్ల సహజంగా అత్యధికులు హిందీని ఎంచుకుంటారు. దక్షిణాది రాష్ట్రాలు హిందీకి దాదాపు అలవాటుపడినట్టే... అటువైపువారు సైతం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, ఒరియావంటి భాషల్లో ఏదో ఒకటి నేర్చుకోవటం తప్పనిసరి చేస్తే వివక్ష కనబడేది కాదు. పైగా ఇటువైపువారికి ఉత్తరాదిన ఉద్యోగావ కాశాలు లభించేవి. కానీ ఆ పని చేయరు.

తొమ్మిదో తరగతికి వర్తింపజేస్తూ తీసుకొచ్చిన ఈ నిర్ణయం తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది. 6 నుంచి 8వ తరగతి వరకూ వేరే విధంగా చదివినవారు ఇప్పుడు హఠాత్తుగా సంస్కృతమో, హిందీయో నేర్చుకుతీరాలి. అసలు పాఠ్యపుస్తకాలే లేని ప్రస్తుత స్థితిలో, కీలక మలుపు అనదగిన పదో తరగతినాటికి పిల్లలంతా ఆ భాషల్లో ప్రావీణ్యత సాధించటం సాధ్యమేనా? ఇప్పటికే ఒక యూనిట్‌ టెస్ట్‌ కూడా పూర్తయింది. ‘ప్రస్తుతానికి’ తొమ్మిదో తరగతివారికి ఆరో తరగతి పాఠ్యపుస్తకం వినియోగించాలనీ, టీచర్లుండరు గనుక రిటైరైనవారి సేవలను వినియోగించుకోవాలనీ సీబీఎస్‌ఈ చెబుతోంది. ‘ఎలా రాసినా...’ ఆ మార్కుల్ని పట్టించుకోబోమన్న సన్నాయి నొక్కులు అదనం. కానీ అన్నిటా 90 శాతంపైగా సాధించిన విద్యార్థి మార్కుల జాబితాలో ఇదొక దిష్టిచుక్కగా మిగలదా? సీబీఎస్‌ఈ ఇంతకూ ఏం సాధించదల్చుకుంది? ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.  

Advertisement
 
Advertisement
Advertisement