కార్ల కొనుగోలుదారులపై డబుల్ ఇంపాక్ట్‌ | Double Shock Awaits Middle Class Car Buyers Mileage Ratings WLTP CAFE 3 Norms | Sakshi
Sakshi News home page

కార్ల కొనుగోలుదారులపై డబుల్ ఇంపాక్ట్‌

May 19 2026 4:57 PM | Updated on May 19 2026 5:10 PM

Double Shock Awaits Middle Class Car Buyers Mileage Ratings WLTP CAFE 3 Norms

సొంత కారు కొనానుకునే మధ్యతరగతి వినియోగదారుడిపై త్వరలోనే డబుల్ ఇంపాక్ట్‌ పడబోతోంది. వాహనంలో ఎలాంటి సాంకేతిక మార్పులు చేయకపోయినా.. పేపర్‌పై కనిపించే మైలేజీ (లేదా రేంజ్) గణనీయంగా తగ్గిపోనుంది. అదే సమయంలో కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. భారత ఆటోమొబైల్ రంగంలో అత్యంత కీలకమైన మార్పునకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ప్రస్తుతం దేశంలో వాడుకలో ఉన్న ‘మాడిఫైడ్ ఇండియన్ డ్రైవింగ్ సైకిల్’(ఎంఐడీసీ) స్థానంలో మరింత కఠినమైన అంతర్జాతీయ ప్రమాణాల గుర్తింపు పొందిన ‘వరల్డ్‌వైడ్ హార్మోనైజ్డ్ లైట్ వెహికల్స్ టెస్ట్ ప్రొసీజర్’ (డబ్ల్యూఎల్‌టీపీ) విధానాన్ని 2027 ఏప్రిల్ 1 నుంచి ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీనికి తోడు, ఇంధన సామర్థ్యాన్ని మరింత కఠినతరం చేసే కేఫే-3 (కార్పొరేట్‌ యావరేజ్‌ ఫ్యుయెల్‌ ఎకానమీ) నిబంధనలను కూడా ప్రభుత్వం అదే సమయంలో అమలు చేయనుంది. ఈ జంట నిర్ణయాల వల్ల పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాల సర్టిఫైడ్ సామర్థ్యం ఏకంగా 10 నుంచి 20 శాతం వరకు పడిపోనుంది.

మైలేజీ లెక్కలు ఎలా మారనున్నాయంటే?

పరిశ్రమ నిపుణుల ప్రకారం.. ఈ కొత్త టెస్టింగ్ విధానం వల్ల వాహనాల నిజమైన సామర్థ్యం ఏమీ తగ్గిపోదు. ప్రస్తుత టెస్టింగ్ విధానం కంటే డబ్ల్యూఎల్‌టీపీ విధానం రోడ్డుపై వాహనం నడిపే నిజమైన (రియల్‌ వరల్డ్‌) పరిస్థితులకు అత్యంత దగ్గరగా ఉంటుంది. ఫలితంగా సర్టిఫైడ్ మైలేజీ గణాంకాలు మారుతాయి.

పెట్రోల్ కార్లు: ప్రస్తుతం లీటరుకు 25 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే పెట్రోల్ కారు కొత్త ప్రమాణాల ప్రకారం 21 నుంచి 22 కిలోమీటర్లకు పరిమితం కానుంది.

ఎలక్ట్రిక్ వాహనాలు: ఒకసారి చార్జ్ చేస్తే 500 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీలు చెబుతున్న ఈవీల రేంజ్.. కొత్త నిబంధనల ప్రకారం 430 - 450 కిలోమీటర్లకు పడిపోనుంది. ‘వాహనం మోడల్, దాని కాన్ఫిగరేషన్‌ను బట్టి అధికారిక ఇంధన సామర్థ్య గణాంకాలు 10 నుంచి 20 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది’ అని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ క్లీన్ ట్రాన్స్‌పోర్టేషన్(ఐసీసీటీ) ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ భట్ అన్నారు.

ఆటోమొబైల్ సంస్థల ముందు జంట సవాళ్లు

ఒకేసారి కేఫే-3, డబ్ల్యూఎల్‌టీపీ నియమాలను తీసుకురావడం వాహన తయారీదారులకు సవాలుగా మారనుంది.

కేఫే-3 నిబంధన: కంపెనీలు విక్రయించే మొత్తం వాహనాల సగటు కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల పరిమితిని ఇది మరింత తగ్గిస్తుంది.

డబ్ల్యూఎల్‌టీపీ విధానం: ఉద్గారాలను లెక్కించే పద్ధతినే ఇది పూర్తిగా మార్చేస్తుంది. ల్యాబ్‌లలో కాకుండా.. గరిష్ట వేగం, వేగవంతమైన యాక్సిలరేషన్, నిజమైన రోడ్డు పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఉద్గారాలను లెక్కిస్తారు. దీనివల్ల కేఫే-3 లక్ష్యాలను అందుకోవడం కంపెనీలకు మరింత భారంగా మారుతుంది.

ఏయే కార్ల ధర ఎంత పెరగొచ్చు?

కొత్త ఉద్గారాల నిబంధనలను అందుకోవడానికి కార్ల కంపెనీలు అధునాతన సాంకేతికతను జోడించాల్సి ఉంటుంది. ఫలితంగా వాహనాల తయారీ వ్యయం పెరిగి ఆ భారం వినియోగదారుడిపై పడనుంది.

కార్ల విభాగంఆవశ్యక సాంకేతిక మార్పులుపెరగనున్న అంచనా ధర (రూపాయల్లో)
ఎంట్రీ-లెవల్ చిన్న కార్లుఅప్‌గ్రేడెడ్‌ ఇంజిన్ మేనేజ్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్‌, కొత్త ఫ్యూయల్ ఇంజెక్టర్లు, సెన్సార్లు30,000 - 50,000
ప్రీమియం హాచ్‌బ్యాక్‌, కాంపాక్ట్ ఎస్‌యూవీగ్యాసోలిన్ పార్టిక్యులేట్ ఫిల్టర్లు, క్యాటలిటిక్ కన్వర్టర్లు, మైల్డ్-హైబ్రిడ్ వ్యవస్థలు40,000 - 1,00,000
పెద్ద ఎస్‌యూవీ, ఎంపీవీభారీ సాంకేతిక మార్పులు, అధునాతన ఉద్గార నియంత్రణ వ్యవస్థలు1,20,000 - 2,00,000

‘డబ్ల్యూఎల్‌టీపీ విధానం వల్ల అధికారిక మైలేజీ గణాంకాలు తగ్గి ఉద్గారాల నమోదు పెరుగుతుంది. దీనివల్ల కేఫే-3 నిబంధనలను పాటించడం కంపెనీలకు మరింత వ్యయప్రయాసలతో కూడుకున్న పనిగా మారుతుంది’ అని మొబిలిటీ, ఎనర్జీ ట్రాన్సిషన్ నిపుణుడు రణ్‌ధీర్ సింగ్ విశ్లేషించారు.

Advertisement
 
Advertisement
Advertisement