Egg shell
-
పెంకులేకుండానే గుడ్లను పొదిగారు!
వాషింగ్టన్: అంతరించిపోయిన జీవులను డీఎన్ఏల సాయంతో మళ్లీ పునర్సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న అమెరికాలోని జీవసాంకేతికరంగ సంస్థ ‘కొలోసల్ బయోసైన్సెస్’తన ప్రయోగాల్లో కీలక విజయం సాధించింది. న్యూజిలాండ్‌లో చాలా శతాబ్దాల క్రితం అంతరించిపోయిన భారీ పక్షిజాతి ‘మోవా’ను పునర్సృష్టించే క్రతువులో మరో ముందడుగువేశామని కొలోసల్ బయోసైన్సెస్ తాజాగా ప్రకటించింది. మోవాకు జన్యువులపరంగా అత్యంత సారూప్యత ఉండే ఇతర జాతుల పక్షుల డీఎన్ఏతో సింథసిస్ చేసి తొలుత మోవా గుడ్డును తయారుచేయాలని సంకల్పించింది.అయితే ఆనాటి మోవాజాతి గుడ్డు సాధారణ కోడిగుడ్డు కంటే ఏకంగా గరిష్టంగా 80 రెట్లు పెద్దగా ఉంటుంది. ఇంతటి భారీ గుడ్డును పొదగాలంటే అంతపెద్దస్థాయిలో కృత్రిమ ఎగ్‌షెల్ అవసరం అవుతుంది. ఈ ప్రయోగాల్లో భాగంగా కృత్రిమమేధతో త్రిమితీయ(3డీ) ముద్రిత చిన్నపాటి ఎగ్‌షెల్‌ను తయారుచేశామని కంపెనీ ప్రకటించింది. ఇందులో సాధారణ కోడి గుడ్లలోని పచ్చ, తెల్లసొనలను బయటకుతీసి ఈ 3డీ ముద్రిత ఎగ్షెల్లో పెట్టి విజయవంతంగా పొదిగామని కంపెనీ మంగళవారం వెల్లడించింది. ప్రయోగంలో భాగంగా ఇలా ఇప్పటిదాకా 26 కోడిపిల్లలను సృష్టించారు. ఏఐ ఎగ్‌షెల్ ఎలా? పెంకును పగలగొట్టి పచ్చ, తెల్లసొనలను కప్పులాంటి ఇతర గోళాకార ఆకృతుల్లో పొదగడంపై గతంలోనూ చాలా మంది ప్రయోగాలు చేశారు. అయితే సహజసిద్ధ పెంకు నుంచి మాత్రమే సరిపడా ఆక్సిజన్ అందుతుంది. దాంతోనే లోపల గుడ్డు పొదుగుతుంది. ఇందుకోసం ఆక్సిజన్ సరైన మోతాదులో అందేలా లోపలివైపు జల్లెడ లాంటి దానిని కొలోసల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. దానికి బయటివైపు పారదర్శకంగా ఉండేలా మరో కణత్వచాన్ని తయారుచేశారు. వీటి సాయంతో పచ్చ,తెల్లసొనలు ఏమాత్రం పాడవకుండా సహజసిద్ధ వాతావరణాన్ని వాటికి అందించామని శాస్త్రవేత్తలు తెలిపారు. పచ్చ,తెల్లసొన కోడిపిల్లగా మారే క్రమంలో సాధారణ పెంకు నుంచి కాల్షియంను సంగ్రహించుకుంటుంది.ఇదే తరహాలో తాము కూడా ఈ ఏఐ ఎగ్‌షెల్ ద్వారా కాల్షియంను అందించామని పరిశోధకులు తెలిపారు. ఈ ఎగ్‌షెల్‌ను ఇంక్యుబేటర్‌లో పెట్టి సరిపడా వేడిని అందించి పొదిగారు. తమ ప్రయోగం విజయవంతంకావడంపై కొలోసల్ సంస్థ సీఈఓ బెన్లామ్ ఆనందం వ్యక్తంచేశారు. సింథటిక్ బయాలజీ పితామహుడిగా పేరొందిన అమెరికా దిగ్గజ బయోటెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్ జార్జ్ చర్చ్ ఆధ్వర్యంలో కొలోసల్ సంస్థ పనిచేస్తోంది. ‘‘కృత్రిమమేధతో పనిచేసే కృత్రిమ ఎగ్‌షెల్ సాంకేతికత మరింత అభివృద్ధి చెందితే భవిష్యత్తులో అంతరించిపోయిన పక్షిజాతులకూ తిరిగి ప్రాణం పోయవచ్చు. న్యూజిలాండ్‌లో ప్రాచీనకాలంలో కలియతిరిగిన మోవా జాతిని పునర్సృష్టించాలంటే దాని గుడ్డును మోయగలిగే భారీ పక్షిజాతులు ఇప్పుడులేవు. అందుకే ఇలా కృత్రిమ ఎగ్‌షెల్ తయారీకి పూనుకున్నాం’’అని బెన్లామ్ వివరించారు. -
ఫిరంగి పరిమాణంలో గుడ్లు... డైనోసార్లలో మరోజాతి
కాల్సైట్ స్పటికాల సముహాలతో నిండి... ఫిరింగి పరిమాణంలో ఉన్న డైనోసార్ గుడ్లను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇవి చైనాలో అన్హుయ్ ప్రావిన్స్‌లోని కియాన్షాన్లో గుర్తించారు. ఇవి రెండు దాదాపు సంపూర్ణ గుండ్రని గుడ్లని, క్రెటేషియస్ కాలం నాటివిగా పేర్కొన్నారు. అంతేగాదు ఇవి డైనోసార్ల యుగంలో చివరి కాలంనాటివిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డైనోసార్లలోనే ఇవి ఒక కొత్త జాతిగా భావిస్తున్నారు. ఎందుకంటే గుడ్ల పరిమాణం, షెల్ యూనిట్, గట్టి అమరిక, ప్రత్యేకమైన గోళాకార ఆకృతి తదితరాలను బట్టి పాలియోంటాలజిస్టులు డైనోసార్లలో కొత్త జాతికి చెందినవిగా పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆ గుడ్లలో ఒకటి సరిగా సంరక్షించబడలేదని చెప్పారు. అందువల్లే వాటి అంతర్గత సముహాల్లో కాల్సైట్ స్పటికాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఇవి దాదాపు గోళాకారంగా ఉండి, పొడవు 4.1 అంగుళాలు నుంచి 5.3 అంగుళాల మధ్య, వెడల్పు 3.8 అంగుళాల నుంచి 5.2 అంగుళాల మధ్య ఉంటుంది. ఈ డైనోసార్లు చిన్నచిన్న మొక్కలను ఆహారంగా తినే బైపెడల్ డైనోసార్లగా శాస్తవేత్తలు పేర్కొన్నారు. (చదవండి: భారీ ఎత్తున ఎగిసిపడిన మంటలు.. షాకింగ్ దృశ్యాలు వైరల్) -
గుడ్డు తింటున్నారు సరే.. పెంకు పారేస్తారేం!
సాధారణంగా గుడ్ల పెంకులను బయట పారవేస్తుంటాం కదా. అయితే ఆ పెంకుల వల్ల ఉన్న ప్రయోజనాలు తెలిస్తే కచ్చితంగా మనం ఇక నుంచి పారవేయడం ఆపేస్తామని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. గుడ్డు పెంకును మనం స్వీకరిస్తే శరీరానికి కావలసిన క్యాల్షియం లభిస్తుందంటా. దీనిద్వారా ఎముకలు, దంతాలు మరింత గట్టిపడుతాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే నేరుగా కాకుండా.. గుడ్డు పెంకులను పొడిగా చేసుకుని తినాలని తెలిపారు. అలా ప్రతిరోజు సగం టేబుల్ స్పూన్ తీసుకుంటే ఆ రోజుకు మనకు కావల్సిన క్యాల్షియంలో 90 శాతం అందుతుందని, 1,000 నుంచి 1,500 మిల్లీగ్రాముల క్యాల్షియం ఎముకలు, దంతాలకు అందుతుందని తాజా సర్వేలు చెబుతున్నాయి. ఉరుకులు పరుగుల జీవితంలో ఎంతో మంది సూర్యకాంతిని పొందలేకపోతున్నారు. అలాంటి వారికి డి విటమిన్ లోపం ఏర్పడుతుంది. డి విటమిన్ లోపం తలెత్తితే ఎముకలు, దంతాలకు సరిపడ క్యాల్షియం అందదు. తద్వారా మనం త్వరగా అలసిపోవడం, పనిలో చికాకు రావడం జరుగుతుంటుంది. అందుకే గుడ్డు పెంకు పొడిని నీళ్లు లేదా పాలలో కలుపుకుని తాగితే క్యాల్షియం సమస్య సులువుగా పరిష్కారమవుతుంది.


