మార్చి త్రైమాసికంలో రూ.1,776 కోట్లు
అన్ని రకాల ఇన్వెస్టర్ల నుంచి ఆసక్తి
జేఎల్ఎల్ ఇండియా నివేదిక వెల్లడి
భారత హోటల్ రంగం పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారింది. ఈ ఏడాది జనవరి–మార్చి కాలంలో ఈ రంగంలోకి 185 మిలియన్ డాలర్ల (రూ.1,776 కోట్లు సుమారు) పెట్టుబడులు వచ్చాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో 117 మిలియన్ డాలర్ల కంటే 58 శాతం అధికం కావడం విశేషం. భారత హోటల్ రంగం వృద్ధి అవకాశాల పట్ల ఇన్వెస్టర్లలో ఎంతో విశ్వాసం నెలకొన్నట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. ‘భారత్‌లో హోటల్ రంగంలో పెట్టుబడుల ధోరణులు: 2025’ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది.
2025లో భారత హోటల్ రంగంలోకి 567 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్టు తెలిపింది. మొత్తం 28 లావాదేవీలు నమోదైనట్టు వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన పెట్టుబడుల కంటే 67 శాతం పెరిగినట్టు పేర్కొంది. టైర్–1 నగరాల్లో 60 శాతం లావాదేవీలు చోటుచేసుకుంటే, మిగిలిన 40 శాతం టైర్–2, 3 నగరాల్లో జరిగాయి. గతేడాది కొత్తగా 103 బ్రాండెడ్ హోటళ్లు ప్రారంభమయ్యాయి. ఇదే ధోరణి ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనూ కొనసాగినట్టు తెలిపింది. నిర్వహణలోని హోటళ్లు, భూముల విక్రయం, ప్లాట్‌ఫామ్‌లను సొంతం చేసుకోవడం వంటి లావాదేవీలు ఇందులో ఉన్నాయి.
ఇక ముందూ జోరుగానే..
మార్చి త్రైమాసికంలో ఫ్లెర్ హోటల్స్ (లెమన్‌ట్రీ హోటల్స్ సబ్సిడరీ)లో 41 శాతం వాటాను వార్బర్గ్ పింకస్ సొంతం చేసుకుంది. తన పోర్ట్‌ఫోలియోలోని హోటళ్ల వృద్ధి కోసం 107 మిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత త్రైమాసికంలోనూ పెట్టుబడుల లావాదేవీలు జోరుగా ఉండొచ్చన్నది ఈ నివేదిక అంచనా. హోటల్ కంపెనీల వద్ద తగినన్ని నిల్వలు ఉండడం, హోటల్ ఆపరేటర్లు కొందరు క్యాపిటల్ మార్కెట్లలోకి వచ్చే అవకాశాలున్నట్టు తెలిపింది. ఇనిస్టిట్యూషన్స్, ప్రైవేటు ఈక్విటీ (పీఈ) సంస్థలు సైతం హోటల్ పోర్ట్‌ఫోలియోల కొనుగోలు పట్ల ఆసక్తి చూపిస్తున్నట్టు పేర్కొంది. అలాగే, హెచ్ఎన్ఐలు, ఫ్యామిలీ ఆఫీస్‌లు, ప్రైవేటు హోటల్ యజమానులు, లిస్టెడ్ హోటల్ కంపెనీలు, డెవలపర్లు పెట్టుబడులకు ముందుకొస్తున్నట్టు తెలిపింది.
ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు!


