ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడే అవినీతిని ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. గురజాల నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ కేసును నీరుకార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ కేసు నుంచి టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుని రక్షించడానికి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోందని ఉమ్మారెడ్డి ధ్వజమెత్తారు. భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని హైకోర్టు రిపోర్ట్ ఇచ్చిందన్నారు. అమాయకులపై కేసులు పెట్టి యరపతినేని ఈ కేసులనుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని తెలిపారు. అక్రమ మైనింగ్ క్వారీలను తాము పరిశీలిస్తే నిజాలు బయటకోస్తాయని టీడీపీకి భయం పట్టుకుందని ఉమ్మారెడ్డి నిప్పులు చెరిగారు. ఖచ్చితంగా అక్రమమైనింగ్ క్వారీలను పరిశీలిస్తామని, ఎన్ని అరెస్టులు చేసినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.