26 కోడిపిల్లలను సృష్టించామని వెల్లడించిన కొలోసల్ బయోసైన్సెస్
కృత్రిమమేధ సాయంతో 3డీ ముద్రిత ఎగ్‌షెల్‌ను తయారుచేసిన బయోటెక్నాలజీ సంస్థ
వాషింగ్టన్: అంతరించిపోయిన జీవులను డీఎన్‌ఏల సాయంతో మళ్లీ పునర్‌సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న అమెరికాలోని జీవసాంకేతికరంగ సంస్థ ‘కొలోసల్ బయోసైన్సెస్’తన ప్రయోగాల్లో కీలక విజయం సాధించింది. న్యూజిలాండ్‌లో చాలా శతాబ్దాల క్రితం అంతరించిపోయిన భారీ పక్షిజాతి ‘మోవా’ను పునర్‌సృష్టించే క్రతువులో మరో ముందడుగువేశామని కొలోసల్ బయోసైన్సెస్ తాజాగా ప్రకటించింది. మోవాకు జన్యువులపరంగా అత్యంత సారూప్యత ఉండే ఇతర జాతుల పక్షుల డీఎన్‌ఏతో సింథసిస్ చేసి తొలుత మోవా గుడ్డును తయారుచేయాలని సంకల్పించింది.
అయితే ఆనాటి మోవాజాతి గుడ్డు సాధారణ కోడిగుడ్డు కంటే ఏకంగా గరిష్టంగా 80 రెట్లు పెద్దగా ఉంటుంది. ఇంతటి భారీ గుడ్డును పొదగాలంటే అంతపెద్దస్థాయిలో కృత్రిమ ఎగ్‌షెల్ అవసరం అవుతుంది. ఈ ప్రయోగాల్లో భాగంగా కృత్రిమమేధతో త్రిమితీయ(3డీ) ముద్రిత చిన్నపాటి ఎగ్‌షెల్‌ను తయారుచేశామని కంపెనీ ప్రకటించింది. ఇందులో సాధారణ కోడి గుడ్లలోని పచ్చ, తెల్లసొనలను బయటకుతీసి ఈ 3డీ ముద్రిత ఎగ్‌షెల్‌లో పెట్టి విజయవంతంగా పొదిగామని కంపెనీ మంగళవారం వెల్లడించింది. ప్రయోగంలో భాగంగా ఇలా ఇప్పటిదాకా 26 కోడిపిల్లలను సృష్టించారు.
ఏఐ ఎగ్‌షెల్ ఎలా?
పెంకును పగలగొట్టి పచ్చ, తెల్లసొనలను కప్పులాంటి ఇతర గోళాకార ఆకృతుల్లో పొదగడంపై గతంలోనూ చాలా మంది ప్రయోగాలు చేశారు. అయితే సహజసిద్ధ పెంకు నుంచి మాత్రమే సరిపడా ఆక్సిజన్ అందుతుంది. దాంతోనే లోపల గుడ్డు పొదుగుతుంది. ఇందుకోసం ఆక్సిజన్ సరైన మోతాదులో అందేలా లోపలివైపు జల్లెడ లాంటి దానిని కొలోసల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. దానికి బయటివైపు పారదర్శకంగా ఉండేలా మరో కణత్వచాన్ని తయారుచేశారు. వీటి సాయంతో పచ్చ,తెల్లసొనలు ఏమాత్రం పాడవకుండా సహజసిద్ధ వాతావరణాన్ని వాటికి అందించామని శాస్త్రవేత్తలు తెలిపారు. పచ్చ,తెల్లసొన కోడిపిల్లగా మారే క్రమంలో సాధారణ పెంకు నుంచి కాల్షియంను సంగ్రహించుకుంటుంది.
ఇదే తరహాలో తాము కూడా ఈ ఏఐ ఎగ్‌షెల్ ద్వారా కాల్షియంను అందించామని పరిశోధకులు తెలిపారు. ఈ ఎగ్‌షెల్‌ను ఇంక్యుబేటర్‌లో పెట్టి సరిపడా వేడిని అందించి పొదిగారు. తమ ప్రయోగం విజయవంతంకావడంపై కొలోసల్ సంస్థ సీఈఓ బెన్‌లామ్ ఆనందం వ్యక్తంచేశారు. సింథటిక్ బయాలజీ పితామహుడిగా పేరొందిన అమెరికా దిగ్గజ బయోటెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్ జార్జ్ చర్చ్ ఆధ్వర్యంలో కొలోసల్ సంస్థ పనిచేస్తోంది. ‘‘కృత్రిమమేధతో పనిచేసే కృత్రిమ ఎగ్‌షెల్ సాంకేతికత మరింత అభివృద్ధి చెందితే భవిష్యత్తులో అంతరించిపోయిన పక్షిజాతులకూ తిరిగి ప్రాణం పోయవచ్చు. న్యూజిలాండ్‌లో ప్రాచీనకాలంలో కలియతిరిగిన మోవా జాతిని పునర్‌సృష్టించాలంటే దాని గుడ్డును మోయగలిగే భారీ పక్షిజాతులు ఇప్పుడులేవు. అందుకే ఇలా కృత్రిమ ఎగ్‌షెల్ తయారీకి పూనుకున్నాం’’అని బెన్‌లామ్ వివరించారు.


