సీఎం చంద్రబాబు దీక్ష చేసింది ప్రత్యేక హోదా కోసం కాదని, తన పుట్టినరోజును అధికారికంగా జరుపుకున్నారని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వప్రయోజనాలే చూసుకుంటున్నాయని విమర్శించారు. ప్రత్యేక హోదా అంశంపై వైఎస్సార్ సీపీ నాలుగేళ్లుగా పోరాటం చేస్తోందని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామన్నారు. తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ దీక్ష కూడా చేపట్టారని తెలిపారు.