రికార్డు కనిష్టానికి డౌన్
మరో 39 పైసలు తగ్గిన విలువ
96.20కి వద్ద ముగింపు
ముంబై: అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాల ప్రభావాలతో రూపాయి మారకం విలువ గణనీయంగా పతనమవుతోంది. డాలరుతో పోలిస్తే మరో 39 పైసలు క్షీణించి 96.20కి పడిపోయింది. సోమవారం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 95.81తో పోలిస్తే మరింత తక్కువగా 96.19 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. ఒక దశలో 96.39కి కూడా క్షీణించి చివరికి 96.20 వద్ద క్లోజయ్యింది.
పశ్చిమాసియా ఉద్రిక్తతలతో క్రూడాయిల్ రేట్లు పెరుగుతుండటం, డాలరు బలోపేతం కావడం తదితర అంశాలతో రూపాయిపై ఒత్తిడి పెరుగుతోందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. రాబోయే రోజుల్లోను ఇదే పరిస్థితి కొనసాగవచ్చని, అయితే, బంగారం, వెండి దిగుమతులపై ఆంక్షలతో పాటు ఒకవేళ రిజర్వ్ బ్యాంక్ గానీ జోక్యం చేసుకోవడంలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే కనిష్ట స్థాయిల్లో రూపాయికి మద్దతుగా నిలవొచ్చని మిరే అసెట్ షేర్‌ఖాన్ రీసెర్చ్ అనలిస్ట్ అనుజ్ చౌదరి తెలిపారు. స్పాట్ మార్కెట్లో రూపాయి 96–96.60 శ్రేణిలో తిరుగాడవచ్చని వివరించారు.


