టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వార్షిక వేతన పెంపుదల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి, ఆందోళనకు దారితీసింది. సగటున 5 శాతం మేర జీతాలు పెంచినట్లు కంపెనీ ప్రకటించినప్పటికీ అంతర్గత నిబంధనల్లో మార్పులు, పనితీరు కోటాలు విధించడం వల్ల చేతికి వచ్చే జీతం తగ్గిపోయిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు, లే-ఆఫ్స్ భయాలు ఐటీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.
దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ ప్రదర్శించిన సాలరీ హైక్ ఉద్యోగులకు ఆనందాన్ని ఇవ్వకపోగా కొత్త ఆందోళనలను తెచ్చిపెట్టింది. అప్రైజల్ సైకిల్ ముగిసిన తర్వాత కంపెనీ వార్షిక వేతన పెంపును అమలు చేసింది. అయితే, ఈ పెంపుదలపై క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ సంక్షోభానికి దారితీసిన అంశాలు కింది విధంగా ఉన్నాయి.
వేతన పెంపు ఉన్నా చేతికొచ్చే జీతం తగ్గింది!
టీసీఎస్ ఈ ఏడాది సగటున 5 శాతం వేతన పెంపును ప్రకటించింది. ప్రతిభ కనబరిచిన ‘A+’ పెర్ఫార్మెన్స్ బ్యాండ్ ఉద్యోగులకు అత్యధికంగా 9 శాతం నుంచి 13 శాతం వరకు ఇంక్రిమెంట్లు లభించాయి. అయినప్పటికీ, మెజారిటీ ఉద్యోగులు తమ చేతికి వచ్చే నికర ఆదాయం తగ్గిందని వాపోతున్నారు.
స్ట్రక్చరల్ మార్పుల్లో భాగంగా కంపెనీ అంతర్గత వేతన నిర్మాణంలో మార్పులు చేశారు.
పనితీరు ఆధారంగా ఇచ్చే వేరియబుల్ పే తగ్గింది.
ఉద్యోగికి కంపెనీ ఆఫర్ చేసే కాస్ట్ టు కంపెనీ(సీటీసీ) నుంచి గ్రాట్యుటీ మొత్తాన్ని తొలగించి చూపుతున్నారు. అంటే.. సులభంగా అర్థం చేసుకోవడానికి దీన్ని రెండు రకాలుగా చూడాలి. ఒకటి.. కాగితం మీద కనిపించే మార్పు, రెండు.. భవిష్యత్తులో వచ్చే నష్టం.
ఉదాహరణకు: ఒక ఉద్యోగి సీటీసీ రూ.10 లక్షలు అనుకుందాం. అందులో గ్రాట్యుటీ విలువ రూ.40,000 ఉందనుకోండి.
పాత పద్ధతి: స్క్రీన్ పైన లేదా ఆఫర్ లెటర్లో మీ సీటీసీ రూ.10,00,000 గానే కనిపిస్తుంది.
కొత్త పద్ధతి: ఇప్పుడు గ్రాట్యుటీ మొత్తాన్ని (రూ.40,000) ఆ డిస్ప్లే నుంచి తీసివేస్తే ఇప్పుడు మీ సీటీసీ రూ.9,60,000గా కనిపిస్తుంది.
‘బ్యాండ్ -డీ’ కోటా భయాలు
ఈ అప్రైజల్ సీజన్లో మేనేజర్లకు అందిన అంతర్గత ఆదేశాలు ఉద్యోగులను మరింత ఉలిక్కిపడేలా చేశాయి. ప్రతి టీమ్‌లో కనీసం 5 శాతం మంది సిబ్బందిని అత్యంత తక్కువ పనితీరు కేటగిరీ అయిన ‘బ్యాండ్ డీ’ లో ఉంచాలని యాజమాన్యం స్పష్టమైన కోటాను విధించినట్లు సమాచారం. సాధారణంగా ఈ బ్యాండ్‌లోని ఉద్యోగులకు కంపెనీ వేటు వేసే అవకాశం ఉంటుంది. ఈ 5% నిబంధన కారణంగా భవిష్యత్తులో తమ ఉద్యోగాలు ఊడిపోతాయేమోననే అభద్రత ఉద్యోగుల్లో తీవ్రస్థాయికి చేరింది.
ఐటీ రంగంపై ఆర్థిక ఒత్తిడి
ఈ వివాదం కేవలం టీసీఎస్‌కు మాత్రమే పరిమితమైనది కాదు; మొత్తం భారతీయ ఐటీ రంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులకు ఇది అద్దం పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమనం వల్ల అంతర్జాతీయ క్లయింట్లు తమ ఐటీ బడ్జెట్లను తగ్గించుకున్నారు. కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన నిర్ణయాలను క్లయింట్లు వాయిదా వేస్తున్నారు. ఆదాయ వృద్ధి మందగించడంతో ఐటీ కంపెనీలు తమ నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇందులో భాగంగానే ఉద్యోగుల వేతనాల్లో కోతలు, కఠినమైన పనితీరు నిబంధనలు తెరపైకి వస్తున్నాయి.
ఇదీ చదవండి: బంగారం ధరలు రివర్స్.. తులం ఎంతంటే..


