స్పెషల్ ఎట్రాక్షన్
కమర్షియల్ సినిమాలో హీరో ఉంటారు. ఫైట్స్, పాటలు ఉంటాయి. అయినా అదనపు ఆకర్షణ కావాలి. ఆడియన్స్ కోసం ఓ ప్రత్యేక గీతం థియేటర్స్‌లో ప్లే అవ్వాలి. అందుకే కొందరు హీరోలు స్టోరీలో స్పెషల్ సాంగ్ చేసే స్కోప్ ఉంటే, సై అంటున్నారు. ఆ పాటలు చేయడానికి హీరోయిన్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రేక్షకులను ఉత్సాహపరిచే స్టెప్పులు వేస్తున్నారు. మరి... ఏ సినిమాలో ఏ నటి స్పెషల్‌గా కనిపించనున్నారో ఓసారి లుక్ వేయండి.జైలర్‌తో స్టెప్పుల్ మంచి కమర్షియల్ మోడ్‌లో కనిపిస్తున్నారు రజనీకాంత్. ఈ సీనియర్ హీరో నటించిన గత రెండు చిత్రాలు ‘జైలర్, కూలీ’ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌గా ఆడియన్స్‌ను అలరించాయి. అలాగే ఈ రెండు చిత్రాల్లోనూ స్పెషల్ సాంగ్స్ ఉన్నాయి. ‘జైలర్’ చిత్రంలోని ‘కావాలయ్యా..’ పాటలో తమన్నా అదిరిపోయే స్టెప్పులు వేస్తే, ‘కూలీ’ చిత్రంలోని ‘మోనికా..’ పాటలో పూజా హెగ్డే డ్యాన్స్ మూమెంట్స్‌ను ఇరగదీశారు. కాగా రజనీకాంత్ పూర్తి చేసిన తాజా చిత్రం ‘జైలర్ 2’లోనూ ఓ స్పెషల్ సాంగ్ ఉంది. ఈ సాంగ్‌ను బాలీవుడ్ నటి నోరా ఫతేహీ చేశారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ కూడా పూర్తయింది.‘జైలర్’ సినిమాకు దర్శకత్వం వహించిన నెల్సన్ దిలీప్ కుమార్ సీక్వెల్‌గా రానున్న ‘జైలర్ 2’ మూవీకి దర్శకత్వం వహించారు. రమ్యకృష్ణ, మిర్నా మీనన్, యోగిబాబు, మిథున్ చక్రవర్తి, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో మోహన్ లాల్, విజయ్ సేతుపతి, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారని తెలిసింది.సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ‘జైలర్ 2’ చిత్రం జూన్‌లో విడుదల కానుంది. ఈ సినిమాకి అనిరుధ్ స్వరకర్త. అన్నట్లు... నోరా ఫతేహీ గురించి మన తెలుగు ఆడియన్స్‌కు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే..‘బాహుబలి: ది బిగినింగ్’లో ‘మనోహరి’, ‘టెంపర్’లో ‘ఇట్టాగే రెచ్చిపోదాం పిల్లా..’ ఇలా పలు స్పెషల్ సాంగ్స్‌లో నోరా నర్తించిన సంగతి గుర్తుండే ఉంటుంది.స్పెషల్ ఎంట్రీ టాలీవుడ్‌కి స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు బాలీవుడ్ నటి మౌనీ రాయ్. చిరంజీవి హీరోగా నటించిన ‘విశ్వంభర’ చిత్రంలో మౌనీ రాయ్ ఓ స్పెషల్ సాంగ్ చేశారని తెలిసింది. దాదాపు వందమంది డ్యాన్సర్స్‌తో గణేష్ ఆచార్య కొరియోగ్రఫీలో ఈ పాటను చిత్రీకరించారు మేకర్స్. ఈ పాటలో చిరంజీవి, మౌనీ రాయ్ డ్యాన్స్ చేశారు. త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో చిరంజీవి చెల్లెళ్లుగా ఇషా చావ్లా, రమ్య పసుపులేటి వంటి హీరోయిన్లు నటించారని తెలిసింది. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మించారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ ‘విశ్వంభర’ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.మాస్ డ్యాన్స్ రామ్‌చరణ్ టైటిల్ రోల్లో నటించిన రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్‌లో హీరో రామ్ చరణ్‌తో కలిసి శ్రుతీహాసన్ అదిరిపోయే మాస్ స్టెప్పులు వేశారు. ఈ స్పెషల్ సాంగ్‌కు కుస్తీతో కూడిన ఓ కాన్సెప్ట్ కూడా ఉందట. అంతేకాదు... ఈ సినిమా హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఈ పాటలో కాలు కదిపారని సమాచారం. ఇదే నిజమైతే ఒకే ఫ్రేమ్‌లో చరణ్, జాన్వీ శ్రుతీహాసన్లను చూడటం మాస్ ఆడియన్స్‌కు థియేటర్స్‌లో విజిల్ వర్తీ మూమెంట్ అని చెప్పవచ్చు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.ఇక బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1970–1980 మధ్య కాలంలో సాగుతుంది. ఇందులో క్రాస్ ఓవర్ అథ్లెట్‌గా రామ్‌చరణ్ నటించారు. అంటే... ఈ చిత్రంలో రామ్‌చరణ్ క్రికెట్, కుస్తీ ఆడతారు. మరొక గేమ్ కూడా ఉంది. ఈ గేమ్‌పై త్వరలోనే స్పష్టత రానుంది. ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ, దివ్వేందు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ ‘పెద్ది’ సినిమా జూన్ 4న విడుదల కానుంది. మరోవైపు మహేశ్‌బాబు ‘ఆగడు’, అర్జున్ కపూర్ ‘తేవర్’ చిత్రాల్లో శ్రుతీహాసన్ స్పెషల్ సాంగ్స్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.ఆలియా ఆటా పాటా! ‘రౌద్రం... రణం... రుధిరం’ (ఆర్ఆర్ఆర్) సినిమాలో ఎన్టీఆర్, ఆలియా భట్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ ఇద్దరూ మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని తెలిసింది. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘డ్రాగన్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా తెలిసింది. ఈ పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. కాగా, ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాటకు స్కోప్ ఉంది.ఈ పాటలో నటిస్తారంటూ శ్రుతీహాసన్, రష్మికా మందన్నా, మృణాల్ ఠాకూర్ వంటి హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఈ పాటలో ఆలియా భట్ కనిపిస్తారనే ప్రచారం తాజాగా తెరపైకి వచ్చింది. ఇదే నిజమైతే, ‘డ్రాగన్’ సినిమా కోసం ఎన్టీఆర్, ఆలియా భట్ మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నట్లవుతుంది. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. నందమూరి కల్యాణ్‌రామ్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 11న విడుదల కానుంది. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.ది ప్యారడైజ్‌లో తమన్నా! స్పెషల్ సాంగ్స్‌కు ఓ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు హీరోయిన్ తమన్నా. అంతేకాదు... ఈ బ్యూటీ ఫలానా సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారంటే, ఆ సినిమా హిట్టవుతుందనే టాక్ కూడా ప్రచారంలోకి వచ్చింది. రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలో ‘కావాలయ్యా..’, కావొచ్చు, హిందీ చిత్రం ‘స్త్రీ 2’లో ‘ఆజ్ కీ రాత్’ కావొచ్చు, మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’లో ‘డాంగ్ డాంగ్..’ పాట కావొచ్చు... తమన్నా స్పెషల్ సాంగ్ చేశారంటే, ఆ సినిమాకు అది తప్పుకుండా ప్లస్ అవుతుంది. తాజాగా ‘ది ప్యారడైజ్’ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేసేందుకు తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో సికింద్రాబాద్ యువకుడు జడల్ పాత్రలో నాని నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌కు స్కోప్ ఉందట. దీంతో ఈ సాంగ్‌కు తమన్నా అయితే బాగుంటుందని మేకర్స్ అనుకుంటున్నారట. ఆ దిశగా సంప్రదింపులు మొదలయ్యాయని సమాచారం. అయితే ఈ ‘ది ప్యారడైజ్’ చిత్రంలో తమన్నా స్పెషల్ సాంగ్ చేయనున్న అంశంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఇక ఈ చిత్రంలో మోహన్‌బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమాను ఈ ఏడాది మార్చి 26న రిలీజ్ చేయాలనుకున్నారు. ఈ తేదీకి విడుదల కుదరకపోవడంతో, ఈ ఏడాది ఆగస్టు 21కి వాయిదా వేశారు. అయితే ఆగస్టు 21వ తేదీన కూడా ఈ సినిమా విడుదల కాకపోవచ్చని, అనుకున్న ప్రకారం ఈ సినిమా షూటింగ్ సాగడం లేదని, రీ షూట్స్ చేయాల్సి వస్తోందనే ప్రచారం జరిగింది. కానీ అలాంటిది ఏమీ లేదని, అనుకున్న ప్రకారమే ‘ది ప్యారడైజ్’ సినిమా చిత్రీకరణ జరుగుతోందని, ఆగస్టు 21న ఈ సినిమా విడుదల అవుతుందని టీమ్ మరోసారి స్పష్టత ఇచ్చింది.నేను రెడీ టాలీవుడ్‌కు వచ్చేందుకు నేను రెడీ అన్నారు బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ. స్పెషల్ సాంగ్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు ఈ బ్యూటీ. హిందీలో ‘హౌస్‌ఫుల్ 3, హౌస్‌ఫుల్ 5, 5 వెడ్డింగ్స్’ వంటి చిత్రాల్లో నటించారు నర్గీస్. అలానే సల్మాన్ ఖాన్ ‘కిక్’లో ‘యార్ నా మిలే’, తమిళ హీరో ప్రశాంత్ ‘సాగసం’లో స్పెషల్ సాంగ్స్ చేశారు నర్గీస్. ఇప్పుడు తెలుగు సినిమాకు వచ్చారు. హవీష్, కావ్యాథాపర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ‘నేను రెడీ’.ఈ చిత్రంలోని ఓ స్పెషల్ సాంగ్‌లో డ్యాన్స్ చేశారు నర్గీస్. టాలీవుడ్లో నర్గీస్ చేసిన తొలి సినిమా ఇదే. హార్నిక్స్ ఇండియా ఎల్ఎల్పీ పతాకంపై త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మించిన ఈ చిత్రం జూన్ రెండో వారంలో విడుదల కానుంది. బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, వీటీవీ గణేష్, గోపరాజు రమణ, హరితేజ, మహతి ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ ‘నేను రెడీ’ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.అలాగే ‘నేను రెడీ’ సినిమా విడుదల కాకముందే, తెలుగులో ఇంకో సినిమాలో మరో స్పెషల్ సాంగ్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారట నర్గీస్. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారని తెలిసింది. ముంబై నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్‌లో నర్గీస్ ఫక్రీ డ్యాన్స్ చేశారని తెలిసింది. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కావొచ్చు.బ్లాక్ గోల్డ్‌లో సీరత్ ఉమెన్ సెంట్రిక్ సినిమాల్లో అరుదుగా ప్రత్యేక పాటలు చూస్తుంటాం. హీరోయిన్ సంయుక్త నటించిన తొలి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘ది బ్లాక్‌గోల్డ్’. తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులోని బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఈ సినిమాను కేఎమ్‌సీ యోగేష్ దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మించారు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా నటించారు సంయుక్త. దేశాన్ని కుదిపేసిన కోల్ సిండికేట్ల బ్యాక్‌డ్రాప్‌లో నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.ఈ చిత్రంలో హీరోయిన్ సీరత్ కపూర్ స్పెషల్ సాంగ్ చేశారని తెలిసింది. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో ఈ పాటను రిలీజ్ చేయాలనుకుంటున్నారట మేకర్స్. ఈ సంగతి ఇలా ఉంచితే.. కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీకమల్, తన్వీ లీడ్ రోల్స్‌లో నటించిన ‘ఉషా పరిణయం’ (2024) చిత్రంలో సీరత్ కపూర్ ప్రత్యేక పాటలో మెరిశారు. ఇక శర్వానంద్ ‘రన్ రాజా రన్’లో హీరోయిన్గా నటించిన సీరత్ కపూర్ నాగార్జున ‘రాజుగారి గది 2’, అల్లు శిరీష్ ‘ఒక్క క్షణం’, రవితేజ ‘టచ్ చేసి చూడు’ వంటి చిత్రాల్లో కీ రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇంకా మరికొందరు తారలు స్పెషల్ సాంగ్స్ చేసేందుకు రెడీ అవుతున్నారని తెలిసింది.