ఇంకా పురిటి వాసన కూడా పోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు దీక్షలు, ధర్నాల పేరిట బురద జల్లే ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ మండిపడ్డారు. కనీసం ఐదు నెలలు అధికారం లేకుండా చంద్రబాబు ఉండలేకపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. పేద ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు. వర్ధంతికి, జయంతికి తేడా తెలియనివారు టీడీపీని నడపడం సిగ్గుచేటని వంశీ విమర్శించారు. స్థానిక దావాజిగూడెం రోడ్డులోని ఆయన నివాసంలో గురువారం విలేకరుల సమావేశంలో చంద్రబాబుపై ఆయన ధ్వజమెత్తారు.